పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విశ్వగర్భుని ఆవిర్భావము

  •  
  •  
  •  

8-161-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హా కిరీట కేయూ కుండల పాద-
టక కాంచీలతా కంకణాది
కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ-
క్ర శరాసన సంయుతంబు
రకతశ్యామంబు రసిజ నేత్రంబుఁ-
ర్ణాభరణ కాంతి గండ యుగముఁ
లిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు-
శ్రీ వనమాలికా సేవితంబు

8-161.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నై మనోహరంబునై దివ్యసౌభాగ్య
మైన యతని రూపు ర్ష మెసఁగ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును
బొంగి నమ్రుఁ డగుచుఁ బొగడఁ దొడఁగె.

టీకా:

హార = హారములు; కిరీట = కిరీటములు; కేయూర = భుజకీర్తులు; కుండల = చెవికుండలములు; పాదకటక = కాలి అందెలు; కాంచీలత = మొలతాడు; కంకణ = కంకణములు; ఆది = మున్నగునవి; కౌస్తుభ = కౌస్తుభమణితో; ఉపేతంబున్ = కూడినది; కౌమోదకీ = కౌమోదకీ గద; శంఖ = శంఖము; చక్ర = చక్రము; శరాసన = విల్లు; సంయుతంబున్ = కలిగినది; మరకత = మరకతమణివంటి; శ్యామంబున్ = నల్లనిమేనుగలది; సరసిజ = పద్మములవంటి; నేత్రంబున్ = కన్నులుగలది; కర్ణాభరణ = చెవికుండలముల; కాంతిన్ = కాంతులుగల; గండ = చెక్కళ్ళ; యుగమున్ = జంట; కలిత = పొందబడినది; కాంచన = బంగారు; వర్ణ = రంగుగల; కౌశేయ = పట్టు; వస్త్రంబున్ = బట్టలు; శ్రీవనమాలికా = సుందరమైన ఆకులు పువ్వులు చేర్చికట్టిన తోమాలె చే, వైజయంతిమాలచేత; సేవితంబున్ = కొలువబడుచున్నది; ఐ = అయ్యి.
మనోహరంబున్ = మనోహరమైనది; ఐ = అయ్యి; దివ్య = గొప్ప; సౌభాగ్యము = సౌభాగ్యవంతము; ఐన = అయినట్టి; అతని = అతని; రూపు = ఆకృతి; హర్షము = సంతోషము; ఎసగన్ = అతిశయించగా; చూచి = చూసి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; హరుడు = పరమశివుడు; సురలునున్ = దేవతలు; తానునున్ = తను; పొంగి = సంతోషిముతో పొంగిపోయి; నమ్రుడు = నమ్రతచూపువాడు; అగుచున్ = అగుచు; పొగడన్ = స్తుతించుట; తొడగెన్ = ప్రారంభించెను.

భావము:

భగవంతుడు శ్రీహరి హారాలు, కిరీటాలు, భుజకీర్తులు, కుండలాలు, కాలి అందెలు, మొలనూలు, కంకణాలు, కౌస్తుభరత్నము, కొమోదకీ గద, శంఖము, చక్రము, విల్లు ధరించి దర్శనం ఇచ్చాడు. మరకత మణి వంటి నల్లని మేను, కాంతులీనే పద్మాల వంటి కళ్ళు, చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తున్న తళతళలాడే మకర కుండలాల కాంతులూ కలిగి ఉన్నాడు. బంగారురంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో వైజయంతీమాల ప్రకాశిస్తూ ఉంది. ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు సంతోషంతో పొంగిపోతూ దర్శించుకున్నారు. బ్రహ్మదేవుడు భగవంతునికి నమస్కారం చేసి ఇలా స్తోత్రం చేయటం మొదలెట్టాడు.