పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రమోక్షణ కథా ఫలసృతి

  •  
  •  
  •  

8-136-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు నప్పరమేశ్వరుం డిట్లని యానతిచ్చె "ఎవ్వరేని నపర రాత్రాంతంబున మేల్కాంచి సమాహిత మనస్కులయి నన్నును; నిన్నును; నీ సరోవరంబును; శ్వేతద్వీపంబును; నాకుం బ్రియంబైన సుధాసాగరంబును; హేమనగంబును; నిగ్గిరి కందర కాననంబులను; వేత్ర కీచక వేణు లతాగుల్మ సురపాదపంబులను; నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించియుండు నక్కొండ శిఖరంబులను; గౌమోదకీ కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను; శ్రీదేవిని; శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదులను; మత్స్య కూర్మ వరాహాద్యవతారంబులను; దదవతారకృత కార్యంబులను; సూర్య సోమ పావకులను; బ్రణవంబును; ధర్మతపస్సత్యంబులను; వేదంబును; వేదాంగంబులను శాస్త్రంబులను; గో భూసుర సాధు పతివ్రతా జనంబులను; జంద్ర కాశ్యపజాయా సముదయంబును; గౌరీ గంగా సరస్వతీ కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిచయంబును; నమరులను; నమరతరువులను; నైరావతంబును; నమృతంబును; ధ్రువుని; బ్రహ్మర్షి నివహంబును; బుణ్యశ్లోకులైన మానవులను; సమాహితచిత్తులై తలంచువారలకుఁ బ్రాణావసానకాలంబున మదీయంబగు విమలగతి నిత్తు" నని హృషీకేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందితచరణారవిందుఁడై విహగపరివృఢ వాహనుండై వేంచేసె; విబుధానీకంబు సంతోషించె" నని చెప్పి శుకుండు రాజున కిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; పరమేశ్వరుండు = విష్ణుమూర్తి; ఇట్లు = ఈ విధముగా; అని = చెప్పి; ఆనతిచ్చెన్ = సెలవిచ్చెను; ఎవ్వరు = ఎవరు; ఏనిన్ = అయినను; అపరరాత్రాంతంబున = తెల్లవారుఝాముననే; మేల్కాంచి = నిద్రలేచి; సమాహిత = ప్రశాంతమైన; మనస్కులు = మనసు గలవారు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; నిన్నున్ = నిన్ను; ఈ = ఈ; సరోవరంబును = మడుగును; శ్వేతద్వీపంబును = శ్వేతద్వీపమును; నా = నా; కున్ = కు; ప్రియంబున్ = ఇష్టమైనది; ఐన = అయిన; సుధాసాగరంబును = పాలసముద్రమును; హేమనగంబును = మేరుపర్వతమును; ఈ = ఈ; గిరి = పర్వతము యొక్క; కందర = గుహలను; కాననంబులును = అడవులను; వేత్ర = ఫేము; కీచక = బొంగువెదురు; వేణు = వెదురు; లతా = లతలు; గుల్మ = పొదలు; సురపాదపంబులను = కల్పవృక్షములను; నేనునున్ = నేను (విష్ణువు); బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; ఫాలలోచనుండును = పరమశివుడు; నివసించి = నివాసము; ఉండు = ఉండెడి; ఆ = ఆ; కొండ = పర్వతము (త్రికూటపర్వతము) యొక్క; శిఖరంబులను = శిఖరములను; కౌమోదకీ = కౌమోదకీ గదను; కౌస్తుభ = కౌస్తుభ మణిని; సుదర్శన = సుదర్శన చక్రమును; పాంచజన్యంబులను = పాంచజన్య శంఖమును; శ్రీదేవిని = లక్ష్మీదేవిని; శేష = ఆదిశేషుని; గరుడ = గరుత్మంతుని; వాసుకిన్ = వాసుకిని; ప్రహ్లాద = ప్రహ్లాదుని; నారదులను = నారదుని; మత్స్య = మత్స్య; కూర్మ = కూర్మ; వరాహ = వరాహ; ఆది = మొదలగు; అవతారంబులను = అవతారములను; తత్ = ఆయా; అవతార = అవతారములలో; కృత = చేసినట్టి; కార్యంబులను = పనులను; సూర్య = సూర్యుని; సోమ = చంద్రుని; పావకులను = అగ్నిదేవుని; ప్రణవంబును = ఓంకారమును; ధర్మ = ధర్మమును; తపస్ = తపస్సును; సత్యంబులను = సత్యములను; వేదంబును = వేదములను; వేదాంగంబులను = వేదాంగములను {వేదాంగములు = శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, విరుక్తము, జ్యోతిషము, కల్పము మున్నగునవి}; శాస్త్రంబులను = శాస్త్రములను; గో = గోవులను; భూసుర = బ్రాహ్మణుల; సాధు = సాధువులను; పతివ్రతా = పతివ్రతలైన; జనంబులను = వారిని; చంద్ర = చంద్రుని యొక్క; కాశ్యప = కశ్యపుని యొక్క {కాశ్యపుడు – కశ్యపునికి సంబంధించినవాడు, కశ్యప ప్రజాపతి వంశంలో ఉలూక మహర్షికి పుత్రునిగా జన్మించినవాడు, ఔలూక్యుడు, కణాద మహర్షి, అణుసిద్ధాంతం కార్యకారణ సిద్ధాంతం వంటి అత్యుద్భతమైన ప్రతిపాదించిన మహానుభావుడు}; జాయా = భార్యల; సముదయంబును = సమూహములను; గౌరీ = గౌరీ; గంగా = గంగా; సరస్వతీ = సరస్వతీ; కాళిందీ = కాళిందీ; సునందా = సునందా; ప్రముఖ = మున్నగు; పుణ్య = పుణ్య; తరంగిణీ = నదుల; నిచయంబును = సమూహమును; అమరులను = దేవతలను; అమరతరువులను = దేవతావృక్షములను; ఐరావతంబును = ఐరావతమును; అమృతంబును = అమృతమును; ధ్రువుని = ధ్రువుని; బ్రహ్మర్షి = బ్రహ్మర్షుల; నివహంబును = సమూహమును; పుణ్య = పుణ్యులచే; శ్లోకులు = కీర్తించబడిన; ఐన = అయిన; మానవులను = నరులను; సమాహిత = ప్రశాంతమైన; చిత్తులు = మనసు గలవారు; ఐ = అయ్యి; తలంచు = తలచెడి; వారల = వారల; కున్ = కు; ప్రాణావసాన = చనిపోవు; కాలంబునన్ = సమయములో; మదీయంబు = నాది; అగు = ఐన; విమల = నిర్మలమైన; గతిన్ = పదమును; ఇత్తును = ఇచ్చెదను; అని = అని; హృషీకేశుండు = విష్ణుమూర్తి {హృషీకేశుడు - హృషీకముల (ఇంద్రియముల) కు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; నిర్దేశించి = నిర్ణయించి; శంఖంబున్ = శంఖమును; పూరించి = ఊది; సకల = సర్వ; అమర = దేవతలచేత; వందిత = నమస్కరింపబడిన; చరణ = పాదము లనెడి; అరవిందుడు = పద్మములు గలవాడు; ఐ = అయ్యి; విహగపరివృఢ = గరుత్మంతుని {విహగపరివృఢుడు - విహగ (ఆకాశమున విహరించునవానికి అనగా పక్షులకు) పరివృఢుడు (ప్రభువు), గరుత్మంతుడు}; వాహనుండు = అధిరోహించినవాడు; ఐ = అయ్యి; వేంచేసెన్ = పయనించెను; విబుధ = దేవతల; అనీకంబు = సమూహము; సంతోషించెను = సంతోషించెను; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; రాజున్ = రాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా చెప్పి శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు “తెల్లవారకముందే నిద్రలేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణుమూర్తిని, గజేంద్రుడిని, ఆ పద్మసరస్సును, శ్వేతద్వీపాన్ని, పాలసముద్రాన్ని, త్రికూటపర్వత గుహలను, అడవులను, పేము, వెదురు, పొదలు, కల్ప వృక్షాలను, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నివసించే ఆ త్రికూట పర్వత శిఖరాలను, కౌమోదకీ గదను, కౌస్తుభ మణిని, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, లక్ష్మీదేవిని, ఆది శేషుడుని, గరుత్మంతుడిని, వాసుకిని, ప్రహ్లాదుడిని, నారదుడిని, మత్స్య, కూర్మ, వరాహ మొదలైన అవతారాలని, ఆయా అవతారాలలో చేసిన కృత్యాలను, సూర్యుడు, చంద్రుడు, అగ్నులను, ఓంకారాన్ని, ధర్మం, తపస్సు, సత్యాలను, వేదాన్ని, వేదాంగాలను, శాస్త్రాలను, గోవులు, బ్రాహ్మణులు, సాధువులు, పతివ్రతలను, చంద్రుడి భార్యలను (దక్షపుత్రికలు నక్షత్రాలు అయిన అశ్వని, భరణి మున్నగు ఇరవైఏడు మంది), కశ్యపుడి భార్యలను (అదితి, దితి మున్నగు వారు పదిహేనుమందిలో దక్షపుత్రికలు పదముగ్గురు వైశ్వానరుని కుమార్తెలు ఇద్దరు) గంగ, గౌరి, సరస్వతి, యమున, సునంద మొదలైన పుణ్యనదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుని, బ్రహ్మర్షులను, పుణ్యాత్ములైన మానవులను, ఏకాగ్రచిత్తులై తలంచేవారికి, విష్ణువునకు చెందిన నిర్మలపదం చనిపోయే సమయంలో అనుగ్రహిస్తాను.” ఇలా చెప్పి విష్ణువు శంఖాన్ని పూరించాడు. దేవతలు అందరు ఆయన పాదపద్మాలకు నమస్కారాలు చేసారు. శ్రీహరి గరుడుని అధిరోహించి పయనమయ్యాడు. దేవతలు సంతోషించారు.” అని చెప్పి శుకబ్రహ్మ పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.