పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-125-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం బైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణ భావంబున విస్తరించుచు నప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు చేయుచు నప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణ గరిష్ఠుండును, పరమభాగవత శ్రేష్ఠుండును, కర్మబంధ లతా లవిత్రుండును, పవిత్రుండును నైన పుత్రుని యందు విరోధించి సురవిరోధి యనుకంపలేక చంపం బంపె" నని పలికిన నారదునకు ధర్మజుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పూర్వజన్మ = పూర్వపు పుట్టువు లందలి; పరమ = ఉత్తమ; భాగవత = భాగవతులతోటి; సంసర్గ = చేరికవలన; సమాగతంబు = లభించినది; ఐన = అయిన; ముకుంద = నారాయణుని; చరణ = పాదము లనెడి; అరవింద = పద్మములను; సేవా = సేవించుట యొక్క; అతిరేకంబునన్ = అతిశయమువలన; అఖర్వ = అధికమైన; నిర్వాణ = ఆనంద; భావంబు = అనుభూతి; విస్తరించున్ = పెరుగుతు; ఉన్నప్పటికిని = ఉన్నప్పటికిని; దుర్జన = చెడ్డవారితోటి; సంసర్గ = కలియకల; నిమిత్తంబునన్ = వలన; తన = తన యొక్క; చిత్తంబు = మనసు; అన్యా = ఇతరుల (పర); ఆయత్తంబు = అధీనమైనది; కానీక = అవ్వనియ్యకుండగ; నిజ = తన యొక్క; ఆయత్తంబు = అధీనములో నున్నదిగా; చేయుచున్ = చేయుచు; అప్రమత్తుండును = ఏమరిక లేనివాడు; సంసార = సంసారమును; నివృత్తుండును = విడిచినవాడు; బుధ = జ్ఞానులైన; జన = వారికి; విధేయుండును = స్వాధీనుడు; మహా = గొప్ప; భాగదేయుండును = (విష్ణుభక్తి) సంపన్నుడు; సుగుణ = మంచి గుణములు యనెడి; మణి = రత్నముల; గణ = సమూహములచే; గరిష్ఠుండును = గొప్పవాడు; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులలో; శ్రేష్ఠుండును = ఉత్తముడు; కర్మబంధ = కర్మబంధము లనెడి; లతా = తీగలకు; లవిత్రుండును = కొడవలివంటివాడు; పవిత్రుండు = పావనుడు; ఐన = అయినట్టి; పుత్రుని = కుమారుని; అందున్ = ఎడల; విరోధించి = శత్రుత్వము వహించి; సురవిరోధి = హిరణ్యకశిపుడు {సురవిరోధి - సుర (దేవత)లకు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు}; అనుకంప = దయ; లేక = లేకుండగ; చంపన్ = చంపుటకు; పంపెను = పంపించెను; అని = అని; పలికిన = చెప్పిన; నారదున్ = నారదుని; కున్ = కి; ధర్మజుండు = ధర్మరాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా ప్రహ్లాదుడికి పూర్వజన్మలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణు పాద భక్తి లభించింది. అతను అఖర్వ నిర్వాణ భావం విస్తరిస్తున్నప్పటికి, దుర్జనులతో సాంగత్యం కలిగి తన మనసు అన్యాయత్తంబు కానివ్వటం లేదు. అతడు ఆత్మావలోకనం చేసుకుంటూ అప్రమత్తుడై ఉంటాడు. సాంసారిక వృత్తులన్నీ వదిలేశాడు. అతను విజ్ఞులకు విధేయుడిగా ఉంటాడు. రత్నాలలాంటి సర్వ సుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు. పరమ భాగవతులలో ఉత్తముడు. కర్మబంధలన్నీ వదుల్చుకున్నవాడు. అటువంటి పవిత్రుడైన పుత్రుడితో విరోధించి జాలి లేకుండా చంపమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు పంపాడు” అని పలికిన నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు.