పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-699-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని కరుణాకరుండగు న వ్విభుండు మెల్లన య య్యంభశ్చర డింభకంబునుఁ గమండలు జలంబునం బెట్టి తన నెలవునకుం గొని పోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము చాలక రాజన్యున కి ట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; కరుణాకరుడు = దయామయుడు; అగున్ = అయిన; ఆ = ఆ; విభుండు = రాజు; మెల్లన = మెల్లిగా; ఆ = ఆ; అంభశ్చర = చేప {అంభశ్చరము - అంభస్ (నీటిలో) చరించెడిది, చేప}; డింభకంబున్ = పిల్లను; కమండలు = కమండలపు; జలంబునన్ = నీటిలో; పెట్టి = పెట్టి; తన = తన యొక్క; నెలవున్ = నివాసమున; కున్ = కు; కొనిపోయెన్ = తీసుకుని వెళ్ళను; అదియున్ = అది; ఒక్క = ఒక; రాత్రంబునన్ = రాత్రిలో; గుండికన్ = దాక {గుండిగ - వెడల్పుగా ఉండెడి లోహపాత్ర, దాక}; నిండి = నిండిపోయి; తన = తన; కున్ = కు; ఉండన్ = ఉండుటకు; ఇమ్ము = చోటు; చాలక = సరిపోక; రాజన్యున్ = రాజున; కున్ = కు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

అలా చేప పిల్ల పలికిన మాటలు విని కరుణాహృదయుడైన ప్రభువు సత్యవ్రతుడు, దానిని తన కమండలంలోని నీళ్ళలోకి ఎక్కించి, తన నివాసానికి తీసుకుని వెళ్ళాడు. ఆ చేప పిల్ల రాత్రి గడిచేసరికి పెరిగి కమండంలం నిండి పోయింది. దానికి ఉండటానికి కమండంలంలో చోటు చాలక రాజుతో ఇలా అన్నది.