పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-506-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్
శ్రణద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్
భునాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.

టీకా:

రవి = సూర్యుడు; మధ్యాహ్నము = మధ్యాహ్నము, సూర్యుడు ఆకాశము నట్ట నడుమ ఉండు సమయము; అందున్ = లో; చరింపన్ = తిరుగుచుండగ; గ్రహ = గ్రహములు; తార = నక్షత్రములు; చంద్ర = చంద్రుడు; భద్ర = ఉచ్ఛ; స్థితిన్ = దశలోనుండగ; శ్రవణద్వాదశి = శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి (పారమార్థిక పదకోశం, పొత్తూరి వేంకటేశ్వరరావు); నాడు = దినమున; శ్రోణ = శ్రవణనక్షత్రయుక్తమైన; అభిజిత్ = అభిజిత్తు {అభిజిత్తు - మిట్టమధ్యాహ్నము 24 నిమిషముల ముందునుండి 24 నిమిషములవరకు గల కాలము, దినమునందు 8వ ముహూర్తము, అభిజిత్ లగ్నము లేదా ముహూర్తము}; సంజ్ఞాత = అనెడి పేరుగల; లగ్నంబునన్ = లగ్నమునందు; భువనాధీశుడు = విష్ణువు {భువనాధీశుడు - భువన (జగత్తునకు) అధీశుడు (ప్రభువు), విష్ణువు}; పుట్టెన్ = జన్మించెను; వామన = పొట్టివాని; గతిన్ = వలె; పుణ్య = పుణ్యవంతమైన; వ్రత = వ్రతనిష్ఠలు; ఉపేత = కలిగి యున్నామె; కున్ = కు; దివిజాధీశ్వరుమాత = అదితి {దివిజాధీశ్వరుమాత - దివిజాధీశ్వరుని (ఇంద్రుని) మాత, అదితి}; పరమ = అత్యుత్తమమైన; పాతివ్రత్య = పతివ్రతగా; విఖ్యాత = ప్రసిద్ధిపొందినామె; కున్ = కు.

భావము:

అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన పిమ్మట, నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అదితి గర్భం నుండి వామన రూపంతో సకల లోకాధీశుడు అయిన మహావిష్ణువు జన్మించాడు. అది శ్రవణద్వాదశి అనగా శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి; అభిజిత్తు అనబడే లగ్నం; పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమ ప్రకాశిస్తున్నాడు; గ్రహాలూ నక్షత్రాలూ చంద్రుడూ ఉచ్ఛదశలో ఉన్నాయి. అట్టి శుభకర సమయంలో వామనుడు అవతరించాడు.