పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట

  •  
  •  
  •  

7-109-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు నాహారనిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు గానీక సమాహిత బుద్ధులై; భగవంతుఁడును, మహాపురుషుండును, మహాత్ముండును, విశుద్ధ జ్ఞానానంద మయుండును నైన హృషీకేశునకు నమస్కరించుచున్న యెడ; మేఘరవసమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించుచు, సాధులకు నభయంబు గావించుచు, దృశ్యమానుండు గాక పరమేశ్వరుండైన హరి యిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; ఆహారాదులు = ఆహారమునిద్రమొదలైనవి; మాని = విడిచిపెట్టి; చిత్తంబులు = మనసులు; పరా = ఇతరములపై; ఆయత్తంబులు = లగ్నమైనవి; కానీక = కానీయకుండగ; సమాహిత = కూడగొట్టుకొన్న; బుద్ధులు = చిత్తములు; ఐ = అయ్యి; భగవంతుడును = నారాయణుడు {భగవంతుడు - షడ్గుణైశ్వర్యయుక్తుడు, విష్ణువు}; మహాపురుషుడును = నారాయణుడు {మహాపురుషుడు - గొప్ప పురుషుడు, విష్ణువు}; మహాత్ముండును = నారాయణుడు {మహాత్ముడు - గొప్ప ఆత్మగలవాడు, విష్ణువు}; విశుద్ధజ్ఞానానందమయుం డును = నారాయణుడు {విశుద్ధజ్ఞానానందమయుడు - విశుద్ధ (స్వచ్ఛమైన) జ్ఞానముయొక్క రూపుడు (స్వరూపమైనవాడు),విష్ణువు}; ఐన = అయిన; హృషీకేశున్ = నారాయణుని {హృషీకేశుడు - హృషీకముల (ఇంద్రియముల)ను ఈశుడు (శాసించువాడు), విష్ణువు}; కున్ = కు; నమస్కరించుచున్న = మొక్కుతున్న; ఎడన్ = సమయమునందు; మేఘ = మేఘముల; రవ = ధ్వనికి; సమాన = సమానమైన; గంభీర = గంభీరమైన; నినదంబునన్ = స్వరముతో; దిశలు = దిక్కులు; మ్రోయించుచున్ = మారుమోగించుచు; సాధుల్ = దేవతల; కున్ = కు; అభయంబు = నిర్భయమును; కావించుచున్ = కలిగించుచు; దృశ్యమానుండు = కనబడెడివాడు; కాక = కాకుండగ; పరమేశ్వరుండు = నారాయణుడు {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నత మైన) ఈశ్వరుడు, విష్ణువు}; హరి = విష్ణువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలుకుతూ ఆహార పానీయాలు విడిచిపెట్టారు. మనస్సులు మరే ఇతరమైన వాటి పైకి పోకుండా నిగ్రహించుకుంటు. బుద్ధిని చిక్క బట్టుకొన్న వారై సాక్షాత్తు భగవంతుడు, మహా పురుషుడు, మహాత్ముడు, పరమేశ్వరుడు, ఆత్మ జ్ఞానానంద స్వరూపుడు, హృషీకేశుడు అయిన విష్ణువును మ్రొక్కారు. హరి కన్నులకు కనబడకుండా, దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు.