పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని కొలను ప్రవేశము

  •  
  •  
  •  

8-50-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహారవ్యాకులిత నూతన లక్ష్మీవిభవయై యనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలియునుం బోలె వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు; విగతరస వదనకమలయు; నిజస్థాన చలిత కుచరథాంగ యుగళయు; లంపటిత జఘనపులినతలయునై యుండె; నంత.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; సరోవర = మడుగు యనెడి; లక్ష్మి = శోభ; మద = మదించిన; గజేంద్ర = గజేంద్రుని; వివిధ = నానా; విహార = సంచారముల; వ్యాకులిత = కలతపెట్టబడిన; నూతన = సరికొత్త; లక్ష్మీ = శోభల; విభవ = వైభవములు గలది; ఐ = అయ్యి; అనంగ = కామకళా; విద్యా = శాస్త్రము నందు; నిరూఢ = ప్రసిద్ధమైన; పల్లవ = విటుని; ప్రబంధ = చౌసీతి(40)బంధాలచే; పరికంపిత = మిక్కిలి చలించిన; శరీరాలంకార = దేహాలంకారములు గలది; అగు = అయిన; కుసుమకోమలియున్ = పూలవంటి సుకుమారి; పోలె = వలె; వ్యాకీర్ణ = చెదరిన; చికుర = ముంగురులువంటి; మత్త = మదించిన; మధుకర = తుమ్మెదల; నికరయున్ = సమూహము గలది; విగతరస = వడలిన; వదన = మోమువంటి; కమలయున్ = ఎఱ్ఱతామర గలది; నిజ = తమ; స్థాన = స్థానమునుండి; చలిత = చెదరిపోయిన; కుచ = వక్షోజములువంటి; రథాంగ = చక్రవాకముల; యుగళయున్ = జంట గలది; లంపటిత = నలిగిన; జఘన = పిరుదులువంటి; పులినతలయున్ = ఇసుకతిన్నెలు గలది; ఐ = అయ్యి; ఉండె = గోచరించుచున్నది; అంత = అంతట.

భావము:

అంతేకాక ఆ గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగు చక్కదనాలు చెదిరి కొత్తందాలు సంతరించుకొంది. గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్ళలో చిక్కి వణుకుతున్న కుసుమ సుకుమారిలా చక్కగా ఉంది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాలు ముఖంగా, చక్రవాకాలు తమ స్థానాలనుండి చెదిరిన స్తనాలుగా, నలిగిన ఇసుక తిన్నెలు అలసిన పిరుదులుగా కనిపిస్తున్నాయి.