పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జగనమోహిని కథ

  •  
  •  
  •  

8-408-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పారావారము ద్రచ్చుచో గిరి సముద్యద్భారమై కచ్ఛ పా
కారుండైన రమేశువర్తనము నార్ణింపఁ గీర్తింప సం
సారాంభోనిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయముం బొంది వి
స్తారోదార సుఖంబుఁ జెందుదురు తథ్యం బెంతయున్ భూవరా!

టీకా:

పారావారమున్ = సముద్రమును; ద్రచ్చుచోన్ = చిలుకునప్పుడు; గిరి = పర్వతమునకు; సమ = సమానమైన; ఉద్యత్ = ఎత్తిన; భారము = బరువుగలవాడు; ఐ = అయ్యి; కచ్ఛప = కూర్మ; ఆకారుండు = అవతారుండు; ఐన = అయిన; రమేశున్ = హరి యొక్క; వర్తనమున్ = చరిత్రను; ఆకర్ణింపన్ = వినినను; కీర్తింపన్ = పాడినను; సంసార = సంసారము యనెడి; అంభోనిధి = సముద్రము; లోన్ = అందు; మునుంగు = ములిగిపోయెడి; కుడనుల్ = అల్పులైన జనులు; సంశ్రేయంబున్ = గొప్పపుణ్యమును; పొంది = పొంది; విస్తార = విశేషమైన; ఉదార = అధికమైన; సుఖంబున్ = సుఖములను; చెందుదురు = పొందెదరు; తథ్యంబు = సందేహములేనిది; ఎంతయున్ = ఎంతైనను; భూవర = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! సంసార సముద్రంలో మునిగిపోయే అల్పులైన జనులు సైతం, సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్రమధ్యన మునిగిపోతున్న మందరపర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు చరిత్రను విన్నా పాడినా గొప్ప పుణ్యాన్నీ విశేషమైన సుఖాన్నీ చూరగొంటారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు.