పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-255-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు గురుసుతుండు చెప్పినఁ గొడుకువలని విరోధవ్యవహారంబులు గర్ణరంధ్రంబుల ఖడ్గప్రహారంబు లయి సోఁకిన; బిట్టు మిట్టిపడి పాదాహతంబైన భుజంగంబు భంగిఁ బవనప్రేరితంబైన దవానలంబు చందంబున దండతాడితం బయిన కంఠీరవంబుకైవడి భీషణ రోషరసావేశ జాజ్వల్యమాన చిత్తుండును బుత్రసంహారోద్యోగాయత్తుండును గంపమాన గాత్రుండును నరుణీకృత నేత్రుండును నై కొడుకును రప్పించి సమ్మానకృత్యంబులు దప్పించి నిర్దయుండై యశనిసంకాశ భాషణంబుల నదల్చుచు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; గురుసుతుండు = గురువగు శుక్రుని కొడుకు; చెప్పినన్ = చెప్పగా; కొడుకు = కొడుకు; వలని = మూలమునైన; విరోధ = అయిష్ట; వ్యవహారంబులున్ = వర్తనలు; కర్ణ = చెవుల; రంధ్రంబులన్ = కన్నములను; ఖడ్గ = కత్తి; ప్రహారంబుల్ = వ్రేటులు; అయి = అయ్యి; సోకినన్ = తగులగా; బిట్టు = మిగుల; మిట్టిపడి = అదిరిపడి; పాదా = కాలిచే; ఆహతంబున్ = తన్నబడినది; ఐన = అయిన; భుజంగంబు = పాము; భంగిన్ = వలె; పవన = గాలిచే; ప్రేరితంబు = రగుల్కొల్పబడినది; ఐన = అయిన; దవానలంబు = కార్చిచ్చు; చందంబునన్ = వలె; దండ = కఱ్ఱతో; తాడితంబు = కొట్టబడినది; అయిన = ఐన; కంఠీరవంబు = సింహము; కైవడి = వలె; భీషణ = భయంకరమైన; రోషరస = కోపము; ఆవేశ = ఆవేశించుటచే; జాజ్వల్యమాన = మండుతున్న; చిత్తుండును = మనసు గలవాడును; పుత్ర = కొడుకును; సంహార = చంపెడి; ఉద్యోగ = ప్రయత్నము నందు; ఆయత్తుండును = లగ్నమైన వాడును; కంపమాన = వణకుచున్న; గాత్రుండును = మేను గలవాడును; అరుణీకృత = ఎఱ్ఱగా చేయబడిన; నేత్రుండును = కన్నులు గలవాడును; ఐ = అయ్యి; కొడుకును = పుత్రుని; రప్పించి = రప్పించి; సమ్మాన = గౌరవింపు; కృత్యంబులున్ = చేతలు; తప్పించి = తప్పించి; నిర్దయుండు = కరుణమాలిన వాడు; ఐ = అయ్యి; అశని = పిడుగుల; సంకాశ = పోలిన; భాషణంబులన్ = మాటలతో; అదల్చుచు = బెదరించుచు.

భావము:

అని శుక్రాచార్యుని కొడుకు, ప్రహ్లాదుడి గురువు అన్నాడు. తన విరోధి విష్ణుమూర్తి మీద భక్తితో కూడిన స్వంత కొడుకు వ్యవహారాల గురించి వింటుంటే హిరణ్యకశిపుడికి చెవులలో కత్తులు గ్రుచ్చినట్లు అనిపించింది; రాక్షసేంద్రుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు; తోకత్రొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపంతో భగభగమండిపడిపోతూ, కన్నకొడుకును సంహరించాడానికి సిద్ధమయ్యాడు; కోపావేశంతో శరీరం ఊగిపోతోంది; కళ్ళు చింతనిప్పుల్లా ఎఱ్ఱబడుతున్నాయి; వెంటనే కొడుకును రప్పించాడు; వచ్చిన రాజకుమారుడిపై ఆదర ఆప్యాయతలు చూపలేదు; పైగా కఠినాత్ముడైన ఆ హిరణ్యకశిపుడు పలుకులలో పిడుగు కురిపిస్తూ, బెదిరించసాగాడు.