అష్టమ స్కంధము : దితి కశ్యపుల సంభాషణ
- ఉపకరణాలు:
బలి జగముల నెల్ల బలియుచు నున్నాఁడు
వాని గెలువరాదు వాసవునకు
యాగభాగమెల్ల నతఁ డాహరించుచుఁ
గడఁగి సురల కొక్క కడియుఁ నీఁడు.
టీకా:
ఎండకన్నెఱుగని = అతిసుకుమారియైన {ఎండకన్నెఱుగని - ఎండ (సూర్యకిరణముల) కన్ను (చూపునుకూడ) ఎఱుగని (తెలియని), మిక్కిలి సుకుమారమైన}; ఇంద్రుని = ఇంద్రుని యొక్క; ఇల్లాలు = భార్య; పలు = అనేకుల; పంచలను = చూర్లుయందు; జాలిబడియె = దీనత్వమున పడెను; నేడు = ఇవాళ; త్రిభువన = ముల్లోకముల; సామ్రాజ్య = మహారాజ్యాధికార; విభవంబున్ = వైభవమును; కోల్పోయి = నష్టపోయి; దేవేంద్రుడు = ఇంద్రుడు; అడవులన్ = అడవులమ్మట; తిరిగెన్ = తిరుగుచున్నాడు; నేడు = ఇవాళ; కలిమి = సంపదలకు; గారాబు = గారాల; బిడ్డలు = పిల్లలు; జయంత = జయంతుడు; ఆదులు = మున్నగువారు; శబర = బోయల; అర్భకుల = పిల్లల; వెంటన్ = తోకూడ; చనిరి = వెళ్ళుచున్నారు; నేడున్ = ఇవాళ; అమరుల్ = దేవతల; కున్ = కు; ఆధారము = నెలవైనది; అగు = అయిన; అమరావతి = అమరావతీపట్టణము; అసురుల్ = రాక్షసుల; కున్ = కు; ఆటపట్టు = అలవాలము; అయ్యెన్ = అయినది; నేడు = ఇవాళ.
బలి = బలి; జగములన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటియందు; బలియుచున్ = బలవంతుడు అగుచు; ఉన్నాడు = ఉన్నాడు; వానిన్ = అతనిని; గెలువరాదు = జయింపశక్యముకాదు; వాసవున్ = ఇంద్రున {వాసవుడు - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు}; కున్ = కు; యాగభాగము = హవిర్భాగములను; ఎల్లన్ = అంతటిని; అతడు = అతడే; ఆహరించుచున్ = దోచేసుకొనుచు; కడగి = పూని; సురల్ = దేవతల; కున్ = కు; ఒక్క = ఒక; కడియున్ = ముద్దకూడ; ఈడు = ఇవ్వడు.
భావము:
ఎండకన్నెరగని ఇంద్రుని ఇల్లాలు శచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్యసంపదనూ పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుములు పడుతున్నాడు. కలవారిబిడ్డలై అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు అలవాలమైనది. అన్ని లోకాలలోనూ బలి బలవంతుడు అవుతున్నాడు. అతనిని ఇంద్రుడు నిలువరించలేక పోతున్నాడు. యజ్ఞాలలో హవిర్భాగాలన్నింటినీ బలి దోచుకుంటున్నాడు ఒక్క కబళంకూడా దేవతలకు చిక్కనివ్వడు.