పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 8సూర్యసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-415-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సూర్యసావర్ణి మన్వంతరంబున నతని తనయులు నిర్మోహ విరజస్కాద్యులు రాజులును; సుతపోవిరజోమృత ప్రభు లనువారు దేవతలును గాఁగలరు; గాలవుండును, దీప్తిమంతుండును, బరశురాముండును, ద్రోణపుత్రుఁడగు నశ్వత్థామయుఁ, గృపుండును, మజ్జనకుం డగు బాదరాయణుండును, ఋష్యశృంగుండును సప్తర్షు లయ్యెదరు; వార లిప్పుడుఁ దమతమ యోగబలంబుల నిజాశ్రమ మండలంబులఁ జరియించుచున్నవారు; విరోచన నందనుం డగు బలి యింద్రుం డయ్యెడు" నని చెప్పి శుకుం డిట్లనియె.

టీకా:

సూర్యసావర్ణి = సూర్యసావర్ణి; మన్వంతరంబునన్ = మన్వంతరమునందు; అతని = అతని; తనయులు = పుత్రులు; నిర్మోహ = నిర్మోహుడు; విరజస్క = విరజస్కుడు; ఆద్యులు = మున్నగువారు; రాజులును = రాజులును; సుతపస్ = సుతపులు; విరజస్ = విరజులు; అమృతప్రభులు = అమృతప్రభులు; అను = అనెడి; వారు = వారు; దేవతలును = దేవతలును; కాగలరు = అవుతారు; గాలవుండును = గాలవుడు; దీప్తిమంతుడును = దీప్తిమంతుడు; పరశురాముండును = పరశురాముడు; ద్రోణ = ద్రోణుని; పుత్రుడు = కుమారుడు; అగు = అయిన; అశ్వత్థామయున్ = అశ్వత్థామ; కృపుండును = కృపుడు; మత్ = నా యొక్క; జనకుండు = తండ్రి; అగు = అయిన; బాదరాయణుండును = వ్యాసుడు; ఋష్యశృంగుండును = ఋష్యశృంగుడు; సప్తర్షులు = సప్తర్షులు; అయ్యెదరు = అవుతారు; వారలు = వారు; ఇపుడు = ప్రస్తుతము; తమతమ = వారివారి; యోగ = యోగాభ్యాస; బలంబులన్ = శక్తులచేత; నిజ = వారి; ఆశ్రమ = ఆశ్రమముల; మండలంబులన్ = ప్రదేశములందు; చరియించుచున్ = నివసించి; ఉన్నవారు = ఉన్నారు; విరోచన = విరోచనుని; నందనుండు = పుత్రుడు; అగు = అయిన; బలి = బలిచక్రవర్తి; ఇంద్రుండు = ఇంద్రుడు; అయ్యెడున్ = అవుతాడు; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

సూర్య సావర్ణి పాలించే ఎనిమిదవ మన్వంతరంలో అతని కొడుకులైన నిర్మోహుడూ, విరజస్కుడూ మొదలైనవారు రాజులు అవుతారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు.