పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలిని బంధించుట

  •  
  •  
  •  

8-638-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు గావున రణంబున శత్రుల కిప్పు డెదురు మోహరించుట కార్యంబుఁ గాదు; మనకుం దగు కాలంబున జయింతము; నలంగక తొలఁగుఁ" డనిన దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసాతలంబునకుం జని; రంత హరి హృదయం బెఱింగి తార్క్షనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాశంబుల నసురవల్లభుని బంధించె; నంత.

టీకా:

అట్లుగావున = అందుచేత; రణంబునన్ = యుద్ధమునందు; శత్రుల్ = శత్రువుల; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; ఎదురు = ఎదురునిల్చి; మోహరించుట = వ్యూహములు పన్నుట; కార్యంబు = తగినపని; కాదు = కాదు; మన = మన; కున్ = కు; తగు = తగినట్టి; కాలంబునన్ = కాలంకలిసివచ్చి నప్పుడు; జయింతము = గెలిచెదము; నలంగక = అనవసరశ్రమ పడక; తొలంగుడు = తప్పుకొనుడు; అనినన్ = అనగా; తలంగి = తప్పుకొని; భాగవత = భగవంతుని, విష్ణు; భట = భటుల యెడ; భీతులు = భయపడువారు; ఐ = అయ్యి; చిక్కి = తగ్గి; రక్కసులున్ = రాక్షసులు; రసాతలంబున్ = రసాతలమున; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అప్పుడు; హరి = విష్ణుని; హృదయంబున్ = మనసు; ఎఱింగి = తెలిసికొని; తార్క్షనందనుండు = గరుడుడు {తార్క్షనందనుడు - తార్క్షు ని (కశ్యపుని) కొడుకు, గరుడుడు}; యాగసుత్య = యాగముచివర సుత్య చేసెడి {సుత్య - స్నానము, సోమలతను కొట్టిపిడుచుట, సోమపానము}; అహంబునన్ = దినమున; వారుణపాశంబులన్ = వరుణపాశములతో; అసురవల్లభుని = బలిచక్రవర్తిని; బంధించెను = బంధించెను; అంత = అంతట.

భావము:

కనుక, ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైన సమయంలో గెలువవచ్చు. అనవసరంగా శ్రమపడకుండా తొలగిపొండి.” అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణుభక్తులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయారు. అటుపిమ్మట యాగంలో సోమపానంచేసే చివరి దినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకుని గరుడుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు.