పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బృహస్పతి మంత్రాంగము

  •  
  •  
  •  

8-459-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థుల్ వేఁడరు; దాతలుంజెడరు; సర్వారంభముల్ పండుఁ; బ్ర
త్యర్థుల్ లేరు; మహోత్సవంబులను దేవాగారముల్ పొల్చుఁ బూ
ర్ణార్థుల్ విప్రులు; వర్షముల్ గురియుఁ గాలార్హంబులై; ధాత్రికిన్
సార్థంబయ్యె వసుంధరాత్వ మసురేంద్రాధీశు రాజ్యంబునన్.

టీకా:

అర్థులు = యాచకులు; వేడరు = అడుగరు; దాతలున్ = దానమిచ్చువారికి; చెడరు = లోటులేదు; సర్వ = సమస్తమైన; ఆరంభముల్ = ప్రయత్నములు; పండున్ = ఫలించును; ప్రత్యర్థుల్ = శత్రువులు; లేరు = లేరు; మహా = గొప్ప; ఉత్సవంబులన్ = ఉత్సవములతో; దేవాగారముల్ = దేవాలయములు; పొల్చున్ = ఒప్పియుండును; పూర్ణ = తీరిన; అర్థులు = కోరికలుగలవారు; విప్రులు = బ్రాహ్మణులు; వర్షముల్ = వానలు; కురియున్ = కురియును; కాల = కాలమునకు; అర్హంబులు = తగినవి; ఐ = అయ్యి; ధాత్రి = భూమి; కిన్ = కి; సార్థంబు = సార్థకము; అయ్యెన్ = అయినది; వసుంధరాత్వము = వసుంధర యనెడిపేరు; అసుర = రాక్షస; ఇంద్రాధీశు = చక్రవర్తి; రాజ్యంబునన్ = రాజ్యపరిపాలనలో.

భావము:

చేయి సాచి దానం అడిగే యాచకులు, ఆ రాక్షస మహారాజు, బలిచక్రవర్తి రాజ్యంలో, లేరు. దాతలు తమ దానం ఇచ్చే గుణం వదలిపెట్ట లేదు. సకల పంటలూ సానుకూలంగా పండేవి. శత్రువులు లేరు. దేవాలయాలు ఉత్సవాలతో వేడుకలతో వెలుగుతుండేవి. బ్రాహ్మణుల కోరికలు తీరేవి. కాలానికి తగిన విధంగా వానలు కురిసేవి. దానితో భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది.