పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-152-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పంశర ద్వయస్కుఁడవు బాలుఁడ వించుక గాని లేవు భా
షించెదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని యర్థ మొ
క్కించుక యైనఁ జెప్ప వసురేంద్రుని ముందట, మాకు నౌఁదలల్
వంచుకొనంగఁ జేసితివి వైరివిభూషణ! వంశదూషణా!

టీకా:

పంచ = ఐదు (5); శరత్ = సంవత్సరముల; వయస్కుడవు = వయస్సు గలవాడవు; బాలుడవు = పిల్లవాడవు; ఇంచుక = కొంచెము; కాని = అయినను; లేవు = లేవు; భాషించెదు = చెప్పుతుంటివి; తర్క = వాదన పూర్వక; వాక్యములున్ = మాటలను; చెప్పిన = నేర్పినట్టి; శాస్త్రము = శాస్త్రము; లోని = అందలి; అర్థమున్ = విషయములను; ఒక్కించుకన్ = బాగా కొంచెము, కొద్దిగా; ఐనన్ = అయినను; చెప్పవు = పలుకవు; అసురేంద్రుని = హిరణ్యకశిపుని; ముందటన్ = ఎదురుగ; మా = మా; కున్ = కు; ఔదలల = శిరస్సులను; వంచుకొనంగ = వంచుకొనునట్లు; చేసితివి = చేసితివి; వైరి = శత్రువులను; భూషణ = మెచ్చుకొను వాడ; వంశ = స్వంత వంశమును; దూషణ = తెగడువాడ.

భావము:

“ఓరీ! రాక్షస కులానికి మచ్చ తెచ్చే వాడా! శత్రువులను మెచ్చుకునే వాడా! ప్రహ్లాదా! నిండా అయిదేళ్లు లేవు. చిన్న పిల్లాడివి. ఇంత కూడా లేవు. ఊరికే వాదిస్తున్నావు. మేము కష్టపడి బోధించిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పటం లేదు. రాజుగారి ఎదుట మాకు అవమానము తెస్తావా?