పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలిని బంధించుట

  •  
  •  
  •  

8-646-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లిదండ్రులు నన్నమ్ములు చెలికాండ్రు-
గురువులు శిక్షింపఁ గొఱతపడునె?
పిదప మేలగుఁ గాక; పృథుమదాంధులకును-
దానవులకు మాకుఁ ఱియెఱింగి
విభ్రంశచక్షువు వెలయ నిచ్చుటఁ జేసి-
గురువులలోనాదిగురువ వీవ;
నీవు బంధించిన నిగ్రహమో లజ్జ-
యో నష్టియో బాధయో తలంప

8-646.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిన్నునెదిరించి పోరాడి నిర్జరాదు
లాదియోగీంద్రు లందెడు ట్టి టెంకి
నందరే తొల్లి పెక్కండ్రు? ర్షమూర్తి!
యీశ! నీ యెడ దుర్లభ మేమి కలదు?

టీకా:

తల్లిదండ్రులున్ = అమ్మనాన్నలు; అన్నదమ్ములున్ = సోదరులు; చెలికాండ్రు = స్నేహితులు; గురువులు = గురువులు; శిక్షింపన్ = దండించినచో; కొఱతపడునె = నష్టంకలుగునా, కలుగదు; పిదపన్ = ఆ తరువాత; మేలు = మంచి; అగుగాక = అయితీరును; పృథు = అతిమిక్కిలి; మద = గర్వముచేత; అంధులు = గుడ్డియైనవారల; కునున్ = కు; దానవుల్ = రాక్షసుల; కున్ = కు; మా = మా; కున్ = కు; తఱి = తగినసమయము; ఎఱింగి = తెలిసికొని; విభ్రంశచక్షువున్ = కనిపించనికళ్ళకు; వెలయన్ = వెలుగెడిచూపును; ఇచ్చుటన్ = ఇచ్చుట; చేసి = వలన; గురువుల = గురువుల; లోన్ = అందు; ఆదిగురువవు = ఆదిగురువైనవాడవు; ఈవ = నీవే; నీవు = నీవు; బంధించినన్ = బంధించినచో; నిగ్రహమో = శిక్ష యనికాని; లజ్జయో = సిగ్గు యనికాని; నష్టియో = నష్టము యనికాని; బాధయో = బాధ యనికాని; తలంపన్ = అనుకొనను.
నిన్నున్ = నిన్ను; ఎదిరించి = ఎదిరించి; పోరాడి = యుద్ధములుచేసి; నిర్జరులు = దేవతలు {నిర్జరులు - జర (ముసలితనము) లేనివారు, వేల్పులు}; ఆదులు = మున్నగువారు; యోగీంద్రులున్ = యోగీశ్వరులు; అందెడు = చెందెడిది; అట్టి = అటువంటి; టెంకిన్ = స్థానమును; అందరే = అందుకొలేదా; తొల్లి = ఇంతకుముందు; పెక్కండ్రు = అనేకులు; హర్షమూర్తి = ఆనందస్వరూపి; ఈశ = భగవంతుడ; నీ = నీ; ఎడన్ = అందు; దుర్లభము = సాధ్యముకానిది; ఏమికలదు = ఏముంది, ఏమీలేదు.

భావము:

ఓ పరమేశ్వరా! ఆనందస్వరూపా! తల్లితండ్రులూ, అన్నదమ్ములూ, మిత్రులూ, గురువులూ, బుద్ధిచెప్పడంతో ఏమీ నష్టం కలుగదు. దానివల్ల తరువాత మేలే కలుగుతుంది. మదంతో కన్నులు కనిపించని మావంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదరిపోకుండా వెలిగే చూపును ఇచ్చావు. అందువల్ల నీవు గరువులలో మొదటిగురువు అయ్యావు. నీవు నన్ను బంధించడం శిక్షగాగాని సిగ్గుగా కానీ లోటుగా కానీ బాధగా కానీ నేను భావించను. ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్నుఎదిరించి పోరాడి యోగీశ్వరులు పొందే స్థానాన్ని పొందారుకదా స్వామీ! నీ దగ్గర అసాధ్యం అన్నది ఏముంది?