పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలిని బంధించుట

  •  
  •  
  •  

8-643-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"సూనృతంబుఁ గాని సుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!

టీకా:

సూనృతంబు = సత్యమైనదానిని; కాని = తప్పించి; సుడియదు = పొడచూపదు; నా = నా యొక్క; జిహ్వన్ = నాలుక యందు; బొంకజాల = అబద్ధము చెప్పలేను; నా = నా; కున్ = అందు; బొంకు = అసత్యము; లేదు = లేదు; నీ = నీ యొక్క; తృతీయ = మూడవ (3); పదమున్ = అడుగును; నిజమున్ = తథ్యముగా; నా = నా యొక్క; శిరమునన్ = తలపైన; నెలవు = వసించునట్లు; చేసి = చేసి; పెట్టు = పెట్టుము; నిర్మల = స్వచ్ఛమైన; ఆత్మ = మనసు కలవాడా.

భావము:

ఓ పుణ్యాత్ముడా! సత్యం కానిది నా నాలుకమీద పుట్దనే పుట్టదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా!
మూడడుగులు దానంగా గ్రహించిన, వామనుడు త్రివిక్రమావతారం ధరించి రెండు అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు, సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి ‘నీ పాదం నా తలమీద పెట్టు పరమేశా!’ అని ఇలా సమాధానం చెప్తున్నాడు.