పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విష్ణువు ఆగమనము

  •  
  •  
  •  

8-108-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అ య్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక మనస్సమాన సంచారుం డై పోయిపోయి, కొంతదూరంబున శింశుమారచక్రంబునుం బోలె గురుమకరకుళీర మీనమిథునంబై; కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ మకరకచ్ఛపంబై; భాగ్యవంతుని భాగధేయంబునుంబోలె సరాగ జీవనంబై; వైకుంఠపురంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై; సంసార చక్రంబునుంబోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; కుంజరేంద్ర = గజేంద్రుని; పాలన = పరిపాలించెడి; పారవశ్యంబునన్ = మైమరపుచేత; దేవతా = దేవతల యొక్క; నమస్కారంబులన్ = నమస్కారములను; అంగీకరింపక = స్వీకరింపకుండగ; మనస్సమాన = మనోవేగముతో సమానముగ; సంచారుండు = వెళ్ళువాడు; ఐ = అయ్యి; పోయిపోయి = వెళ్ళివెళ్ళి; కొంత = కొంత; దూరంబునన్ = దూరము నందు; శింశుమారచక్రంబున్ = ఆకాశ మందలి రాసుల చక్రము, మొసళ్ళ నివాసము; పోలెన్ = వలె; గురు = గురుగ్రహము, పెద్దపెద్ద; మకర = మకరరాశి, మొసళ్ళు; కుళీర = కర్కాటకరాశి, పీతలు; మీన = మీనరాశి, చేపల; మిథునంబు = మిథునరాశి, జంటలు; ఐ = కలది యై; కిన్నరేంద్రుని = కుబేరుని; భాండాగారంబునున్ = ధనాగారము; పోలెన్ = వలె; స్వచ్ఛ = స్వచ్ఛమైన, తెల్లని; మకర = మకర మనెడి నిధి గలది, మోసళ్ళు గలది; కచ్చపంబు = కచ్చప మనెడి నిధి గలది, తాబేళ్ళు గలది; ఐ = అయ్యి; భాగ్యవంతుని = అదృష్టవంతుని; భాగధేయంబునున్ = సుఖజీవితము; పోలెన్ = వలె; సరాగ = అనురాగంతో కూడిన, ఎఱ్ఱని; జీవనంబున్ = జీవితము గలది, నీరు గలది; ఐ = అయ్యి; వైకుంఠ = వైకుంఠము యనెడి; పురంబునున్ = పురము; పోలెన్ = వలె; శంఖ = పాంచజన్యము, శంఖములు; చక్ర = సుదర్శనము, చక్రవాకములు; కమలా = లక్ష్మీదేవిలతో, కమలములతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐ = అయ్యి; సంసారచక్రంబునున్ = సంసారసాగరము; పోలెన్ = వలె; ద్వంద్వ = జలచర జంటలుతో, సుఖదుఃఖాది ద్వంద్వములు; సంకుల = కలకబారిన, వ్యాపించిన; సంకీర్ణంబు = చిక్కని బురద గలది, మిక్కిలి చిక్కులు గలది; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ; పంకజాకరంబున్ = మడుగును {పంకజాకరము - పంకజము (పద్మములకు) ఆకరము (నివాసము), సరోవరము}; పొడగని = కనుగొని;

భావము:

ఆ సమయంలో గజేంద్రుడిని రక్షించాలని వెళ్తున్న తొందరలో, విష్ణుమూర్తి దేవతల మొక్కులు అందుకోలేదు. అలా మనోవేగంతో వెళ్ళి, ఏనుగు, మొసలి పోరాడుతున్న మడుగుని చూసాడు. ఆ మడుగులో శింశుమార చక్రంలో లాగ గొప్ప మొసళ్ళు, పీతలు, చేపలు జంటలు జంటలుగా ఉన్నాయి. కుబేరుని ధనాగారంలోని కచ్చపం అనే నిధి వంటి శ్రేష్ఠమైన తాబేళ్ళు ఉన్నాయి, ధనవంతుని సుఖజీవనంలోని అనురాగం లాగ ఎఱ్ఱని జీవనం (నీరు) నిండుగా ఉంది, వైకుంఠం వలె శంఖం, చక్రం (చక్రవాక పక్షులు), కమల (లక్ష్మి) లతో అలంకరింపబడి ఉంది. సుఖదుఃఖాలనే ద్వంద్వాలతో నిండిన సంసారం వలె జలచరాల జంటలతో కలచబడిన బురద కలిగి యున్నది.