పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురభి ఆవిర్భావము

 •  
 •  
 •  

8-251-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రత్నాకరంబు = సముద్రమును; సుర = దేవతలు; అసురులున్ = రాక్షసులు; త్రచ్చు = చిలికెడి; ఎడన్ = సమయమునందు.

భావము:

హాలాహలభక్షణం పిమ్మట మరల, దేవతలూ రాక్షసులూ సముద్రాన్ని చిలక సాగారు.

8-252-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తెల్లని మేనును నమృతము
జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం
బెల్లుగ నర్థుల కోర్కులు
వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్.

టీకా:

తెల్లని = తెల్లటి రంగుగల; మేనునున్ = దేహము; అమృతమున్ = పాలను; జిల్లునన్ = జిల్లుమని; జల్లించు = ధారలుగానిచ్చెడి; పొదుగున్ = పొదుగు; శిత = చక్కటి, వాడియైన; శృంగములున్ = కొమ్ములు; పెల్లుగన్ = పుష్కలముగ; అర్థుల = కోరెడివారి; కోర్కులున్ = కోరికలను; వెల్లిగొలుపు = కురిపించెడి; మొదవు = పాడియావు; పాలవెల్లిన్ = పాలసముద్రమునందు; పుట్టెన్ = జనించెను.

భావము:

ఇలా చిలుకుతుంటే పాలసముద్రంలోనుండి కామధేనువు పుట్టింది. అది తెల్లని శరీరం, జిల్లుమంటూ పాలధారలను బాగా ఇచ్చే పొదుగూ, చక్కని కొమ్ములు కలిగి ఉంది. కోరిన కోరికలను పుష్కలంగా తీరుస్తుంది.

8-253-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ
మునులు పుచ్చికొనిరి మున్నెఱింగి
విబుధ సంఘములకు వెరవుతో నధ్వర
వులు పెట్టుకొఱకు వనినాథ!

టీకా:

అగ్నిహోత్రి = అగ్నిహోత్రములకు తగినది; అనుచున్ = అనుచు; ఆ = ఆ; సురభిన్ = కామధేనువును; దేవమునులు = దేవర్షులు; పుచ్చికొనిరి = తీసుకొనిరి; మున్న = ముందుగనే; ఎఱింగి = తెలిసి యుండుటచేత; విబుధ = దేవతా; సంఘముల్ = సమూహముల; కున్ = కు; వెరవు = తగినవిధము; తోన్ = ప్రకారముగ; అధ్వర = యాగ; హవులున్ = హవిస్సులను; పెట్టు = సమర్పించుట; కొఱకున్ = కోసము; అవనినాథ = రాజ.

భావము:

కామధేనువు హోమకార్యక్రమాలకు తగినది అని దేవమునులు ముందుగానే గ్రహించారు. యజ్ఞకార్యాలకు తగినట్లు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే కామధేనువును తీసుకున్నారు

8-254-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నా జలరాశి యందు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; జలరాశి = సముద్రము; అందున్ = లో.

భావము:

అలా చిలుకుంతుంటే క్షీరసాగరమునుండి. . .