పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట

  •  
  •  
  •  

7-113-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేధోదత్త వరప్రసాద గరిమన్ వీఁ డింతవాఁడై మిమున్
బాధం బెట్టుచు నున్నవాఁ డని మదిన్ భావింతు, భావించి నే
సాధింపం దఱిగాదు; కావునఁ గడున్ సైరించితిన్, మీఁదటన్
సాధింతున్ సురలార! నేఁడు చనుఁడా శంకింప మీ కేటికిన్."

టీకా:

వేధ = బ్రహ్మదేవునిచే; దత్త = ఇవ్వబడిన; వర = వరముల యొక్క; గరిమనే = బలముతో; వీడు = ఇతడు; ఇంతవాడు = ఇంతటివాడు; ఐ = అయ్యి; మిమున్ = మిమ్ములను; బాధన్ = బాధలను; పెట్టుచున్నాడు = పెడుతున్నాడు; అని = అని; మదిన్ = మనసున; భావింతున్ = అనుకొనెదను; భావించి = తలచి; నేన్ = నేను; సాధింపన్ = నిర్జించుటకు; తఱి = సమయము; కాదు = కాదు; కావునన్ = అందుచేత; కడున్ = మిక్కిలి; సైరించితిన్ = సహించితిని; మీదటన్ = ఇకపైన; సాధింతున్ = నెరవేర్చెదను; సురలారా = దేవతలారా; నేడు = ఇప్పుడు; చనుడా = వెళ్ళండి; శంకింపన్ = అనుమానించుట; మీ = మీ; కున్ = కు; ఏటికిన్ = ఎందులకు.

భావము:

దేవతలారా! హిరణ్యాక్షుడు బ్రహ్మ ప్రసాదించిన వరాల బలంతో ఇంతటి వాడు అయి ఇలా మిమ్మల్ని బాధపెడుతున్నాడు అనుకుంటాను. అందుకే ఇప్పుడు వాడిని ఏమి చేయడానికైనా సమయం కాదు అని చూసికూడ ఊరుకున్నాను. ఇకపై ఊరుకోను. మీరు ఏ సందేహం పెట్టుకోకుండా వెళ్ళండి.