పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు దాన మడుగుట

  •  
  •  
  •  

8-575-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.

టీకా:

ఆశా = ఆశ యనెడి; పాశంబు = తాడు; తాన్ = అది; కడున్ = మిక్కిలి; నిడుపు = పొడవైనది; లేదు = లేదు; అంతంబు = అంతు; రాజేంద్రా = చక్రవర్తి; వారాశి = సముద్రముచే {వారాశి - నీటికికుప్ప, కడలి}; ప్రావృత = చుట్టబడిన; మేదినీ = భూ; వలయ = మండల; సామ్రాజ్యంబున్ = సామ్రాజ్యములు; చేకుడియున్ = సమకూరినప్పటికి; గాసిన్ = శ్రమను; పొందిరి = పడిరి; కాక = కావచ్చుకాని; వైన్య = పృథుడు; గయ = గయుడు యనెడి; భూకాంతులున్ = చక్రవర్తులుకూడ; అర్థ = సంపదలపైన; కామ = కామములపైన; ఆశన్ = ఆశను; పాయగన్ = వదలుట; నేర్చిరే = చేయగలిగిరా, లేదు; మును = ఇంతకుముందు; నిజ = తమ; ఆశ = ఆశలకు; అంతంబున్ = అంతును; చూచిరే = కనుగొనగలిగిరా, లేదు.

భావము:

బలి రాక్షస మహారాజా! ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృధుచక్రవర్తీ గయుడూ మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు. వారు సైతం వృథాగా కష్టపడినవారే కానీ అర్థంమీదా కామంమీదా ఆశలను వదలుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంతు చూడలేదు కదా.