పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విష్ణువు ఆగమనము

  •  
  •  
  •  

8-97-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భక్తజనపాలన పరాయణుండును, నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి, లక్ష్మీకాంతా వినోదంబులం దగులు సాలించి, సంభ్రమించి దిశలు నిరీక్షించి, గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి, [నిజపరికరంబుల నవధరించి] గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తులైన; జన = వారి; పాలన = రక్షించుట యందు; పరాయణుండును = ఏకాగ్రమైన ఆసక్తి గలవాడు; నిఖిల = సర్వ; జంతు = జీవుల; హృదయ = హృదయము లనెడి; అరవింద = పద్మముల యందు; సంస్థితుండును = వసించువాడు; అగు = ఐన; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణుండు - ఉదకము స్థానముగా గల వాడు, హరి}; కరికులేంద్ర = గజేంద్రుని {కరికులేంద్రుడు - కరి (ఏనుగు) కుల (సమూహమునకు) ఇంద్రుడు (ప్రభువు), గజేంద్రుడు}; విజ్ఞాపిత = మొరపెట్టుకొన్న; నానవిధ = వివిధములైన; దీన = ఆర్తి గల; ఆలాపంబులు = ప్రార్థనలు; ఆకర్ణించి = విని; లక్ష్మీకాంత = లక్ష్మీదేవితో; వినోదంబులన్ = సరససల్లాపము లందు; తగులు = ఆసక్తి; చాలించి = ఆపివేసి; సంభ్రమించి = త్వరపడి; దిశలు = దిక్కులవైపు; నిరీక్షించి = దీర్ఘముగ చూచి; గజేంద్ర = గజేంద్రుని; రక్షా = రక్షించెడి; పరత్వంబున్ = కార్యలగ్నమును; అంగీకరించి = స్వీకరించి; [నిజ = తన; పరికరంబున్ = ఆయుధములను; మరల = మళ్ళీ; అవధరించి = పూని;] గగనంబునన్ = ఆకాశమున; కున్ = కు; ఉద్గమించి = బయలుదేరి; వేంచేయున్ = వెళ్ళు; అప్పుడు = సమయము నందు.

భావము:

హరి భక్తులను ప్రోచుట యందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరససల్లాపాలు చాలించాడు. ఆత్రుత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపాడుట అనే బరువైన బాధ్యత తీసుకొని ఆకాశమార్గాన బయలుదేరాడు.అప్పుడు...