పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-261-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిక్కులు గెలిచితి నన్నియు
దిక్కెవ్వఁడు? రోరి! నీకు దేవేంద్రాదుల్
దిక్కుల రాజులు వేఱొక
దిక్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్."

టీకా:

దిక్కులు = దిక్కుల చివర వరకు; గెలిచితిన్ = జయించితి; అన్నియున్ = సర్వమును; దిక్కు = శరణు; ఎవ్వడు = ఎవడు; ఓరి = ఓరి; నీ = నీ; కున్ = కు; దేవేంద్ర = ఇంద్రుడు; ఆదుల్ = మొదలగువారు; దిక్కులరాజులు = దిక్పాలకులు {దిక్పాలకులు - 1ఇంద్రుడు (తూర్పు) 2అగ్నిదేవుడు (ఆగ్నేయము) 3యముడు (దక్షిణము) 4నిరృతి (నైరృతి) 5పడమర (వరుణుడు) 6వాయువు (వాయవ్యము) 7ఉత్తరము (కుబేరుడు) 8ఈశాన్యము (ఈశానుడు)}; వేఱొక = మరింకొక; దిక్కు = ప్రాపు, శరణు; ఎఱుగక = తెలియక; కొలుతురు = సేవింతురు; ఇతడె = ఇతడు మాత్రమే; దిక్కు = శరణు; అని = అని; నన్నున్ = నన్ను.

భావము:

ఓరీ! అన్ని దిక్కుల చివర్ల వరకూ ఉన్న రాజ్యాలన్నీ గెలిచాను. దేవేంద్రాది దిక్పాలుకులు అందరూ ఏ దిక్కూలేక ఇప్పుడు నన్నే దిక్కని తలచి మ్రొక్కుతున్నారు. ఇక నన్ను కాదని నీకు రక్షగా వచ్చేవాడు ఎవడూ లేడని తెలుసుకో.