పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

  •  
  •  
  •  

8-279-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు నిలిచి దశదిశలం బరివేష్టించి యున్న యక్ష రక్షస్సిద్ధ సాద్ధ్య దివిజ గరుడ గంధర్వ చారణ ప్రముఖ నిఖిల యూథంబులం గనుం గొని య ప్పురాణ ప్రౌఢకన్యకారత్నంబుఁ దన మనంబున నిట్లని వితర్కించె.

టీకా:

అట్లు = ఆ విధముగ; నిలిచి = ఉండి; దశదిశలన్ = దశదిక్కులవైపు; పరివేష్టించి = చుట్టుకొని; ఉన్న = ఉన్నట్టి; యక్ష = యక్షులు; రక్ష = రాక్షసులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; దివిజ = దేవతలు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; చారణ = చారణులు; ప్రముఖ = ముఖ్యుల; నిఖిల = సమస్తమైన; యూథంబులన్ = సమూహములను; కనుంగొని = చూసి; ఆ = ఆ; పురాణ = నిత్య; ప్రౌఢకన్యక = సౌభాగ్యవతులలో; రత్నంబున్ = శ్రేష్ఠురాలు; తన = తన యొక్క; మనంబునన్ = మనసునందు; ఇట్లు = ఈ విధముగ; అని = అని; వితర్కించెన్ = ఆలోచించెను.

భావము:

తన చుట్టూ అన్ని వైపులా పరివేష్టించి ఉన్న యక్షులు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, గరుడులు, గంధర్వులు, చారణులు మొదలైన వారందరినీ పరికించి చూసి, వరునికై చూస్తున్న సౌభాగ్యవతి, నిండు జవరాలు, కన్యకారత్నం అయిన ఇందిర ఇలా ఆలోచించింది.