పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని వర్ణన

  •  
  •  
  •  

8-42-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్
దిందిందిర వారముం, గమఠ మీగ్రాహ దుర్వారమున్,
హింతాల రసాల సాల సుమనో ల్లీకుటీతీరముం,
టులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.

టీకా:

అటన్ = అక్కడ; కాంచెన్ = చూచెను; కరణీ = గజ; విభుండు = రాజు; నవ = తాజా; పుల్ల = విచ్చుకొన్న; అంభోజ = కమలములు; కల్హారమున్ = కలువలు; నటత్ = ఆడుతున్న; ఇందిందిర = తుమ్మెదల; వారమున్ = సమూహము కలిగినది; కమఠ = తాబేళ్ళు; మీన = చేపలు; గ్రాహ = మొసళ్ళుతోను; దుర్వారమున్ = నివారింపరానిది; వట = మఱ్ఱి; హింతాల = తాడి; రసాల = తియ్యమామిడి; సాల = మద్ది; సుమనో = పువ్వుల; వల్లీ = లతా; కుటీ = కుంజములు గల; తీరమున్ = గట్లు కలిగిన; చటుల = మిక్కిలి వేగముగా; ఉద్ధూత = ఎగిరెడి; మరాళ = హంసలు; చక్ర = చక్రవాకములు; బక = కొంగల; సంచారంబున్ = విహరించుటలు కలిగినది; కాసారమున్ = మడుగును.

భావము:

అక్కడ ఒకచోట గజేంద్రుడు ఒక మడుగుని చూసాడు. ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతున్నాయి. అది తాబేళ్ళు, చేపలు, మొసళ్ళతో దాటరానిదిగా ఉంది. దాని గట్టు మీద మఱ్ఱి, తాడి, మామిడి, మద్దిచెట్లు పూల తీగలు ఉన్నాయి. ఇంకా హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి.
రహస్యార్థం -కరణీవిభుడు అంటే అంతఃకరణుడు, ముఖ్య అహంకార విషయుడు అగు పారమార్ధిక జీవుడు. ఆ జీవుడు ‘నవపుల్లాంభోజ’ అను అనాద్యవిద్యా వాసనలతో పరిమళించే హృదయ కమలాల వలన వికాసం పొందిన తుమ్మెదలు అను తృష్ణ పరంపర. క్షణక్షణం పాతాళం, అంతరిక్షం, దిగంతాలు పట్టి తిరుగుతూ ఉంటుంది. అలాంటి సంకల్పభావంతో కూడిన తృష్ణ అను తుమ్మెదలు కల లోభం, మోహం, కామం మున్నగు వాటిచే నివారించబడే జలచరాలు కలది, సుమనోవల్లీ కుటీరతీరం అంటే శుద్ధసాత్వికం అను కుటీర తీరం. భయకారణాలైన మోహం, అసూయ, దర్పం మొదలైనవాటితో చలించిపోతున్న కాసారాన్ని చూశాడు.