పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-695-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, నొక్కనాఁ డమ్మేదినీ కాంతుండు గృతమాలిక యను నేటి పొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు జేయు చున్న సమయంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల దవిలివచ్చిన నులికిపడి, మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె; నట్లు విడి వడి నీటిలో నుండి జలచరపోతంబు భూతలేశ్వరున కి ట్లనియె.

టీకా:

మఱియున్ = మరి; ఒక్క = ఒక; నాడు = దినమున; ఆ = ఆ; మేదినీకాంతుడు = రాజు; కృతమాలిక = కృతమాలిక; అను = అనెడి; ఏటి = కాలువ; పొంతన్ = దగ్గర; హరి = విష్ణునికి; సమర్పణంబు = సమర్పించినిది; కాన్ = అగునట్లు; జలతర్పణంబున్ = సంధ్యవార్చుట; చేయుచున్న = చేసెడి; సమయంబునన్ = సమయమునందు; ఆ = ఆ; రాజు = రాజుయొక్క; దోసిటన్ = దోసిలి లోనికి {దోసిలి - పాత్రవలె వంపబడిచేర్ఛినచేతులజంట, దోయిలి}; ఒక్క = ఒక; మీను = చేప; పిల్ల = పిల్ల; తవిలి = తగుల్కొని; వచ్చినన్ = రాగా; ఉలికిపడి = ఉలిక్కిపడి; మరలన్ = తిరిగి; తరంగిణీ = ఏటి {తరంగిణి - నీటి అలలుగలది, నది}; జలంబునన్ = నీటి; అందున్ = లో; శకుల = బేడిస చేప; శాబకంబు = పిల్ల; విడిచెన్ = వదలెను; అట్లు = అలా; విడివడి = విడువబడి; నీటి = నీటి; లోన్ = లోపల; ఉండి = ఉండి; జలచర = చేప {జలచరము - నీటతిరుగునది, చేప}; పోతంబు = పిల్ల; భూతలేశ్వరున్ = రాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఒకనాడు సత్యవ్రతుడు కృతమాలిక అనే నది వద్ద విష్ణువుకు ప్రీతి కలిగేలా నీళ్ళతో తర్పణం వదులు తున్నాడు. ఆ సమయంలో అతని దోసిలిలోనికి ఒక చేపపిల్ల వచ్చి చేరింది. అతను ఉలిక్కిపడి, ఆ చేపపిల్లను మరల నదినీటిలోకి వదలిపెట్టాడు. ఆ చేపపిల్ల నీటిలోనుండి రాజు సత్యవ్రతుడితో ఇలా అన్నది.