పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-127-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలుఁ బ్రభావిశాలు హరిపాదపయోరుహ చింతనక్రియా
లోలుఁ గృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల
శ్రీలు సమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా
జాలు న దేల? తండ్రి వడిఁ జంపఁగఁ బంపె మునీంద్ర! చెప్పవే.

టీకా:

బాలున్ = చిన్నపిల్లవానిని; ప్రభా = తేజస్సు; విశాలున్ = అధికముగా గలవానిని; హరి = నారాయణుని; పాద = పాదము లనెడి; పయోరుహ = పద్మము లందు; చింతన = ధ్యానించెడి; క్రియా = పనిలో; లోలున్ = తగిలి యుండెడివానిని; కృపాళున్ = దయ గలవానిని; సాధు = సజ్జనులు; గురు = పెద్దలు; లోక = అందరి; పద = పాదముల యందు; ఆనత = మోపిన; ఫాలున్ = నొసలు గలవానిని; నిర్మల = స్వచ్ఛమైన; శ్రీలున్ = శోభ గలవానిని; సమస్త = అఖిలమైన; సభ్య = సంస్కారవంతులచేత; నుత = స్తుతింపబడెడి; శీలున్ = నడవడిక గలవానిని; విఖండిత = మిక్కిలి తెంపబడిన; మోహ = అజ్ఞానము యనెడి; వల్లికా = తీగల; చాలున్ = రాశి కలవానిని; అది = అలా; ఏల = ఎందుకు; తండ్రి = (కన్న)తండ్రి; వడిన్ = శ్రీఘ్రముగ; చంపగన్ = చంపుబడుటకు; పంపెన్ = పంపించెను; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; చెప్పవే = చెప్పుము.

భావము:

నారదా! ప్రహ్లాదుడు చిన్నపిల్లాడూ, (కుఱ్ఱాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు, కనుక మన్నించటం న్యాయం అంతే తప్ప దండించడం తగదు) తేజోవంతుడూ, విష్ణుభక్తి గలవాడూ, సాధువుల గురువుల సేవ చేసేవాడూ, మంగళ స్వభావము కలవాడూ, సాధువులు పొగిడే ప్రవర్తన కల వాడూ, మోహపాశాలను త్రెంపుకున్న వాడూ. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి.” అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.