పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-93-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి మఱియు "నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ గాక" యని నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగడించుచు, బయ లాలకించుచు నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.

టీకా:

అని = అని; పలికి = మొరపెట్టుకొని; మఱియున్ = ఇంకను; అరక్షిత = దిక్కులేనివారిని; రక్షకుండు = కాపాడెడివాడు; ఐన = అయిన; ఈశ్వరుండు = పరమేశ్వరుడు; ఆపన్నుడు = ఆపదలో నున్నవాడు; ఐన = అయిన; నన్నున్ = నన్ను; కాచుగాక = కాపాడుగాక; అని = అని; నింగిన్ = ఆకాశమువైపు; నిక్కి = సాగి; చూచుచున్ = చూచుచు; నిట్టూర్పులున్ = నిట్టూర్పులను {నిట్టూర్పు - నిడి (దీర్ఘమైన) ఊర్పు (శ్వాస), మనసులోని శ్రమకు సంకేతము}; నిగడించుచు = విడుచుచు; బయలాలకించుచు = నిశ్చేష్టమగుచు {బయలాలకించు - బయలు (శూన్యములోనికి) ఆలకించు (విను), నిశ్చేష్టమగు}; ఆ = ఆ; గజేంద్రుండు = గజేంద్రుడు; మొఱచేయుచున్న = ఆక్రోశించుచున్న; సమయంబునన్ = సమయములో.

భావము:

ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొర పెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పగించి ఆక్రోశించాడు. ఆ సమయంలో...