పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జగనమోహిని కథ

  •  
  •  
  •  

8-394-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని మున్ను మగువ మరగి సగమయిన మగవాఁ డమ్మగువ వయో రూప గుణ విలాసంబులు దన్ను నూరింపం గనుఱెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున.

టీకా:

కని = చూసి; మున్ను = ఇంతకుముందే; మగువన్ = స్త్రీని; మరగి = అలవాటుపడి; సగము = సగము; అయిన = ఐనట్టి; మగవాడు = పురుషుడు; ఆ = ఆ; మగువన్ = స్త్రీ యొక్క; వయస్ = ప్రాయము; రూప = అందము; గుణ = సుగుణములు; విలాసంబులున్ = వయ్యారములు; తన్ను = తనను; ఊరింపన్ = ఆకర్షించుచుండగ; కనుఱెప్పన్ = కంటిమీదిరెప్ప; వ్రేయక = ఆర్పకుండగ; తప్పక = విడువకుండ; చూచి = చూసి; మెత్తను = మెత్తబడినది; అయిన = ఐనట్టి; చిత్తంబున = మనసునందు.

భావము:

ఇంతకు ముందే మగువ వలపుతో సగమైన మగవాడు కదా శివుడు. ఆజవరాలి ప్రాయమూ రూపమూ ఒయ్యారమూ విలాసమూ ఆయనను బాగా ఆకర్షించాయి. ఆయన కంటిరెప్పకూడా వేయకుండా మైమరచి ఆమెను చూడసాగాడు. ఆయన చిత్తం మెత్తబడింది.