పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : సుయజ్ఞోపాఖ్యానము

  •  
  •  
  •  

7-76-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శంకా లేశము లేదు దేవ! త్రిజగ త్సంహారమున్ దేవతా
సంకోచంబును వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ లేక యే
వంకన్ లేవ నటంచు దుస్సహతపోవ్యావృత్తి చిత్తంబులో
సంల్పించె నిశాచరుండు ప్రతిసంస్కారంబు చింతింపవే.

టీకా:

శంకా = అనుమానము; లేశము = ఏమాత్రము; లేదు = లేనేలేదు; దేవ = భగవంతుడ; త్రిజగత్ = ముల్లోకములను; సంహారమున్ = నాశనముచేయుట; దేవతా = దేవతలను; సంకోచంబును = అణచుట; వేద = వేదముల; శాస్త్ర = శాస్త్రముల; పదవీ = ఉన్నతిని; సంక్షేపమున్ = వినాశంచేయుట; లేక = లేకపోతే; ఏ = ఎట్టి; వంకన్ = కారణముచేతను; లేవను = లేవనేలేవను; అంచున్ = అనుచు; దుస్సహ = సహింపరాని; తపస్ = తపస్సును; వ్యావృత్తిన్ = చుట్టబెట్టుటను; చిత్తంబు = మనసు; లోన్ = అందు; సంకల్పించెన్ = తలపెట్టెను; నిశాచరుండు = రాక్షసుడు {నిశాచరుడు - నిశ (రాత్రి) యందు చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; ప్రతి = మారుచేసెడి, శమింపచేసెడి; సంస్కారంబు = ఉపాయమును; చింతింపవే = యోచింపుము.

భావము:

భగవాన్! బ్రహ్మదేవా! ఈ హిరణ్యకశిపుడు రాక్షసుడు. ఇంతటి దుస్సహమైన తపస్సు చేస్తున్నాడు అంటే, వీడు దేవతలను అణిచేయాలనీ, వేదశాస్త్రాలు వినాశనం కావాలనీ, ముల్లోకాలనూ నాశనం చేయాలనీ అయ్యే ఉంటుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దీనికి ప్రతీకారం ఏం చేయాలో చూసి మమ్మల్ని రక్షించు.