పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బృహస్పతి మంత్రాంగము

  •  
  •  
  •  

8-458-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినఁ గార్యకాల ప్రదర్శి యగు బృహస్పతి వచనంబులు విని కామరూపులై దివిజులు త్రివిష్టపంబు విడిచి తమతమ పొందుపట్లకుం జనిరి; బలియునుం బ్రతిభట వివర్జిత యగు దేవధాని నధిష్ఠించి జగత్రయంబునుం దన వశంబు జేసికొని విశ్వవిజయుండై పెద్ద కాలంబు రాజ్యంబు జేయుచుండె, శిష్యవత్సలులగు భృగ్వాదు లతని చేత శతాశ్వమేధంబులు చేయించిరి; తత్కాలంబున.

టీకా:

అనినన్ = అనగా; కార్యకాల = సమయోచిత కర్తవ్యము; ప్రదర్శి = తెలియజేయువాడు; అగు = అయిన; బృహస్పతి = బృహస్పతి; వచనంబులు = మాటలు; విని = ఆలకించి; కామరూపులు = మారువేషధారులు; ఐ = అయ్యి; దివిజులు = దేవతలు; త్రివిష్టపంబున్ = స్వర్గమును; విడిచి = వదలివేసి; తమతమ = వారివారికి; పొందుపట్ల = కుదిరినచోట్ల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; బలియును = బలికూడ; ప్రతిభట = శత్రుసైన్యముచే; వివర్జిత = వదలివేయబడినది; అగు = అయిన; దేవధానిన్ = దేవతల ప్రధాన నగరాన్ని {దేవధాని - దేవతల యొక్క ధాని (ఆశ్రయము), అమరావతి}; అధిష్ఠించి = ఆక్రమించి; జగత్రయంబున్ = ముల్లోకములను; తన = తనయొక్క; వశంబున్ = వశమైనవిగా; చేసికొని = చేసికొని; విశ్వవిజయుండు = విశ్వవిజేత; ఐ = అయ్యి; పెద్ద = చాలా; కాలంబున్ = కాలము; రాజ్యంబున్ = రాజ్యమునేలుట; చేయుచుండె = చేయుచుండెను; శిష్య = శిష్యులయెడ; వత్సలులు = వాత్సల్యముగలవారు; అగు = అయిన; భృగు = భృగువు; ఆదులు = మున్నగువారు; అతని = వాని; చేత = చేత; శత = వంద (100); అశ్వమేధంబులున్ = అశ్వమేధయాగములు; చేయించిరి = చేయించినారు; తత్ = ఆ; కాలంబునన్ = కాలమునందు.

భావము:

ఈవిధంగా బృహస్పతి సమయోచితమైన కర్తవ్యాన్నితెలియజెప్పాడు. ఆ మాటలకు ఇంద్రుడూ దేవతలూ ఒప్పుకున్నారు. స్వర్గలోకాన్ని విడిచి పెట్టి తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోట్లకు వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి పగవారు లేని అమరావతిని సునాయాసంగా ఆక్రమించాడు. ముల్లోకాలనూ తన వశం చేసుకున్నాడు. విశ్వవిజేత అయి చాలాకాలం పాలించాడు.శిష్యులపై వాత్సల్యం కలిగిన శుక్రుడు మొదలగువారు బలిచక్రవర్తి చేత నూరు అశ్వమేధయాగాలు చేయించారు.