పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట

  •  
  •  
  •  

7-105-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైకనాయకుండై తన యిచ్ఛాప్రకారంబున నింద్రియసుఖంబు లనుభవించుచుఁ దనియక శాస్త్రమార్గంబు నతిక్రమించి విరించి వరజనిత దుర్వారగర్వాతిరేకంబున సుపర్వారాతి యైశ్వర్యవంతుండై పెద్దకాలంబు రాజ్యంబు జేయునెడ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సకల = అన్ని; దిక్కులు = దిక్కులు; నిర్జించి = జయించి; లోక = అఖిలలోకములకు; ఏక = ఒకడే; నాయకుండు = నాయకుడు; ఐ = అయ్యి; తన = తన యొక్క; ఇచ్ఛా = ఇష్టము; ప్రకారంబునన్ = వచ్చినట్లు; ఇంద్రియసుఖంబుల్ = ఇంద్రియసుఖములను; అనుభవించుచు = అనుభవించుచు; తనియక = తృప్తిచెందక; శాస్త్ర = శాస్త్రము; మార్గంబు = నిర్దేశించినవిధమును; అతిక్రమించి = దాటి; విరించి = బ్రహ్మదేవుడిచ్చిన; వర = వరములవలన; జనిత = కలిగిన; దుర్వార = దాటశక్యముగాని; గర్వ = గర్వము; అతిరేకంబునన్ = పెరుగుటవలన; సుపర్యారాతి = హిరణ్యకశిపుడు {సుపర్యారాతి - సుపర్వులు (దేవతలు)కు ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; ఐశ్వర్యవంతుండు = ఐశ్వర్యములుగలవాడు; ఐ = అయ్యి; పెద్ద = ఎక్కువ; కాలంబు = కాలము; రాజ్యంబున్ = రాజ్యము; చేయున్ = చేసెడి; ఎడన్ = సమయమునందు.

భావము:

ఈ విధంగా దిక్కులన్నీ జయించి, లోకాలు అన్నింటి పై ఏకఛత్రాధిపత్యం సాధించాడు. తన ఇష్టానుసారం ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నాడు. అయినా తృప్తి చెందటం లేదు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో మితిమీరిన గర్వంతో విఱ్ఱవీగుతూ శాస్త్రం చెప్పిన మార్గం అతిక్రమించి మరీ మెలగుతున్నాడు. ఈ విధంగా సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ, హిరణ్యకశిపుడు పెద్ద కాలంగా రాజ్యం చేయసాగాడు. అప్పుడు.