పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బ్రహ్మాదుల హరిస్తుతి

  •  
  •  
  •  

8-155-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నెవ్వని బలంబున మహేంద్రుండును; బ్రసాదంబున దేవతలును; గోపంబున రుద్రుండును; బౌరుషంబున విరించియు; నింద్రియంబులవలన వేదంబులును మునులును; మేఢ్రంబునఁ బ్రజాపతియును; వక్షంబున లక్ష్మియు; ఛాయవలనఁ బితృదేవతలును; స్తనంబులవలన ధర్మంబును; బృష్ఠంబువలన నధర్మంబును; శిరంబువలన నాకంబును; విహాసంబువలన నప్సరోజనంబులును; ముఖంబువలన విప్రులును; గుహ్యంబున బ్రహ్మంబును; భుజంబులవలన రాజులును బలంబును; నూరువులవలన వైశ్యులును నైపుణ్యంబును; బదంబులవలన శూద్రులును నవేదంబును; నధరంబున లోభంబును; పరిరదచ్ఛదనంబువలన బ్రీతియు; నాసాపుటంబువలన ద్యుతియు; స్పర్శంబునఁ గామంబును; భ్రూయుగళంబున యమంబును; బక్షంబునఁ గాలంబును సంభవించె; నెవ్వని యోగ మాయావిహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధ సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వనివలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రతుకుచుందురు పెరుగుచుందురు; దివిజులకు నాయువు నంధంబు బలంబునై జగంబులకు నీశుండై ప్రజలకుఁ బ్రజనుండై ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుం డై; యంతస్సముద్రంబున ధాతుసంఘాతంబులం బ్రపచించుచు బ్రహ్మమయుండై; ముక్తికి ద్వారంబై; యమృత మృత్యు స్వరూపుండై; చరాచరప్రాణులకుఁ బ్రాణంబై; యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రి యాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు నప్పరమేశ్వరుండు మాకుం బ్రసన్నుండగుం గాక" యని మఱియును.

టీకా:

మఱియున్ = అంతేకాక; ఎవ్వని = ఎవని; బలంబునన్ = బలమువలన; మహేంద్రుండును = దేవేంద్రుడు; ప్రసాదంబునన్ = అనుగ్రహము వలన; దేవతలును = దేవతలును; కోపంబునన్ = రౌద్రము వలన; రుద్రుండును = పరమశివుడును; పౌరుషంబునన్ = పౌరుషమువలన; విరించియున్ = బ్రహ్మదేవుడు; ఇంద్రియంబుల = ఇంద్రియముల; వలన = వలన; వేదంబులును = వేదములు; మునులును = ఋషులు; మేఢ్రంబునన్ = పురుషావయవమువలన; ప్రజాపతియును = ప్రజాపతి; వక్షంబునన్ = వక్షస్థలమున; లక్ష్మియున్ = లక్ష్మీదేవి; ఛాయ = నీడ; వలనన్ = వలన; పితృదేవతలును = పితృదేవతలు; స్తనంబుల = రొమ్ముల; వలన = వలన; ధర్మంబును = ధర్మము; పృష్టంబు = వీపు; వలన = వలన; అధర్మంబును = అధర్మము; శిరంబున్ = తల; వలన = వలన; నాకంబును = స్వర్గమును; విహాసంబు = నవ్వు; వలన = వలన; అప్సరస్ = అప్సరసల; జనంబులును = సమూహము; ముఖంబు = వదనము; వలన = వలన; విప్రులును = బ్రాహ్మణులు; గుహ్యంబునన్ = యోనివలన; బ్రహ్మంబును = బ్రహ్మదేవుడు; భుజంబుల = భుజముల; వలన = వలన; రాజులును = రాజులు; బలంబును = సైన్యములు; ఊరువుల = తొడల; వలన = వలన; వైశ్యులును = వ్యాపారులు; నైపుణ్యంబును = నేర్పరితనము; పదంబుల = పాదముల; వలన = వలన; శూద్రులును = శూద్రులు; అవేదంబును = వేదములుకానిజ్ఞానము; అధరంబునన్ = క్రిందిపెదవివలన; లోభంబును = లోభము; ఉపరిరదచ్ఛదనంబు = పైపెదవి; వలన = వలన; ప్రీతియున్ = ఇష్టము; నాసా = ముక్కు; పుటంబునన్ = పుటముల; వలన = వలన; ద్యుతియున్ = కాంతి; స్పర్శంబునన్ = స్పర్శవలన; కామంబును = కామము; భ్రూయుగళంబునన్ = కనుబొమలవలన; యమంబును = యముడు; పక్షంబునన్ = పక్కభాగమువలన; కాలంబును = కాలము; సంభవించెన్ = కలిగినవో; ఎవ్వని = ఎవని; యోగమాయ = యోగమాయచే; విహితంబులు = విధింపబడినో; ద్రవ్య = ద్రవ్యము; వయస్ = వయస్సు; గుణ = గుణములయొక్క; విశేషంబులున్ = విశేషములు; చతుర్విధ = నాలుగువిధములైన {చతుర్విధభూతసర్గము - 1అచరము 2భూచరము 3జలచరము 4గగనచరములు ? చతుర్విధవర్గము - 1ధర్మము 2అర్థము 3కామము 4మోక్షము}; సర్గంబున్ = భూతసర్గము; ఎవ్వని = ఎవని; ఆత్మ = స్వంత; తంత్రంబున్ = తంత్రముననుసరించునది; ఎవ్వని = ఎవని; వలనన్ = వలన; సిద్ధించి = ఏర్పడుచు; లోకంబులును = లోకములు; లోకపాలురు = లోకపాలురు; బ్రతుకుచుందురు = జీవించుతుంటారు; పెరుగుచుందురు = వృద్ధిచెందుచుతుంటారు; దివిజుల్ = దేవతలక; కున్ = కు; ఆయువున్ = ఆయుస్సు; అంధంబున్ = ఆహారము; బలంబున్ = బలము; ఐ = అయ్యి; జగంబుల్ = భువనముల; కున్ = కు; ఈశుండు = ప్రభువు; ఐ = అయ్యి; ప్రజల్ = లోకుల; కున్ = కు; ప్రజనుండు = సృష్టించెడివాడు; ఐ = అయ్యి; ప్రజ = లోకులను; అవన = కాపాడెడి; క్రియాకాండ = కర్మకాండ; నిమిత్త = కోసమై; సంభవుండు = ఏర్పడినవాడు; అగు = అయిన; జాతవేదుండు = అగ్నివి {జాతవేదుండు - పుట్టిక తోనే వేదములను తెలుసుకున్న వాడు, అగ్నిదేవుడు}; ఐ = అయ్యి; అంత = అంతరంగ మనెడి; సముద్రంబునన్ = సముద్రమునందు; ధాతువులన్ = సప్తధాతువులను {సప్తధాతువులు - 1రోమ 2త్వక్ 3మాంస 4అస్థి 5స్నాయు 6మజ్జ 7ప్రాణములు}; ప్రపంచించుచున్ = విస్తరింపజేయుచు; బ్రహ్మ = పరబ్రహ్మ; మయుండు = స్వరూపుడు; ఐ = అయ్యి; ముక్తి = మోక్షసాధనకు; కిన్ = కు; ద్వారంబు = మార్గము; ఐ = అయ్యి; అమృత = బ్రతుకు; మృత్యు = చావుల; స్వరూపుండు = స్వరూపమైనవాడు; ఐ = అయ్యి; చర = చరించగల; అచర = చరించలేని; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; ప్రాణంబున్ = జీవము; ఐ = అయ్యి; ఓజస్ = తేజము; అహస్ = అహంకారము; బల = సామర్థ్యము; వాయుః = వాయువులు నిండిన; రూపంబులు = రూపములుగలవి; ఐన = అయినట్టి; ప్రాణ = ప్రాణుల; ఇంద్రియ = ఇంద్రియములు; ఆత్మ = ఆత్మలు; శరీర = శరీరములు; నికేతనుండు = నివాసముగాగలవాడు; ఐ = అయ్యి; పరమ = అత్యధికమైన; మహా = గొప్ప; భూతి = శక్తి; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = మహాప్రభువు; మా = మా; కున్ = కు; ప్రసన్నుండు = దయచూపువాడు; అగుంగాక = అగునుగాక; అని = అని; మఱియును = ఇంకను.

భావము:

నీ బలం నుండి దేవేంద్రుడూ, అనుగ్రహం నుండి దేవతలు, ఆగ్రహం నుండి రుద్రుడు, పౌరుషం నుండి బ్రహ్మదేవుడు, ఇంద్రియాల నుండి వేదాలూ, మునులూ, పురుషాంగం నుండి ప్రజాపతి, రొమ్ములనుండి లక్ష్మీదేవి, నీడ నుండి ధర్మము, వీపు నుండి అధర్మము, తల నుండి స్వర్గము, నవ్వు నుండి అప్సరసలు,ముఖం నుండి బ్రాహ్మణులు, బ్రహ్మము, భుజాల నుండి రాజులు. బలము, తొడల నుండి వైశ్యులు, నేర్పరి తనము, పాదాల నుండి శూద్రులు, శుశ్రూష, క్రింద పెదవి నుండి లోభము, పై పెదవి నుండి ప్రేమ, ముక్కుపుటాల నుండి కాంతి, స్పర్శ నుండి కామము, కనుబొమలు నుండి యముడు, పక్కభాగం నుండి కాలము సంభవించాయి, యోగమాయ వలన ద్రవ్యము, వయస్సు, కర్మము, గుణవిశేషాలు విధింపబడ్డాయి, నీ ఆత్మతంత్రం నుండి ధర్మము, అర్థము, కామము, మోక్షము కలిగాయి, నీ వలన లోకాలు, లోకపాలకులు ఏర్పడి అభివృద్ధి పొందుతారు, దేవతలకు ఆయుస్సు, ఆహారము, బలమూ నీవే. పర్వతాలపై అధికారివి నీవే. ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే, సముద్రంలో రత్న రాసులను విస్తరింపజేసేది నీవే, మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మం నీవే, చావు బ్రతుకులు నీ రూపాలే, ప్రాణులకు అన్నింటికీ ప్రాణం నీవే, తేజస్సు, అహంకారం, వాయువు నిండిన ప్రాణుల దేహాలలో, అవయవాలలో, ఆత్మలో నీవే నివసిస్తావు, పరమశక్తివైన మహాప్రభూ! మాపై దయచూపు.