పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రమోక్షణ కథా ఫలసృతి

 •  
 •  
 •  

8-135-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రనాథ! నీకును నాచేత వివరింపఁ-
డిన యీ కృష్ణానుభావమైన
జరాజమోక్షణథ వినువారికి-
శము లిచ్చును గల్మషాపహంబు;
దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ-
బ్రొద్దున మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁ బఠియించు నిర్మలాత్ముకులైన-
విప్రులకును బహువిభవ మమరు;

8-135.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సంపదలు గల్గుఁ; బీడలు శాంతిఁ బొందు;
సుఖము సిద్ధించు; వర్థిల్లు శోభనములు;
మోక్ష మఱచేతిదై యుండు; ముదము చేరు
నుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె.

టీకా:

నరనాథ = రాజా {నరనాథుడు - నరులకు పతి, విష్ణువు}; నీ = నీ; కునున్ = కు; నా = నా; చేతన్ = వలన; వివరింపబడిన = వివరముగా తెలుపబడిన; ఈ = ఈ; కృష్ణా = శ్రీకృష్ణుని యొక్క; అనుభావము = ప్రభావము తెలుపునది; ఐన = అయిన; గజరాజ = గజేంద్రుని; మోక్షణ = మోక్షము యనెడి; కథ = కథను; విను = వినెడి; వారి = వారి; కిన్ = కి; యశములున్ = కీర్తులను; ఇచ్చునున్ = ఇచ్చును; కల్మష = పాపములను; అపహంబున్ = పరిహరించును; దుస్వప్న = చెడ్డకలలను; నాశంబున్ = తొలగించును; దుఃఖ = దుఃఖమును; సంహారంబున్ = నాశనము చేయును; ప్రొద్దున = ఉదయమే; మేల్కాంచి = నిద్రలేచి; పూత = పవిత్రమైన; వృత్తిన్ = విధముగ; నిత్యంబున్ = ప్రతిదినము; పఠియించు = చదివెడి; నిర్మల = నిర్మలమైన; ఆత్మకులు = మనసులు గలవారు; ఐన = అయిన; విప్రుల్ = బ్రాహ్మణుల; కునున్ = కు; బహు = అనేకమైన; విభవము = వైభవములు; అమరున్ = సమకూర్చును.
సంపదలున్ = సంపదలుకూడ; కల్గున్ = కలుగును; పీడలు = ఆపదలు; శాంతిన్ = సమసిపోవుట; పొందున్ = కలుగును; సుఖమున్ = సౌఖ్యములును; సిద్ధించున్ = కలుగును; వర్ధిల్లున్ = వృద్ధిచెందును; శోభనములు = శుభములు; మోక్షమున్ = ముక్తికూడ; అఱచేతిది = మిక్కిలి సులువైనది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ముదము = సంతోషము; చేరున్ = సమకూరును; అనుచున్ = అని; విష్ణుండు = హరి; ప్రీతుండు = సంతుష్టుండు; ఐ = అయ్యి; ఆనతిచ్చెన్ = సెలవిచ్చెను.

భావము:

“ఓ మహారాజా! నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన గజేంద్రమోక్షణం అనే ఈ కథ వినెడివారి కీర్తి వృద్ధి చెందుతుంది, పాపాలు పరిహారమౌతాయి, చెడ్డ కలలు తొలగి పోతాయి, కష్టాలు దూరమౌతాయి. ప్రతిరోజు ఉదయమే లేచి పవిత్రంగా నియమంగా పారాయణగా చదివెడి నిర్మలమైన మనస్సు గల బ్రాహ్మణులకు అనేక రకాలైన వైభవాలు గొప్ప సంపదలు సమకూరుతాయి, ఆపదలు అంతరిస్తాయి, సౌఖ్యాలు దరిజేరతాయి, శుభాలు వృద్ధిచెందుతాయి, మోక్షం సులభ మౌతుంది. సంతోషాలు సమకూరతాయి.” అని ఆనందంగా విష్ణుమూర్తి చెప్పాడు.