పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 1స్వాయంభువ మనువు చరిత్ర

  •  
  •  
  •  

8-7-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రథమ మనువైన స్వాయంభువునకు నాకూతి దేవహూతు లను నిరువురుఁ గూఁతులు గలరు; వారిఁకి గ్రమంబునఁ గపిల యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు జేయుకొఱకు హరి పుత్రత్వంబు నొందె; నందుఁ గపిలుని చరిత్రంబు మున్నఁ జెప్పంబడియె; యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము.

టీకా:

ప్రథమ = మొదటి (1); మనువు = మనువు; ఐన = అయిన; స్వాయంభువున్ = స్వాయంభువున; కున్ = కు; ఆకూతి = ఆకూతి {ఆకూతి - అభిప్రాయము, తలపు}; దేవహూతులు = దేవహూతి {దేవహూతి - దేవుని హూతి (పిలుపు)}; అను = అనెడి; ఇరువురు = ఇద్దరు (2); కూతులున్ = పుత్రికలు; కలరు = ఉన్నారు; వారి = వారల; కిన్ = కు; క్రమంబునన్ = వరుసగా; కపిల = కపిలుడు; యజ్ఞ = యజ్ఞుడు; నామంబులన్ = అనెడి పేర్లతో; లోకముల్ = ప్రపంచమున; కున్ = కు; ధర్మ = ధర్మమును; జ్ఞాన = జ్ఞానమును; బోధంబున్ = బోధించుట; చేయు = చేసెడి; కొఱకున్ = కోసము; హరి = నారాయణుడు; పుత్రత్వంబున్ = కొడుకగుటను; ఒందెన్ = పొందెను; అందున్ = వారిలో; కపిలుని = కపిలుని; చరిత్రంబు = చరిత్రను; మున్న = ఇంచకు ముందు; చెప్పంబడియె = చెప్పబడినది; యజ్ఞుని = యజ్ఞుని యొక్క; చరిత్రంబు = చరిత్రను; చెప్పెదన్ = చెప్పెదను; వినుము = ఆలకించుము.

భావము:

విను పరీక్షిన్మహారాజా! మొదటి మనువు స్వాయంభువుడు. అతనికి ఇరువురు కుమార్తెలు. వారి పేర్లు దేవహూతి, ఆకూతి. విష్ణుమూర్తి లోకాలకు ధర్మాన్నీ, జ్ఞానాన్నీ బోధించడం కోసం దేవహూతియందు కర్దమునికి కపిలుడు. ఆకూతియందు రుచిప్రజాపతికి యజ్ఞుడు అనే పేర్లతో అవతరించాడు. కపిలుడి చరిత్ర ఇంతకు ముందు చెప్పాను. ఇక యజ్ఞుని చరిత్ర చెప్తాను.