పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-546-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుం బోలె ముందట నకుటిలుండును, జటిలుండును, సదండఛత్రుండునుఁ, గక్షలంబిత భిక్షాపాత్రుండునుఁ, గరకలిత జల కమండలుండును, మనోహరవదన చంద్రమండలుండును, మాయావాదన నటుండును నగు వటునిం గని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునఁ దిరోహితులై భృగువులుఁ గూర్చున్న యెడల లేచి క్షేమం బడిగి తియ్యని మాటల నాదరించిరి; బలియును నమస్కరించి తగిన గద్దియ నునిచి, పాదంబులుఁ దుడిచి తన ప్రాణవల్లభ పసిండి గిండియల నుదకంబు పోయ వడుగు కొమరుని చరణంబులఁ గడిగి తడి యొత్తి తత్సమయంబున.

టీకా:

అని = అని; దీవించి = దీవించి; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆది = మున్నగు; అవయవంబులున్ = అవయవములను; ధరించిన = స్వీకరించిన; వేద = వేదముల; రాశియున్ = సమూహము; పోలెన్ = సరిపోలి; ముందటన్ = ఎదురుగ; అకుటిలుండును = అమాయకుడు; జటిలుండును = జటలుకట్టినజుట్టు కలవాడు; సదండఛత్రుండునున్ = దండము గొడుగు గలవాడు; కక్షన్ = చంకలో; లంబిత = వేల్లాడుచున్న; భిక్షాపాత్రుండును = భిక్షాపాత్ర కలవాడు; కర = చేతిలో; కలిత = ఉన్నట్టి; జల = నీరుగల; కమండులుడును = కమండలము కలవాడు; మనోహర = అందమైన; వదన = మోము యనెడి; చంద్రమండలుండును = చంద్రమండలమువాడు; మాయావాదన = చతురోక్తులతో; నటుండును = వర్తించువాడు; అగు = అయిన; వటునిన్ = బ్రహ్మచారిని; కని = చూసి; దినకర = సూర్య {దినకరుడు - దినము (పగలును) కరుడు (కలిగించెడివాడు), సూర్యుడు}; కిరణ = కిరణములచే; పిహితంబులు = కప్పబడినవి; ఐన = అయిన; గ్రహంబుల = గ్రహముల; చందంబునన్ = వలె; తిరోహితులు = మరుగుపడినవారు; ఐ = అయ్యి; భృగువులున్ = భృగువంశపు బ్రాహ్మణులు; కూర్చున్న = కూర్చొనియున్న; ఎడలన్ = చోటులందు; లేచి = లేచినిలబడి; క్షేమంబున్ = కుశలప్రశ్నలు; అడిగి = అడిగి; తియ్యని = మృదువైన; మాటలన్ = మాటలతో; ఆదరించిరి = ఆదరముగ పలకరించిరి; బలియును = బలికూడ; నమస్కరించి = నమస్కారముచేసి; తగిన = యుక్తమైన; గద్దియను = ఆసనమున; ఉనిచి = కూర్చొనబెట్టి; పాదంబులున్ = పాదములను; తుడిచి = తుడిచి; తన = తనయొక్క; ప్రాణవల్లభ = ఇల్లాలు {ప్రాణవల్లభ - ప్రాణములతో సమానమైన వల్లభ (ప్రియురాలు), భార్య}; పసిండి = బంగారు; గిండియలన్ = చెంబులతో; ఉదకంబు = నీరు; పోయ = పోయగా; వడుగు = బ్రహ్మచారి; కొమరుని = పిల్లవాని; చరణంబులు = కాళ్ళు, పాదములు; కడిగి = కడిగి; తడి = తడిని; ఒత్తి = పొడిబట్టతోతుడిచి; తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు.

భావము:

అలా బలిని దీవించిన వామనుడు కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశివలె అతని ముందు నిలబడ్డాడు. జడలుకట్టిన జుట్టు, దండమూ, గొడుగు, కమండలం ధరించి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతున్నది. అతని ముఖం చంద్రబింబంవలె అందంగా వుంది. మాయా వాదనల చతురోక్తులు పలుకుటలో అతడు నేర్పరి. సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవెల పోయిన ఇతర గ్రహాలమాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయారు. వారు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి తియ్యని మాటలతో అతణ్ని గౌరవించారు. బలిచక్రవర్తి అతనికి మ్రొక్కి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అడుగులను తుడిచాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నీళ్ళు పోయగా, రాక్షస చక్రవర్తి ఆ వడుగు అడుగులు కడిగి తడి తుడిచాడు. ఆ సమయంలో. . .