పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : సుయజ్ఞోపాఖ్యానము

 •  
 •  
 •  

7-40-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అవ్వా! యి వ్విధంబున లక్షణవంతుండు గాని యీశ్వరుండు లక్షితుండై కర్మసంసరణంబున యోగవియోగంబుల నొందించు సంభవ వినాశ శోక వివేకావివేక చింతా స్మరణంబులు వివిధంబు; లీ యర్థంబునకుఁ బెద్దలు ప్రేతబంధు యమ సంవాదం బను నితిహాసంబు నుదాహరింతురు; వినుండు, చెప్పెద; నుశీనర దేశంబు నందు సుయజ్ఞుం డను రాజు గలం; డతండు శత్రువులచేత యుద్ధంబున నిహతుం డయి యున్న యెడ.

టీకా:

అవ్వా = అమ్మా; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; లక్షణవంతుండు = గుఱుతుగలవాడు; కాని = కానట్టి; ఈశ్వరుండు = భగవంతుడు; లక్షితుండు = లక్షణములుగలవాడు; ఐ = అయ్యి; కర్మ = కర్మముల; సంసరణంబులన్ = ప్రవాహమువలన; యోగ = కలియుట; వియోగంబులన్ = దూరమగుటలను; ఒందించున్ = పొందించును; సంభవ = పుట్టుట; వినాశ = చచ్చుట; శోక = దుఃఖము; వివేక = తెలివి; అవివేక = తెలివిలేమి; చింతా = యోచన; స్మరణంబులు = తలచుటలు; వివిధంబులు = పలువిధంబులు; ఈ = ఈ; అర్థంబున్ = విషయము; కున్ = అందు; పెద్దలు = జ్ఞానులు; ప్రేత = శవము యొక్క; బంధు = బంధువులకు; యమ = యమునకునైన; సంవాదంబు = సంభాషణము; అను = అనెడి; ఇతిహాసమున్ = చరిత్రమును; ఉదహరింతురు = ఉదాహరణగా చెప్పెదరు; వినుండు = వినండి; చెప్పెదను = చెప్పెదను; ఉశీనర = ఉశీనరము యనెడి {ఉశీనరదేశము - ఇప్పటి గాంధార దేశము}; దేశంబున్ = దేశము; అందు = లో; సుయజ్ఞుండు = సుయజ్ఞుడు; అను = అనెడి; రాజు = రాజు; కలండు = ఉన్నాడు; అతండు = అతడు; శత్రువుల్ = శత్రువుల; చేత = చేత; యుద్ధంబునన్ = యుద్ధమునందు; నిహతుండు = మరణించినవాడు; అయి = అయ్యి; ఉన్న = ఉన్న; ఎడ = సమయములో.

భావము:

ఆ భగవంతుడు “ఇదిగో ఈ లక్షణాలతో ఉంటాడు” అని నిర్ధారణ చేసి గుర్తులు ఏమీ చెప్పలేము; ఆయన గుర్తులకు అతీతుడు; కాని ఆ పరముడు ఒక్కొక్క సారి లక్షణాలు పొంది, సంసార బంధాలలో ప్రవేశించి సంయోగ వియోగాలను కలుగజేస్తాడు; అవి పుట్టుక, మరణం, దుఃఖము, తెలివి, అవివేకము, చింత, స్మరణ అని అనేక రకాలుగా ఉంటాయి; ఈ పరమార్థాన్ని చెప్పడానికి పెద్దలు ప్రేతబంధు యమ సంవాదం అనే కథ చెప్తుంటారు. దానిని చెప్తాను వినండి; పూర్వం గాంధారదేశంలో సుయజ్ఞుండు అనే రాజు ఉండేవాడు. అతడు యుద్ధంలో శత్రువులకు చిక్కి మరణించాడు. ఆ సమయంలో.

7-41-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చిరిఁగిన బహురత్న చిత్రవర్మముతోడ-
రాలిన భూషణ రాజితోడ
భీకరబాణ నిర్భిన్న వక్షముతోడఁ-
ఱచుఁ గాఱెడు శోణితంబుతోడఁ
గీర్ణమై జాఱిన కేశబంధముతోడ-
యరోషదష్ట్రాధరంబుతోడ
నిమిషహీనం బైన నేత్రయుగ్మముతోడ-
భూరజోయుత ముఖాంబుజముతోడఁ

7-41.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దునిసిపడిన దీర్ఘ దోర్దండములతోడ
జీవరహితుఁ డగు నుశీనరేంద్రుఁ
జుట్టి బంధుజనులు సొరిది నుండఁగ భయా
క్రాంత లగుచు నతని కాంత లెల్ల.

టీకా:

చిరిగిన = చినిగిన; బహు = అనేక; రత్న = రత్నములుగూర్చబడిన; చిత్ర = సొగసైన; వర్మము = కవచము; తోడ = తోటి; రాలిన = రాలిపడిపోయిన; భూషణ = అలంకారముల; రాజి = సమూహము; తోడ = తోటి; భీకర = భయముకలిగించెడి; బాణ = బాణములచే; నిర్భిన్న = చీల్చబడిన; వక్షము = రొమ్ము; తోడన్ = తోటి; తఱచుగాన్ = అధికముగా; కాఱెడు = కారుతున్న; శోణితంబు = నెత్తురు; తోడన్ = తోటి; కీర్ణము = చెదరినది; ఐ = అగుటచే; జాఱిన = జారిపోయిన; కేశ = జుట్టు; బంధము = ముడి; తోడన్ = తోటి; రయ = వడిగల; రోష = కసివలన; దష్ట్రా = కొరకబడిన; అధరంబున్ = పెదవి; తోడన్ = తోటి; నిమిష = రెప్పపాటులు; హీనంబు = లేకపోయినవి; ఐన = అయిన; నేత్ర = కన్నుల; యుగ్మము = జంట; తోడన్ = తోటి; భూరజస్ = మట్టిదుమ్ముతో; యుత = కూడిన; ముఖ = ముఖము యనెడి; అంబుజము = తామరపువ్వు; తోడన్ = తోటి; తునిసి = తెగి; పడిన = పడిపోయిన. దీర్ఘ = పొడవైన; దోః = చేతులు యనెడి; దండముల = దండములు; తోడ = తోటి; జీవ = ప్రాణము; రహితుండు = లేనివాడు; అగు = అయిన; ఉశీనరేంద్రున్ = ఉశీనరమహారాజును; చుట్టి = చుట్టునుచేరి; బంధు = బంధువులు ఐన; జనులు = వారు; సొరిదిన్ = వరుసలుదీరి; ఉండగా = ఉండగా; భయ = భయముచేత; ఆక్రాంతలు = ఆవరింపబడినవారు; అగుచున్ = అగుచు; అతని = అతని యొక్క; కాంతలు = భార్యలు; ఎల్ల = అందరును.

భావము:

అలా మరణించిన ఆ మహారాజు సుయజ్ఞుడి కళేబరం ఎలా పడి ఉందంటే. అనేక మణులు పొదిగిన ఎంతో చక్కటి రత్నకవచం చిరిగిపోయింది. ధరించిన భూషణాలు అన్ని రాలిపోయాయి. శత్రువుల భయంకరమైన వాడి బాణాల దెబ్బలకు వక్షస్థలం పగిలిపోయింది. రక్తం కారుతోంది. జుట్టు ముడి జారివిడిపోయి చిక్కులు పడిపోయింది. కోపంతో కరచుకున్న పెదవులు దంతాలు బిగుసుకుపోయాయి. కనురెప్పల కదలిక పోయి రెండు కళ్ళు మిడిగుడ్లు పడ్డాయి. ముఖమంతా ధూళి దుమ్ము కొట్టుకుపోయింది. పొడవైన చేతులు అక్కడే తెగి పడి ఉన్నాయి. ఆ గాంధార మహారాజు శవం చుట్టూ బంధ బలగం గుమిగూడి ఉన్నారు. అతని భార్యలు అందరూ భయపడిపోతూ, విలపిస్తున్నారు.

7-42-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

స్రస్తాకంపిత కేశబంధములతో సంఛిన్నహారాళితో
స్తాబ్జంబులు సాఁచి మోఁదికొనుచున్ హా నాథ! యంచున్ బహు
ప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగం బ్రాణేశు పాదంబుపై
స్తోక స్తనకుంకమారుణ వికీర్ణాస్రంబు వర్షించుచున్.

టీకా:

స్రస్తా = జారిపోయి; ఆకంపిత = పొరలుచున్న; కేశబంధముల్ = కొప్పులు; తోన్ = తోటి; సంఛిన్న = తెగిపోయిన; హార = హారముల; ఆవళి = సమూహము; తోన్ = తోటి; హస్తా = చేతులు యనెడి; అబ్జంబులు = పద్మములు; సాచి = చాచి; మోదికొనుచున్ = రొమ్ముపైకొట్టుకొనుచు; హా = అయ్యో; నాథ = మగడా; అంచున్ = అనుచు; బహు = అనేకమైన; ప్రస్తావ = ప్రస్తావించెడి; ఉక్తుల = పలుకులు; తోడన్ = తోటి; ఏడ్చిరి = దుఃఖించిరి; వగన్ = శోకముతో; ప్రాణేశు = మగని {ప్రాణేశుడు - ప్రాణములకు ఈశుడు (ప్రభువు), భర్త}; పాదాల = పాదముల; పైన్ = మీద; అస్తోక = విస్తారమైన; స్తన = చనుల యందలి; కుంకుమ = కుంకుమచే; అరుణ = ఎఱ్ఱబారి; వికీర్ణ = జారుతున్న; అస్రంబున్ = కన్నీళ్ళను; వర్షించుచున్ = కురియుచు.

భావము:

ఆ రాజు కాంతలు తలలు బాదుకుని ఏడుస్తున్నారు. వారి సుందరమైన కేశ బంధాలు జారిపోయి చిందర వందరలు అయిపోయాయి. కంఠాలలోని హారాలు తెగిపోయాయి. చేతులు చాచి గుండెలు బాదుకుంటూ “నాథా! హా నాథా!” అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆపుకోలేని దుఃఖంతో భర్త పాదాలపై పడి గత స్మృతుల తలచుకుంటూ విలపిస్తున్నారు. కన్నీరు కాలువలు కట్టి పాలిండ్లపై పడి ప్రాకి కుంకుమ లేపనం కరిగి ప్రవహిస్తుండగా, కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

7-43-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ఘా! నిన్ను నుశీనరప్రజల కర్థానందసంధాయిగా
మును నిర్మించిన బ్రహ్మ నిర్దయత నున్మూలించెనే వీరికిం
యశ్రేణికి మాకు దిక్కు గలదే ధాత్రీశ! నీబోఁటికిం
నునే పాసి చనంగ భాతృజనులన్ న్మిత్రులం బుత్రులన్.

టీకా:

అనఘా = పుణ్యడా; నిన్నున్ = నిన్ను; ఉశీనర = ఉశీనర; ప్రజల = పౌరుల; అర్థ = సంపదలు; ఆనంద = సంతోషములను; సంధాయి = కలిగించెడివాడు; కాన్ = అగునట్లు; మును = పూర్వము; నిర్మించిన = సృష్టించిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నిర్దయతన్ = కరుణ లేకుండగా; ఉన్మూలించెనే = నశింపజేసెనే; వీరి = వీరి; కిన్ = కిని; తనయ = పుత్రుల; శ్రేణి = సమూహమున; కిన్ = కిని; మాకున్ = మాకు; దిక్కు = ప్రాపు; కలదే = (ఎక్కడైనా) ఉన్నదాఏమి; ధాత్రీశ = రాజా {ధాత్రీశుడు - ధాత్రి (భూమి)కి ఈశుడు (ప్రభులు), రాజు}; నీ = నీ; బోటి = వంటివాని; కిన్ = కి; చనునే = తగునా ఏమి; పాసి = విడిచి; చనంగా = పోవుట; భాతృ = సోదర; జనులన్ = వంటివారిని; సత్ = మంచి; మిత్రులన్ = స్నేహితులన్; పుత్రులన్ = కొడుకులను.

భావము:

“ఓ పుణ్యాత్ముడా! ఆ చతుర్ముఖుడు ఉశీనర దేశాన్ని ప్రజలు సంపదలతో, సంతోషాలతో జీవించేలా పరిపాలించమని నిన్ను పుట్టించాడు. ఈ నాడు నిర్దయుడై ఆ బ్రహ్మదేవుడు నీకు మరణం రాసిపెట్టాడు. ఇక ప్రజలకు దిక్కెవ్వరు? నీ కొడుకులకు మాకు ఆధారం ఎవరు? నిన్ను ఆశ్రయించుకుని ఉన్న ఈ జనులను, బంధు జనులను, పుత్ర మిత్ర కళత్రాదులను వదిలి ఇలా నీ పాటికి నువ్వు పోతే ఎలాగ, మహారాజా!

7-44-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లోకేశ్వర! నిన్నుఁ బాసిన నిమేషంబుల్ మహాబ్దంబులై
ను లోకాంతరగామివై మరల కీ చందంబునన్ నీవు పో
యి మే మెట్లు చరింతు మొల్లము గదా యీ లోకవృత్తంబు నేఁ
లజ్వాలలఁ జొచ్చి వచ్చెదము నీ యంఘ్రిద్వయిం జూడగన్."

టీకా:

జనలోకేశ్వర = రాజా {జనలోకేశ్వరుడు - జన(ప్రజలు) లోక (అందర)కు ఈశ్వరుడు(ప్రభువు), రాజు}; నిన్నున్ = నిన్ను; పాసిన = ఎడబాసిన; నిమేషంబుల్ = నిమిషములు; మహాబ్దంబుల్ = దివ్యసంవత్సరములు; ఐ = అయ్యి; చనున్ = జరుగును; లోక = లోకము; అంతర = ఇతరమైనదానికి; గామివి = పోయినవాడవు; ఐ = అయ్యి; మరలక = వెనుదిరగక; ఈ = ఈ; చందంబునన్ = విధముగా; నీవు = నీవు; పోయిన = చనిపోయిన; మేము = మేము; ఎట్లు = ఏ విధముగ; చరింతుము = తిరిగెదము; ఒల్లము = అంగీకరించలేము; కదా = కదా; ఈ = ఈ; లోక = లోకమందలి; వృత్తంబున్ = నడవడికను; నేడు = ఇప్పుడు; అనల = అగ్ని; జ్వాలలన్ = మంటలలే; చొచ్చి = ప్రవేశించి; వచ్చెదము = వచ్చెదము; నీ = నీ; అంఘ్రి = పాదముల; ద్వయిన్ = జంటని; చూడగన్ = చూచుటకు.

భావము:

జనులను ఏలే మా ప్రభూ! నీ వియోగంలో మాకు క్షణాలు యుగాలులా గడుస్తాయి. నీ విలా పర లోకానికి పోయి తిరిగి రాకపోతే మేం ఎలా బ్రతకగలం. నీవు లేని ఈ లోకంతో మాకు పనేం ఉంది. నీవు లేని ఈ లౌకిక జీవితం మాకు అక్కర లేదు. మేం అగ్నిలో సహగమనం చేసి నీ చరణ సన్నిదికి చేరుకుంటాం.

7-45-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు రాజభార్య లా రాజశవంబు డగ్గఱి విలపింపం బ్రొద్దు గ్రుంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణబాలకుం డై యముండు చనుదెంచి ప్రేతబంధువులం జూచి యిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; రాజ = రాజు యొక్క; భార్యలు = సతులు; ఆ = ఆ; రాజ = రాజు యొక్క; శవంబు = మృతశరీరము, పీనుగు; డగ్గఱి = దగ్గరకు చేరి; విలపింపన్ = ఏడ్చుచుండగా; ప్రొద్దు = సూర్యుడు; క్రుంకెడు = అస్తమయపు; సమయంబునన్ = సమయమునందు; వారల = వారి యొక్క; విలాపంబులు = ఏడుపులు; విని = విని; బ్రాహ్మణ = బ్రాహ్మణ వంశపు; బాలకుండు = చిన్నపిల్లవాడు; ఐ = వలె; యముండు = యముడు; చనుదెంచి = వచ్చి; ప్రేత = పీనుగు యొక్క; బంధువులన్ = చుట్టములను; చూచి = చూచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ విధంగా ఆ రాణులు సుయజ్ఞుని శవం వద్ద విలపిస్తుండగా యమధర్మరాజు విన్నాడు. అప్పుడు ఓ ప్రక్క సూర్యాస్తమయ సమయం అవుతోంది. యముడు బ్రాహ్మణ బాలుడి రూపుదాల్చి వచ్చి ఆ ప్రేతబంధువులు (శవం యొక్క బంధువులు) వద్దకు వచ్చి వారితో ఇలా అన్నాడు.

7-46-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"చ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము దేహి పుట్టుచుం
చ్చుచు నుంటఁ జూచెదరు చావక మానెడువారిభంగి నీ
చ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక డాఁగ వచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట నైజము ప్రాణికోటికిన్.

టీకా:

మచ్చికన్ = చనువుతో; వీరి = వీరి; కిన్ = కి; ఎల్లన్ = అందరకును; బహు = అధికముగా; మాత్రము = యైన; చోద్యము = చిత్రము; దేహి = జీవుడు {దేహి - దేహము (శరీరమును) ధరించినవాడు, జీవుడు}; పుట్టుచున్ = జన్మించుచు; చచ్చుచున్ = మరణించుచు; ఉంటన్ = ఉండుటను; చూచెదరు = చూచుచునేయుందురు కాని; చావక = మరణించకుండగ; మానెడు = మానివేసెడివారి; భంగిన్ = విధముగా; ఈ = ఈ; చచ్చిన = చచ్చిపోయిన; వారి = వారల; కిన్ = కు; ఏడ్చెదరు = దుఃఖించెదరు; చావున్ = మరణమునకు; ఒల్లక = అంగీకరించక; డాగన్ = దాగికొనుటకు; వచ్చునే = సాధ్యమగునా ఏమి; ఎచ్చటన్ = ఎక్కడనుండి; పుట్టెన్ = వచ్చి పుట్టెనో; అచ్చట = అక్కడ; కిన్ = కి; ఏగుట = వెళ్ళుట; నైజము = స్వాభావికము; ప్రాణి = జీవుల; కోటికిన్ = అందరు; కిన్ = కు.

భావము:

వీరి ఈ మోహం ఎంతో వింతగా ఉంది. దేహం ధరించే ప్రతివాడు పుట్టటం తప్పదు, చావటం తప్పదు. ఎక్కడ దాక్కున్నా ఎవరూ చావు తప్పించుకోలేరు కదా. జీవులు ఎక్కడ నుండి వచ్చారో అక్కడకు పోవడం సహజం. అందరూ పుడుతూ, చస్తూ ఉండటం రోజూ చూస్తూ కూడా, చచ్పిన వాళ్ళ కోసం మక్కువలు ఎక్కువగా పెంచుకుని ఏడుస్తుంటారు. ఎంత చోద్యమో.

7-47-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీజనకులఁ బాసియు,
వృకముల బాధపడక డుఁ బిన్నలమై
నియెద మెవ్వఁడు గర్భం
బు మును పోషించె వాఁడె పోషకుఁ డడవిన్.

టీకా:

జననీజనకుల్ = తల్లిదండ్రుల; కున్ = కు; పాసియు = దూరమై; ఘన = పెద్దపెద్ద; వృకముల = తోడేళ్ళవలన; బాధపడక = బాధలుపొందకుండగ; కడున్ = మిక్కిలి; పిన్నలము = చిన్నవారము; ఐ = అయ్యి; మనియెదము = బతికెదము; ఎవ్వడు = ఎవడైతే; గర్భంబునన్ = తల్లికడుపులో; మున్ను = పూర్వము; పోషించెన్ = పోషించెనో; వాడె = అతడే; పోషకుడు = పోషించువాడు; అడవిన్ = అడవిలోనైనను.

భావము:

ఒకవేళ తల్లిదండ్రుల వద్ద నుండి చిన్నప్పుడే తప్పిపోయి, ఘోరమైన అడవిలో పెద్ద తోడేళ్ళ లాంటి క్రూరమృగాలు మధ్య తిరుగుతున్నా భగవంతుని దయ ఉంటే వాటి బారిని పడి చావకుండా సురక్షితంగా ఉంటాం. తల్లి గర్బంలో ఉన్నప్పుడు రక్షించి పోషించిన వాడు ఆ భగవంతుడే కదా. అలాగే అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా, సర్వే సర్వత్రా రక్షకుడు ఆ భగవంతుడే.

7-48-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వ్వఁడు సృజించుఁ బ్రాణుల,
నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ
డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై.

టీకా:

ఎవ్వడు = ఎవడైతే; సృజించున్ = సృష్టించునో; ప్రాణులన్ = జీవులను; ఎవ్వడు = ఎవడైతే; రక్షించున్ = కాపాడునో; త్రుంచున్ = చంపువాడు; ఎవ్వడు = ఎవడో; అనంతుండు = నాశములేనివాడు; ఎవ్వడు = ఎవడో; విభుడు = ప్రభువు; ఎవ్వడు = ఎవడో; వాడు = అతడు; ఈ = ఈ; విధమునన్ = విధముగా; మనుచున్ = బ్రతికించును; పెనుచున్ = వృద్ధికలిగించును; హేలా = క్రీడించుటందు; రతుడు = ఆసక్తిగలవాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ విశ్వాన్ని ఎవడైతే సృష్టిస్తాడో, రక్షిస్తాడో, నశింపజేస్తాడో; శాశ్వతుడు ఎవడో; బ్రహ్మాండానికి అధిపతి అయిన వాడు ఎవడో; వాడే లీలావిలాసలతో ఈ లోకాన్ని రక్షిస్తూ, పోషిస్తూ ఉంటాడు.

7-49-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నము వీథిఁ బడిన దైవవశంబున
నుండు; పోవు మూల నున్న నైన;
డవి రక్ష లేని బలుండు వర్ధిల్లు;
క్షితుండు మందిమునఁ జచ్చు.

టీకా:

ధనము = డబ్బులు; వీథిన్ = త్రోవలో; పడినన్ = పడిపోయినను; దైవవశంబునన్ = దేవుని ఆజ్ఞానుసారము; ఉండున్ = ఉండును; పోవున్ = మాయమైపోవును; మూలన్ = ఎంతమూలల్లోదాచబడి; ఉన్నన్ = ఉన్నది; ఐనన్ = అయినను; అడవిన్ = అడవిలోనైనను; రక్ష = దిక్కు; లేని = లేనట్టి; అబలుండు = బలహీనుడు; వర్ధిల్లు = అభివృద్ధిచెందును; రక్షితుండు = కాపాడబడుతున్నవాడు; మందిరమునన్ = ఇంటిలోనైనను; చచ్చున్ = మరణించును.

భావము:

ధనం వీథిలో పడిపోయినా దైవయోగం బావుంటే సురక్షితంగానే ఉంటుంది. అదే గీత బాగుండకపోతే భవంతుల్లో ఎంత మూల మూలల్లో భద్రంగా దాచినా మటుమాయం అయిపోతుంది. అలాగే దుర్భలుడైనా భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందుతాడు. అది లేని వాడు పెద్ద సౌధంలో అనేక రక్షణలు, రక్షకభటులు ఎంత కాపలా ఉన్నా మరణిస్తాడు.

7-50-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లుగును మఱి లేకుండును
భూతము లెల్లఁ గాలర్మవశము లై
నిలుఁవడు ప్రకృతిం దద్గుణ
లితుఁడు గాఁ డాత్మమయుఁ డమ్యుఁడు దలపన్.

టీకా:

కలుగును = పుట్టును; మఱి = మరల; లేకుండును = నశించును; కల = ఉన్నట్టి; భూతములు = జీవులు; ఎల్లన్ = అన్నియును; కాల = కాలమునకు; కర్మ = కర్మమునకు; వశములు = లోబడినవి; ఐ = అయ్యి; నిలువడు = ప్రతిష్ఠింపడును; ప్రకృతిన్ = ప్రకృతిలో; తత్ = ఆ దేహము యొక్క; గుణ = గుణములతో; కలితుఁడు = కూడినవాడు; కాడు = అవ్వడు; ఆత్మ = ఆత్మ; మయుడు = స్వరూపుడు; అగమ్యుడు = పొందరానివాడు; తలపన్ = విచారించగా.

భావము:

ఆయన నియమించినట్లు ప్రకృతిలో, త్రిగుణాలతో కూడి జీవులన్నీ కాలానికి, కర్మలకు వశమై పుడుతూ, చస్తూ ఉంటాయి. కాని భగవంతుడు ప్రకృతికి త్రిగుణాలకి లొంగి ఉండడు. ఆయన త్రిగుణాలు కలవాడు కాడు, త్రిగుణాలకి అతీతుడు. సమస్తమందు ఆత్మరూపంలో నిండి ఉంటాడు. ఆ పరమాత్మ తత్వం ఎవరికి అర్థం గాదు.

7-51-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాంచభౌతికమైన వనంబు దేహంబు-
పురుషుఁడు దీనిలోఁ బూర్వకర్మ
శమున నొకవేళ ర్తించు దీపించుఁ-
ఱియైన నొకవేళఁ లఁగి పోవుఁ
జెడెనేని దేహంబు సెడుఁగాని పురుషుండు-
చెడ డాతనికి నింత చేటులేదు
పురుషునకిని దేహపుంజంబునకు వేఱు-
గాని యేకత్వంబు గానరాదు

7-51.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దారువులఁ వెలుంగు హనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలిభంగి
నాళలీనమైన భము చాడ్పున వేఱు
దెలియవలయు దేహి దేహములకు.

టీకా:

పాంచభౌతికము = పంచభూతకల్పితము {పంచభూతములు - 1నిప్పు 2నీళ్ళు 3మన్ను 4గాలి 5ఆకాశము}; ఐన = అయిన; భవనంబు = నివాసము, పురము; దేహంబు = శరీరము; పురుషుడు = పురుషుడు; దీని = ఇందు; లోన్ = లోపల; పూర్వ = పాతకాలపు; కర్మ = కర్మములకు; వశమునన్ = లోబడి; ఒకవేళ = ఒక్కొక్కసమయములో; వర్తించున్ = తిరుగును; దీపించున్ = వృద్ధిపొందును; తఱి = సమయము; ఐనన్ = వచ్చినచో; ఒకవేళ = ఒకసారి; తలగిపోవున్ = తప్పుకొనును; చెడెన్ = చెడిపోయినట్లు; ఏని = ఐతే; దేహంబున్ = శరీరము; చెడున్ = చెడిపోవును; కాని = కాని; పురుషుండు = జీవుడు; చెడడు = చెడిపొడు; ఆతని = అతని; కిన్ = కి; ఇంత = కొంచముకూడ; చేటు = చెడిపోవుటన్నది; లేదు = లేదు; పురుషున్ = పురుషుని; కిని = కిని; దేహ = శరీరముల; పుంజమున్ = రాశి; కున్ = కిని; వేఱు = బేధమే; కాని = కాని; ఏకత్వంబున్ = ఒకటేయగుట; కానరాదు = కనబడదు. దారువులన్ = కట్టెలందు; వెలుంగు = విలసిల్లెడి; దహనుని = నిప్పు; కైవడి = వలె; కాయములన్ = దేహములలో; చరించున్ = వర్తించుచుండును; గాలి = వాయువు; భంగిన్ = వలె; నాళ = కాడ, గొట్టము; లీనము = లోపలనున్నది; ఐన = అయిన; నభము = ఆకాశము; చాడ్పునన్ = వలె; వేఱు = భిన్నమైనట్లు తోచెనని; తెలియవలయున్ = తెలిసికొనవలెను; దేహి = జీవుడు, పురుషుడు; దేహముల్ = శరీరముల; కున్ = కు.

భావము:

ఈ దేహం ఒక భవనం వంటిది. ఇది పంచమహాభూతాలతో తయారైనది. ఈ భవనం వంటి శరీరంలో ఆత్మస్వరూపుడు పూర్వకర్మలను అనుసరిస్తూ వర్తిస్తుంటాడు. కాలం తీరగానే భవనం ఖాళీచేసి వెళ్ళిపోతాడు. దేహం అశాశ్వతం. దానిలో ఉండే ఆత్మపురుషుడు శాశ్వతుడు. ఎప్పటికైనా శరీరం చెడిపోతుంది కానీ, అందులోని ఆత్మారామునికి నాశనం లేదు. పురుషుడు వేరు, దేహం వేరు. ఎప్పటికీ ఒకటి కానే కాదు. కఱ్ఱలో అగ్ని దాగి ఉన్నట్లు, శరీరాల్లో వాయువు ఉన్నట్లు, తామరతూడులో ఆకాశం ఉన్నట్లు. దేహంలో దేహి వేరుగా విలసిల్లుతూ ఉంటాడు. 1భూమి, 2నీరు, 3వాయువు, 4నిప్పు, 5 ఆకాశం అనే అయిదింటిని పంచమహాభూతాలు అంటారు. విశ్వం అంతా వీటితోనే నిర్మితమైంది. మానవుని శరీరం కూడా ఈ పంచభూతాలతో తయారయినదే. అంటే మాంసం, చర్మం వంటివి ప్రధానంగా భూమి నుండి ఏర్పడ్డాయి; ఆకలి, దాహం మున్నగునవి అగ్ని నుండి; రక్తం, మూత్రం మొదలైనవి నీటి నుండి; నడవటం, కదలటం వంటివి గాలి నుండి; కామం, క్రోధం లాంటివి ఆకాశం నుండి ఏర్పడ్డాయి. ఇవన్నీ సమన్వయం కలిగి కలిస్తేనే దేహం ఏర్పడినది. లోపల దేహి ఉంటే దేహం, లేకపోతే కట్టె.

7-52-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని మఱియు నిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా బ్రాహ్మణ బాలకుని రూపంలో ఉన్న యముడు ఆ ప్రేతబంధువులకు చెప్పి, ఆ పైన ఇంకా ఇలా అన్నాడు.

7-53-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భూపాలకుఁడు నిద్రపోయెడి నొండేమి-
విలపింప నేటికి వెఱ్ఱులార!
యెవ్వఁడు భాషించు నెవ్వఁ డాకర్ణించు-
ట్టి వాఁ డెన్నడో రిగినాఁడు,
ప్రాణభూతుం డైన వనుఁ డాకర్ణింప-
భాషింప నేరఁడు, ప్రాణి దేహ
ములకు వేఱై తాన ముఖ్యుఁడై యింద్రియ-
వంతుఁడై జీవుండు లను మెఱయ,

7-53.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రాభవమున భూత పంచకేంద్రియమనో
లింగదేహములను లీలఁ గూడు
విడుచు నన్యుఁ డొకఁడు విభుఁడు దీనికి మీరు
పొగల నేల? వగలఁ బొరల నేల?

టీకా:

భూపాలకుడు = రాజు {భూపాలకుడు - భూ (రాజ్యమును) పాలకుడు (ఏలెడివాడు), రాజు}; నిద్రపోయెడిన్ = నిద్రపోవుచున్నాడు; ఒండు = మరింకా; ఏమి = ఏమి యున్నది; విలపింపన్ = శోకించుట; ఏటికిన్ = ఎందుకు; వెఱ్ఱులార = తెలివితక్కువవారా; ఎవ్వడు = ఎవడైతే; భాషించున్ = పలుకునో; ఎవ్వడు = ఎవడైతే; ఆకర్ణించున్ = వినునో; అట్టి = అటువంటి; వాడు = అతడు; ఎన్నడో = ఎప్పుడో; అరిగినాడు = వెళ్ళిపోయినాడు; ప్రాణభూతుండు = ప్రాణమైనవాడు; ఐన = అయిన; పవనుడు = వాయువు; ఆకర్ణింపన్ = వినుటను; భాషింపన్ = పలుకుటను; నేరడు = చేయలేడు; ప్రాణి = జీవుడు; దేహముల్ = దేహముల; కున్ = కంటెను; వేఱు = భిన్నమైనవాడు; ఐ = అయ్యి; తాన = తనే; ముఖ్యుడు = ప్రధానమైనవాడు; ఐ = అయ్యి; ఇంద్రియవంతుడు = ఇంద్రియములుకలవాడు; ఐ = అయ్యి; జీవుండు = జీవుడు; వలను = నేర్పులు; మెఱయన్ = మీరగా, అతిశయించగా. ప్రాభవమునన్ = ఐశ్వర్యముతో; భూతపంచక = పంచమహాభూతములు; ఇంద్రియ = పంచేంద్రియములు; మనస్ = మనస్సు; లింగదేహములన్ = సూక్ష్మశరీరములను; లీలన్ = వేడుకగా; కూడును = కలయును; విడుచున్ = వదలివేయును; అన్యుడొకడు = ఇంకొకడు; విభుడు = ప్రభువు; దీని = ఇట్టివిషయమున; కిన్ = కు; మీరు = మీరు; పొగలన్ = శోకింపగా; ఏల = ఎందులకు; వగలన్ = దుఃఖములందు; పొరలన్ = పొర్లుట; ఏల = ఎందులకు.

భావము:

వెఱ్ఱివాళ్ళలారా! మీ అమాయకత్వాన్ని వదలిపెట్టండి; ఈ భూపతి (రాజ్యానికి రాజు / క్షేత్రంలోని విభుడు) నిద్రిస్తున్నాడు. ఎందుకు పిచ్చిగా విలపిస్తున్నారు. మాటలు పలికేవాడు, మాటలు వినేవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ప్రాణానికి మూలమైనది వాయువు. కాని అది విడిగా ఉన్నా మాట్లాడలేదు, వినలేదు. జీవుడు ప్రాణదేహాలకి వేరుగా ఉండి కూడా ముఖ్యుడై ఇంద్రియ ప్రాభవంతో తేజరిల్లుతూ ఉంటాడు. ఆ ఆత్మరూపుడే పంచభూతాలనూ, పంచేంద్రియాలనూ, మనస్సునూ, లింగదేహమునూ విలాసంగా ధరిస్తాడు. మళ్ళీ విడిచిపెడతాడు. అసలు ఈ ప్రపంచ చక్రం తిప్పేవాడు వేరే ఉన్నాడు. అతడు సర్వాధిపతి. కాబట్టి, దీనికోసం మీరు బాధపడటం దేనికి? దుఃఖంతో ఏడవటం దేనికి?

7-54-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఎందాఁక నాత్మ దేహము
నొందెడు నందాఁకఁ గర్మయోగము; లటపైఁ
జెంవు; మాయాయోగ
స్పందితులై రిత్త జాలిఁడ నేమిటికిన్?

టీకా:

ఎందాకన్ = ఎప్పటివరకు; ఆత్మ = ఆత్మ; దేహమున్ = దేహమును; ఒందెడున్ = చెందియుండునో; అందాక = అప్పటివరకు; కర్మ = కర్మముల; యోగములు = సంబంధములు; అటపైన్ = ఆతరువాత; చెందవు = సంబంధములుండవు; మాయా = మాయతో; యోగ = కలియుటవలన; స్పందితులు = చలించినవారు; ఐ = అయ్యి; రిత్తన్ = ఊరకనే; జాలిన్ = దైన్యమునందు; పడన్ = పడిపోవుట; ఏమిటికిన్ = ఎందుకు.

భావము:

ఎప్పటి వరకు ఆత్మ దేహంలో ఉంటుందో అప్పటివరకూ కర్మలతో సాంగత్యం సాగుతూనే ఉంటుంది. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టగానే కర్మబంధాలు తెగిపోతాయి. వీటితో సంబంధమే ఉండదు. ఈ మాయాయోగానికి చలించిన మనసులతో మీరు కుమిలిపోవడం అనవసరం.

7-55-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చెలులుం దల్లులు దండ్రు లాత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు ని
ర్మగేహంబు లటంచుఁ గూర్తురు మహామాయాగుణ భ్రాంతులై
లోఁ దోచిన యోగముల్ నిజములే ర్మానుబంధంబులం
లుగున్ సంగము లేక మానుఁ బిదపం ర్మాంతకాలంబునన్.

టీకా:

చెలులున్ = మిత్రులు; తల్లులున్ = తల్లులు; తండ్రులున్ = తండ్రులు; ఆత్మజులు = సంతానము {ఆత్మజులు - ఆత్మన్ (తనకు) పుట్టినవారు, సంతానము}; సంసేవ్యుల్ = ప్రభువులు {సంసేవ్యులు - సం (చక్కగా) సేవ్యులు (సేవింబడినవారు), ప్రభువులు}; సతులున్ = భార్యలు; చారు = అందమైన; నిర్మల = అమలమైన; గేహంబులున్ = ఇండ్లు; అటంచున్ = అనుచు; కూర్తురు = కూడబెట్టెదరు; మహా = గొప్ప; మాయా = మాయయొక్క; గుణ = గుణములందు; భ్రాంతలు = భ్రాంతిలోపడినవారు; ఐ = అయ్యి; కల = స్వప్నము; లోన్ = అందు; తోచిన = అగపడెడి; యోగముల్ = సంభవించినవి; నిజములే = సత్యములే; కర్మ = కర్మమములకు; అనుబంధంబులన్ = సంబంధములతో; కలుగున్ = సంభవించును; సంగము = తగులములు; లేక = లేనిచో; మానున్ = లేకపోవును; పిదపన్ = చివరకు; కర్మ = కర్మమముల; అంత = తీఱిపోయెడి; కాలంబునన్ = సమయమునందు.

భావము:

ఈ మహామాయ అనే భ్రాంతిలో పడిపోయి తల్లిదండ్రులపై, భార్యాపుత్రులపై, మిత్రులపై, ఆశ్రితులపై అనురాగ అనుబంధాలు పెంచుకుంటారు; ఇళ్ళూ వాకిళ్ళూ, సంపదలూ సామ్రాజ్యాలూ సంపాదించుకుంటారు, బంధాలు పెట్టుకుంటారు; ఎక్కడైనా కలలో కనిపించిన సంపద యదార్థం అవుతుందా? కర్మానుబంధం ఉంటే సంయోగం ఉంటుంది; కర్మబంధం అనుభవించాక బంధం విడిపోయి, వియోగం ఏర్పడుతుంది;

7-56-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు, మాయాగుణప్రపంచంబు నెఱింగెడు తత్త్వజ్ఞులు నిత్యానిత్యంబులం గూర్చి సుఖదుఃఖంబులం జెంద; రజ్ఞులు గొందఱు యోగ వియోగంబులకు సుఖదుఃఖంబుల నొందుదురు; తొల్లి యొక్క మహా గహనంబున విహగంబులకు నంతకభూతుం డైన యెఱుక గల; డతం డొక్కనాఁడు ప్రభాతంబున లేచి వాటంబైన వేఁట తమకంబున,

టీకా:

మఱియున్ = ఇంకను; మాయా = మాయ యొక్క; గుణ = గుణములైన; ప్రపంచంబున్ = సమస్తమును; ఎఱింగెడు = తెలిసెడి; తత్త్వజ్ఞులు = నిజశాస్త్రములు తెలిసినవారు; నిత్య = శాశ్వతములు; అనిత్యంబులన్ = అశాశ్వతములను; కూర్చి = గురించి; సుఖ = సుఖములను; దుఃఖంబులను = దుఃఖములను; చెందరు = లోనుకారు; అజ్ఞులు = జ్ఞానములేనివారు; కొందఱు = కొంతమంది; యోగ = సంయోగ; వియోగంబుల్ = వియోగముల; కున్ = కు; సుఖ = సుఖములను; దుఃఖంబులన్ = దుఃఖములను; ఒందుదురు = పొందెదరు; తొల్లి = పూర్వము; ఒక్క = ఒక; మహా = దట్టమైన; గహనంబునన్ = అడవియందు; విహంగముల్ = పక్షుల; కున్ = కు; అంతకభూతుండు = యముడైనవాడు; ఐన = అయిన; ఎఱుక = బోయవాడు; కలడు = ఉండెను; అతండు = అతడు; ఒక్కనాడు = ఒకరోజు; ప్రభాతంబున = వేకువసమయమున; లేచి = నిద్రలేచి; వాటంబు = నేర్పుగలది; ఐన = అయినట్టి; వేట = వేటాడుటయందు; తమకంబునన్ = గాఢమైన కోరికతో.

భావము:

మాయ యొక్క గుణాలు అయిన దేహగేహాదుల తత్వం తెలిసిన తత్వవేత్తలు ఎప్పటికైనా నశించునవి అయిన వాటి గురించి సుఖదుఃఖాలు పెంచుకొని కలతచెందరు. అజ్ఞానాంధులైన కొందరు ఈ మాయాగుణాలైన దేహాదుల సంయోగ వియోగాలకు కలత చెందుతూ ఉంటారు. పూర్వం కిరాతుడు ఒకడు అడవిలో పక్షులను వేటాడుతూ వాటి పాలిటి యముడులా జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజున వేటాడాలనే గట్టి కోరికతో మరులుగొని, సూర్యోదయం కాగానే లేచి బయలుదేరాడు.

7-57-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

, లురులు, జిగురుఁ గండెలుఁ,
లిదియు, జిక్కంబు, ధనువు, రములుఁ గొనుచుం
బులుఁగులఁ బట్టెడు వేడుక
లుఁగులు వెడలంగఁ గదలి డవికిఁ జనియెన్.

టీకా:

వలల్ = వలలు; ఉరులు = ఉరితాళ్ళు; జిగురుగండెలున్ = బంకపూసినదారపుకండెలు; చలిదియున్ = చద్ది అన్నము మూట; చిక్కంబున్ = సంచి; ధనువు = విల్లు; శరములున్ = బాణములు; కొనుచున్ = తీసుకొని; పులుగులన్ = పక్షులను; పట్టెడు = పట్టుకొనెడి; వేడుకన్ = ఆసక్తి; అలుగులు వెడలంగ = అధికముకాగా; కదలి = బయలుదేరి; అడవి = అడవి; కిన్ = కి; చనియెన్ = వెళ్లెను.

భావము:

పిట్టల వేటగాడైన కిరాతుడు ఉచ్చుకఱ్ఱ అనే పక్షులు పట్టుకునే కఱ్ఱకు కట్టిన తాళ్ళు, వలలు, జిగురుబంక పూసిన దారపు కండెలు, చద్దెన్నం మూట, చిక్కం అనే తాళ్ళతో చేసిన సంచి, విల్లు అమ్ములు పట్టుకుని పిట్టలను పట్టుకోవాలనే కోరికమీరగా అడవికి బయలుదేరాడు.

7-58-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లడవికిం జని తత్ప్రదేశంబు నందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అడవి = అడవి; కిన్ = కి; చని = వెళ్ళి; తత్ = ఆ; ప్రదేశంబున్ = స్థలము; అందు = లో.

భావము:

ఇలా అడవికి వెళ్ళి అక్కడొక చోట.

7-59-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టలుకఁ దడుకుచాటునఁ
బిట్టల నురిగోలఁ దిగిచి, బిఱుసున ఱెక్కల్
ట్టి విఱిచి, చిక్కములోఁ
బెట్టుచు విహరించె లోకభీకరలీలన్.

టీకా:

కట్టలుకన్ = ఎక్కువ చలముతో; తడుకు = కంచెల; చాటునన్ = మాటునందు; పిట్టలన్ = పక్షులను; ఉరిగోలన్ = ఉచ్చుకఱ్ఱతో; తిగిచి = లాగి; బిఱుసున = కఱుకుదనముతో; ఱెక్కల్ = రెక్కలను; పట్టి = పట్టుకొని; విఱిచి = వెనుకకివంచికట్టి; చిక్కము = తాళ్లతో చేసినసంచీ; లోన్ = అందు; పెట్టుచున్ = పెడుతూ; విహరించెన్ = తిరిగెను; లోక = (పక్షి)లోకమునకు; భీకర = భయంకరమైన; లీలన్ = విధముగ.

భావము:

తడిక మాటున కూర్చొని, పక్షులను మిక్కిలి కోపంతో ఉచ్చుకఱ్ఱతోనూ, వలలు వేసీ పట్టుకుంటున్నాడు. దొరికిన పిట్టల రెక్కలు కరుకుగా విరిచి, చిక్కంలో వేస్తున్నాడు. అలా పక్షుల ప్రాణానికి జగద్భయంకరంగా ఆ అడవిలో సంచరిస్తూ ఉన్నాడు.

7-60-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నానావిధంబు లగు శకుంతలంబుల నంతంబు నొందించుచు సకల పక్షి సంహార సంరబ్ధకుం డైన లుబ్ధకుండు దన ముందటఁ గాలచోదితంబై సంచరించుచున్న కుళింగపక్షి మిథునంబు గనుంగొని యందుఁ గుళింగి నురిం దిగిచి యొక్క చిక్కంబులో వైచినం జూచి దుఃఖించి కుళింగపక్షి యిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; నానావిధంబులు = పలురకములవి; అగు = అయిన; శకుంతలంబులన్ = పక్షులను; అంతంబున్ = నాశనము; ఒందించుచున్ = పొందింపజేయుచు; సకల = సమస్తమైన; పక్షి = పిట్టలకు; సంహార = చంపెడి; సంరబ్దకుండు = పూనికగలవాడు; ఐన = అయిన; లుబ్దకుండు = వేటగాడు; తన = తనకు; ముందటన్ = ఎదురుగ; కాల = కాలముచే; చోదితంబు = నడపబడినది; ఐ = అయ్యి; సంచరించుచున్న = తిరుగుచున్న; కుళింగ = పిచ్చుక; పక్షి = పిట్టల; మిథునంబున్ = జంటను; కనుంగొని = చూసి; అందున్ = వానిలో; కుళింగిన్ = ఆడుపిచ్చుక; ఉరిన్ = ఉచ్చుతో; తిగిచి = లాగి; ఒక్క = ఒక; చిక్కంబు = సంచి; లో = అందు; వైచినన్ = వేయగా; చూచి = చూసి; దుఃఖించి = దుఃఖించి; కుళింగ = మగపిచ్చుక; పక్షి = పిట్ట; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అన్ని రకాల పక్షులనూ వేటాడేవాడు అయిన ఆ కిరాతుడు రకరకాల పక్షులను వేటాడుతున్నాడు. కాలం తోసుకొచ్చి అక్కడ సంచరిస్తున్న అడవిపిచ్చుకల జంట వాడి కంటపడింది. ఆడ పిచ్చుకను ఉచ్చుకఱ్ఱతో పట్టుకుని చిక్కంలో వేసాడు. అది చూసి మగ పిచ్చుక ఏడుస్తూ ఇలా అంది.

7-61-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"వుల మేఁత మేసి మన న్యుల కెన్నఁడు నెగ్గు జేయ కి
క్క విహరింప నేఁ డకట ట్టిఁడి బ్రహ్మ కిరాతు చేతిలోఁ
డు మని వ్రాసెనే నుదుటఁ బాపపు దైవము కంటి కింత యె
క్కుడు బరువయ్యెనే బ్రదుకు గోమలి! యే మన నేర్తుఁ జెల్లరే.

టీకా:

అడవులన్ = అడవులలో; మేత = ఆహారమును; మేసి = తిని; మనము = మనము; అన్యుల్ = ఇతరుల; కిన్ = కి; ఎన్నడున్ = ఎప్పుడును; ఎగ్గు = కీడు; చేయక = చేయకుండగ; ఇక్కడ = ఇక్కడ; విహరింపన్ = తిరుగుచుండగ; నేడు = ఈరోజు; అకట = అయ్యో; కట్టిడి = కఠినుడైన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; కిరాతు = బోయవాని; చేతి = చేతి; లోన్ = అందు; పడుము = చావుము; అని = అని; వ్రాసెనే = రాసెనుకదా; నుదుటన్ = నొసటియందు; పాపపు = పాపిష్టి; దైవము = దేవుని; కంటి = కన్నుల; కి = కు; ఇంత = ఇంత; ఎక్కుడు = అధికముగా; బరువు = భారము; అయ్యెనే = అయిపోయిందికదా; బ్రతుకు = జీవితము; కోమలి = ఓ స్త్రీ; ఏమననేర్తు = ఏమనగలను; చెల్లరే = ఔరా.

భావము:

“ఓ కోమలమైన ప్రియురాలా! మనం ఎవరికీ అపకారం చేసేవాళ్ళం కాదు. ఈ మానవులకు ఎప్పుడూ కీడు చేసేవాళ్ళం కాదు, అడవిలో దొరికే మేతలు మేసి జీవిస్తుంటాము. ఏం చెప్పమంటావు? కఠిన హృదయుడైన బ్రహ్మదేవుడు ఈ బోయవాడి చేతిలో చావమని మనల నుదుట వ్రాసాడేమో? ఈ పాపపు దేవుడి దృష్టిలో కూడా ఇంత బరువైపోయామా ఏమిటి?

7-62-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మాటు మనల నందఱఁ
బ్రటించి కిరాతువలలఁ డఁజేయక ని
న్నొతిన్ వలఁబడఁ జేసిన
విటీకృత దక్ష మైన విధి నే మందున్.

టీకా:

ఒకమాటు = ఒకేసారి; మనలన్ = మనలను; అందఱన్ = అందరిని; ప్రకటించి = నియమించి; కిరాతు = బోయవాని; వలలన్ = వలలలో; పడన్ = పడునట్లు; చేయక = చేయకుండగ; నిన్నున్ = నిన్ను; ఒకటిన్ = ఒక్కదానిని; వలన్ = వలయందు; పడన్ = పడునట్లు; చేసిన = చేసినట్టి; వికటీ = వంకరపనులు; కృత = చేయుటందు; దక్షము = నేర్పరి; ఐన = అయిన; విధిన్ = దైవమును; ఏమి = ఏమి; అందున్ = అనగలను.

భావము:

వంకరపనులు చేయటంలో మిక్కిలి నేర్పున్న ఈ విధిని ఏమని నిందించాలి? నిన్ను ఒక్కదానిని బోయవాడి వలలో పడమని వ్రాసాడు చూడు! కనీసం మనం అందరం ఒకేమాటు వాడి వలలో పడమని వ్రాయవచ్చు కదా!

7-63-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటినుండియు మేఁత గానమిం
బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరవు; మున్ను తల్లి యీ
దిక్కుననుండి వచ్చు నని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా!"

టీకా:

ఱెక్కలు = రెక్కలు; రావు = ఇంకారాలేదు; పిల్లల్ = పిల్లల (పక్షి); కున్ = కు; ఱేపటి = రేపటి; నుండియున్ = నుంచి; మేతన్ = ఆహారమును; కానమిం = కనబడకపోవుటచేత; పొక్కెడున్ = ఏడ్చును; గూడు = నివాసము; లోన్ = నుండి; ఎగసిపోవగ = ఎగురుటకు; నేరవు = సమర్థములుగాదు; మున్ను = ఇంతకు పూర్వము; తల్లి = తల్లి పక్షి; ఈ = ఈ; దిక్కున = వైపు; నుండి = నుండి; వచ్చును = వస్తూ ఉంటుంది; అని = అని; త్రిప్పని = ఇటునటు తిరగని; చూడ్కులన్ = చూపులతో; నిక్కినిక్కి = తలలు నిక్కబొడిచి; నలు = నాలుగు (4); దిక్కులన్ = వైపులకును; చూచుచున్నవి = ఎదురుచూచుచున్నవి; అతి = మిక్కిలి; దీనతన్ = జాలితో; ఎట్లు = ఏ విధముగ; భరింతున్ = ఓర్చుకొనగలను; అకటా = అయ్యో.

భావము:

మన పిల్లలకేమో ఇంకా రెక్కలు రాలేదు. రేపటినుండి ఆహారం కనబడక ఏడుస్తూ ఉంటాయి. పోనీ ఎగిరి వెళ్ళి తెచ్చుకుందా మంటే వాటికింకా ఎగరటం కూడ రాదు. అయ్యో! “ఇంతకు ముందు ఎప్పుడూ అమ్మ ఈ ప్రక్క నుండి తిండి పట్టుకొచ్చేది” అని ఒకే ధ్యాసతో, కళ్ళు తిప్పకుండా నల్దిక్కులా నిక్కి చూస్తూ ఉంటాయి. వాటి దీనమైన ముఖాలు ఎలా చూడాలి? కడుపు తరుక్కుపోయే ఆ రోదనలు భరించట మెలా?

7-64-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యి వ్విధంబున.

టీకా:

అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

అని ఇలా

7-65-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుంఠితనాదముతోడను
గంము శోషింప వగచు గమును హననో
త్కంఠుండైన కిరాతుఁ డ
కుంఠితగతి నేసె నొక్క కోలం గూలన్.

టీకా:

కుంఠిత = గద్గద; నాదము = స్వరము; తోడను = తోటి; కంఠము = గొంతు; శోషింపన్ = ఎండిపోతుండగ; వగచు = విచారించున్న; ఖగమును = పక్షిని; హనన = చంపుటకు; ఉత్కంఠుండు = పూనినవాడు; ఐన = అయిన; కిరాతుడు = బోయవాడు; అకుంఠిత = అడ్డులేని; గతిన్ = విధముగ; ఏసెన్ = కొట్టెను; ఒక్క = ఒక; కోలన్ = బాణమును; కూలన్ = పడిపోవునట్లుగ.

భావము:

ఇలా ఆడపిచ్చుకను చూసి, దుఃఖంతో గద్గదమైన కంఠంతో, గొంతెండిపోయేలా విలపిస్తోంది. ఆ మగ పిచ్చుకను పక్షులను వేటాడుతున్న ఆ బోయవాడు వేగంగా ఒక్క బాణం వేసి నేలమీద పడిపోయేలా కొట్టాడు.

7-66-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాము వచ్చిన శబరుని
కోను ధరఁగూలె ఖగము ఘోషముతోడం
గాము డాసిన నేలం
గూక పో వశమె యెట్టి గుణవంతులకున్.

టీకా:

కాలము = అదను, సమయము; వచ్చిన = రాగా; శబరుని = కోయవాని; కోలను = బాణమువలన; ధరన్ = నేలపైన; కూలెన్ = పడిపోయెను; ఖగము = పక్షి; ఘోషము = గోలపెట్టుట; తోడన్ = తోటి; కాలము = కాలము, అదను; డాసిన = కలిసివచ్చిన; నేలంగూలక = మరణించకుండుట; వశమె = సాధ్యమేనా ఏమి; ఎట్టి = ఎటువంటి; గుణవంతుల = తెలివిగలవారి; కున్ = కైనను.

భావము:

కాలం మూడిన ఆ మగ పక్షి గోలపెట్టిమరీ అలా బోయవాడి బాణం దెబ్బతిని పడి చచ్పిపోయింది. అవును, ఆయువు తీరిన తరువాత చావకుండా ఉండటం అన్నది ఎంతటి తెలివైనవాడైనా, బలవంతుడైనా, అధికార సంపదలు కలవాడి కైనా అసాధ్యమే కదా.

7-67-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున మీఱు చచ్చుతఱిఁ గానరు చచ్చి ధరిత్రిఁ బడ్డ ధా
త్రీవిభు దేహముం గదిసి దీనత నేడువ నేల? పొండు చిం
తాతులార! వత్సర శతంబుల కైన నిజేశు చక్కికిం
బోవుట దుర్లభంబు; మృతిఁ బొందినవారలు చేర వత్తురే."

టీకా:

కావున = అందుచేత; మీఱు = మీరు; చచ్చు = మరణించెడి; తఱిన్ = సమయమును; కానరు = చూసుకొనలేరు; చచ్చి = మరణించి; ధరిత్రిఁబడ్డ = చచ్చిపోయిన; ధాత్రీవిభున్ = రాజు; దేహమున్ = శవమును; కదిసి = దగ్గర చేరి; దీనతన్ = జాలిలోపడిపోయి; ఏడువన్ = దుఃఖించుట; ఏల = ఎందుకు; పొండు = వెళ్ళిపోండి; చింతావతులారా = దుఃఖితులారా; వత్సర = సంవత్సరములు; శతంబుల = వందల (100); కైనన్ = గడపినను; నిజ = స్వంత; ఈశున్ = భర్త యొక్క; చక్కికిన్ = పక్కకు, దగ్గరకు; పోవుట = వెళ్ళగలుగుట; దుర్లభంబు = కుదరనిది; మృతిబొందిన = చచ్చిన; వారలు = వారు; చేరన్ = మరలదగ్గరకు; వత్తురే = వచ్చెదరా ఏమి, రారు.

భావము:

కనుక, మీ మరణం ఎప్పుడు వస్తుందో, మీకే తెలియదు. కనుక, ఓ దుఃఖితులు లారా! వెళ్ళిపోండి. చచ్చిపడి ఉన్న రాజు శవం వద్ద చేరి దుఃఖంతో విలపించటం దండుగ. ఇలా వందల ఏళ్ళపాటు ఏడుస్తూ ఉన్నా కూడా భర్తను చేరలేరు. ఎలాగయినా, చనిపోయినవారి వద్దకు వెళ్ళటం సాధ్యం కాదు కదా.

7-68-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు కపటబాలకుండై క్రీడించుచున్న యముని యుపలాల నాలాపంబులు విని సుయజ్ఞుని బంధువు లెల్ల వెఱఁగుపడి సర్వప్రపంచంబు నిత్యంబుగాదని తలంచి శోకింపక సుయజ్ఞునికి సాంపరాయిక కృత్యంబులు జేసి చని; రంత నంతకుం డంతర్హితుం డయ్యె" నని చెప్పి హిరణ్యకశిపుండు దన తల్లిని దమ్ముని భార్యలం జూచి యిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; కపట = మాయ; బాలకుండు = పిల్లవాడు; ఐ = అయ్యి; క్రీడించుచున్న = విహరించుచున్న; యముని = యముడు యొక్క; ఉపలాలన = ఓదార్పు; ఆలాపంబులు = మాటలను; విని = విని; సుయజ్ఞుని = సుయజ్ఞని యొక్క; బంధువులు = చుట్టములు; ఎల్లన్ = అందరును; వెఱగుపడి = తెల్లబోయి; సర్వ = సమస్తమైన; ప్రపంచంబున్ = సృష్టియంతయును; నిత్యంబున్ = శాశ్వతమైనది; కాదు = కాదు; అని = అని; తలంచి = భావించి; శోకింపక = దుఃఖింపక; సుయజ్ఞుని = సుయజ్ఞుని; కిన్ = కి; సాంపరాయిక కృత్యంబులున్ = అంత్యక్రియలు; చేసి = ఆచరించి; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అంతట; అంతకుడు = యముడు; అంతర్హితుండు = కానరానివాడు; అయ్యెన్ = అయిపోయెను; అని = అని; చెప్పి = చెప్పి; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; తన = తన యొక్క; తల్లిని = అమ్మను; తమ్ముని = సోదరుని యొక్క; భార్యలన్ = భార్యలను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని ఇలా విలాసంగా మాయాబాలకుడి రూపంలో వచ్చి యముడు చెప్పిన ఊరడింపు మాటలు విన్న సుయజ్ఞుని బంధువులు ఆశ్చర్యపోయారు. ఈ విశ్వం శాశ్వతం కాదు అని తెలుసుకున్నారు. విలపించటం మానారు. కర్తవ్యం ఆలోచించి సుయజ్ఞునికి ఉత్తరక్రియలు చేసి వెళ్ళిపోయారు. యముడు అంతర్ధానం అయిపోయాడు” అని చెప్పి హిరణ్యకశిపుడు తన తల్లికి, తమ్ముడి భార్యలకు ఇలా చెప్పాడు.

7-69-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"పరులెవ్వరు దా మెవ్వరు
రికింపఁగ నేక మగుట భావింపరు త
త్పమజ్ఞానము లేమిని
రులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్."

టీకా:

పరులు = ఇతరులు; ఎవ్వరు = ఎవరు; తాము = తాము; ఎవ్వరు = ఎవరు; పరికింపన్ = తరచిచూసిన; ఏకము = ఒకటే; అగుట = అయియుండుట; భావింపరు = గమనింపరు; తత్ = ఆ; పరమ = ఉత్తమమైన; జ్ఞానము = జ్ఞానము; లేమిని = లేనందువలన; పరులును = ఇతరులు; నేము = మేము; అనుచున్ = అనుచు; తోచున్ = అనిపించును; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికిని.

భావము:

మానవులు పరతత్వ చింతన లేకపోవుటం చేత తన వాళ్ళు, పరాయి వారు అనీ తేడాగా భావిస్తారు. తన వారెవ్వరు? ఇతరులు ఎవ్వరు? ఆలోచిస్తే అందరూ ఒక్కటే. వారు, మేము అంటూ భేదభావంతో అజ్ఞానులు అనుకుంటారు.

7-70-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని తెలియం బలికిన హిరణ్యకశిపుని వచనంబులు విని దితి గోడండ్రునుం దానును శోకంబు మాని తత్త్వవిలోకనంబు గలిగి లోకాంతరగతుండైన కొడుకునకు వగవక చనియె" నని చెప్పి నారదుండు ధర్మనందనున కిట్లనియె.

టీకా:

అని = అని; తెలియన్ = బోధపడునట్లు; పలికినన్ = చెప్పగా; హిరణ్యకశిపుని = హిరణ్యకశిపుని; వచనంబులు = మాటలు; విని = విని; దితి = దితి; కోడండ్రును = కోడళ్ళు; తానునున్ = తను; శోకంబు = దుఃఖము; మాని = విడిచిపెట్టి; తత్త్వ = తత్త్వము యొక్క; విలోకనంబు = దృష్టి; కలిగి = పొంది; లోక = లోకము; అంతర = ఇతరమైనదానికి; గతుండు = వెళ్ళినవాడు; ఐన = అయిన; కొడుకున్ = పుత్రున; కున్ = కు; వగవక = విచారించక; చనియెన్ = వెళ్ళిపోయిరి; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ధర్మనందనున్ = ధర్మరాజున {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా హిరణ్యకశిపుడు చెప్పగా, దితి, ఆమె కోడళ్ళు దుఃఖం మానేసారు. తత్వం తెలుసుకున్నారు. చనిపోయిన కొడుకు కోసం విలపించటం మాని వెళ్ళిపోయారు” అని నారదమహర్షి యుధిష్టర మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు.

7-71-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"అరామరభావంబును
ద్రిగద్రాజ్యంబు నప్రతిద్వంద్వము దో
ర్విజితాఖిల శాత్రవమును
రిపుబలమును హిరణ్యశిపుఁడు గోరెన్.

టీకా:

అజర = ముసలితనములేని; అమర = చావులేని; భావంబును = స్థితిని; త్రిజగత్ = ముల్లోకము లందు విస్తరించిన; రాజ్యంబున్ = రాజ్యాధికారము; అప్రతిద్వంద్వమున్ = ఎదురులేనిది, నిష్కంటకము; దోః = బాహు బలముతో; విజిత = జయించబడిన; అఖిల = సమస్తమైన; శాత్రవమున్ = శత్రువులు కలుగుట; గజరిపు = సింహము వంటి {గజరిపు - గజము (ఏనుగు)నకు రిపు (శత్రువు), సింహము}; బలమును = శక్తి; హిరణ్యకశిపుడు = హిరణ్యకశిపుడు; కోరెన్ = ఆశించెను.

భావము:

హిరణ్యకశిపుడు తనకు ముసలితనం కానీ చావు కానీ లేని అమరత్వం కావాలని కోరుకున్నాడు; ఇంకా ముల్లోకాలను ఎదురు లేకుండా పరిపాలించే శక్తినీ, బాహుబలంతో శత్రువులను ఎవరినైనా జయించే బలాన్నీ, సింహపరాక్రమం పొందాలనీ ఆశించాడు.

7-72-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు గోరి మందరాచల ద్రోణికిం జని; యందుఁ గాలి పెనువ్రేల నేల నిలువంబడి, యూర్ధ్వబాహుండయి మిన్ను చూచుచు, వాఁడి మయూఖంబులతోడి ప్రళయకాల భానుండునుం బోలె దీర్ఘజటారుణ ప్రభాజాలంబులతోడ నెవ్వరికిం దేఱిచూడరాక పరమ దారుణంబైన తపంబు జేయుచుండె; నిర్జరులు నిజస్థానంబుల నుండి; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కోరి = ఆశించి; మందరా = మందర యనెడి; అచల = పర్వతముల; ద్రోణి = కనుమ, కొండల మధ్య పల్లము; కిన్ = కి; చని = వెళ్ళి; అందున్ = అక్కడ; కాలి = కాలు యొక్క; పెనువ్రేలన్ = బొటకనవేలుపై; నేలన్ = నేలమీద; నిలువంబడి = నిలబడి; ఊర్ధ్వబాహుండు = పైకెత్తిన చేతులు గలవాడు; అయి = ఐ; మిన్ను = ఆకాశమును; చూచుచున్ = చూచుచు; వాడి = చురుకైన; మయూఖంబుల్ = కిరణముల; తోడి = తోటి; ప్రళయ = ప్రళయము వచ్చెడి; కాల = సమయపు; భానుండునున్ = సూర్యుని; పోలె = వలె; దీర్ఘ = పొడుగైన; జటా = జటలుకట్టిన జుట్టు యొక్క; అరుణ = ఎఱ్ఱని; ప్రభా = కాంతుల; జాలంబుల = సమూహముల; తోడన్ = తోటి; ఎవ్వరి = ఎవరి; కిన్ = కిని; తేఱి = తేరిపార; చూడరాక = చూడలేని విధముగ; పరమ = అత్యధికమైన; దారుణంబు = భయంకరము; ఐన = అయిన; తపంబున్ = తపస్సును; చేయుచుండెన్ = చేయసాగెను; నిర్జరులు = దేవతలు; నిజ = తమ; స్థానంబులన్ = నెలవులందు; ఉండిరి = ఉన్నారు; అంత = అంతట.

భావము:

ఇటువంటి కోరికలతో హిరణ్యకశిపుడు మందరపర్వతానికి వెళ్ళాడు. అక్కడ పెనుగాలిలో కాలి బొటకనవేలు మీద నిలబడి, చేతులు పైకెత్తి ఉంచి, ఆకాశంకేసే చూస్తూ ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు అతను పొడవైన ఎఱ్ఱని జటలు కట్టిన శిరోజాలతో చూడ శక్యంకాకుండా ఉన్నాడు. ప్రళయకాలంలో అతితీక్షణమైన కిరణాలతో ప్రకాశించే సూర్యుడిలా ఉన్నాడు. ఇలా లోకభయంకరమైన తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు తమతమ స్వస్థలాలో ఉన్నారు.

7-73-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దిరెం గుంభిని, సాద్రియై కలఁగె నే డంభోనిధుల్, తారకల్
చెరెన్ సగ్రహసంఘలై, దిశలు విచ్ఛిన్నాంతలై మండెఁ, బె
ల్లరెన్ గుండెలు జంతుసంహతికి, నుగ్రాచార దైత్యేంద్ర మూ
ర్ధ దిశోద్ధూతసధూమ హేతిపటలోదంచత్తపోవహ్నిచేన్.

టీకా:

అదిరెన్ = అదిరిపోయినది; కుంభిని = భూమి; సాద్రి = పర్వతములతో కూడినది; ఐ = అయ్యి; కలగెన్ = కలతబారెను; ఏడంభోనిధుల్ = సప్తసముద్రములు {సప్తసముద్రములు - 1లవణసముద్రము 2ఇక్షుసముద్రము 3సురాసముద్రము 4ఘృతసముద్రము 5దధిసముద్రము 6క్షీరసముద్రము 7జలసముద్రము}; తారకల్ = చుక్కలు; చెదరన్ = చెల్లాచెదురుయగునట్లు; సగ్రహసంఘలై = గ్రహకూటములతో కూడినవి; ఐ = అయ్యి; దిశలు = దిక్కులు; విచ్ఛిన్నాంతలు = చీలిన అంచులుగలవి; ఐ = అయ్యి; మండెన్ = మండిపోయినవి; పెల్లు = మిక్కిలి; అదరెనే = అదిరిపోయినవి; గుండెలు = గుండెలు; జంతు = జంతువుల; సంహతి = సమూహముల; కిన్ = కి; ఉగ్ర = దారుణమైన; ఆచార = ప్రవర్తనలుగల; దైత్య = రాక్షసుల; ఇంద్ర = రాజు యొక్క; మూర్ధదిశ = శిరస్సుపై వైపు నుండి; ఉద్ధూత = లేచిన; సధూమహేతి = పొగతో కూడిన మంటల; పటల = సమూహములతో; ఉదంచత్ = పొంగుతున్న; తపః = తపస్సు అనెడి; వహ్ని = అగ్ని; చేన్ = చేత;

భావము:

రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుడు భీకర నియమాలతో తపస్సు చేస్తున్నాడు. అతని శిరస్సుపైనుండి పొగలు లేచాయి. అగ్నిజ్వాలలు చెలరేగి మింటనంటసాగాయి. ఆ తాపానికి భూమండలం పర్వతాలతో సహా కంపించి పోతోంది. సప్తసముద్రాలూ అల్లకల్లోలం కాసాగాయి. నక్షత్రాలు, గ్రహాలతో పాటు చెదిరిపోతున్నాయి, దిక్కులన్నీ ఛిన్నాభిన్నాలై మండిపోతున్నాయి. జీవజాలం అంతటికి గుండెలు దడదడలాడుతున్నాయి.

7-74-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు త్రైలోక్య సంతాపకరం బైన దైత్యరాజ తపో విజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబునకుం జని లోకేశ్వరుం డయిన బ్రహ్మకు వినతులయి యిట్లని విన్నవించిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; త్రైలోక్య = ముల్లోకములకు {ముల్లోకములు - 1భూలోకము 2స్వర్గలోకము 3నరకలోకము}; సంతాప = మిక్కిలి తాపము; కరంబు = కలిగించెడిది; ఐన = అయిన; దైత్య = రాక్షసులకు; రాజ = రాజు యొక్క; తపస్ = తపస్సు; విజృంభణంబున్ = పెంపును; సైరింపన్ = ఓర్చుకొన; చాలక = లేక; నిలింపులు = దేవతలు; నాకంబున్ = స్వర్గమును; విడిచి = వదలివేసి; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చని = వెళ్ళి; లోక = ఎల్లలోకములకు; ఈశ్వరుండు = ప్రభువు; అయిన = ఐనట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; వినతులు = మ్రొక్కినవారు; అయి = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; విన్నవించిరి = మనవిచేసుకొనిరి.

భావము:

రాక్షసరాజు హిరణ్యకశిపుడి తపస్సు తీవ్రత వలన ఇలా ముల్లోకాలలోనూ తాపం చెలరేగుతోంది. ఆ తాపాన్ని తట్టుకోలేక దేవతలు స్వర్గలోకం నుండి బయలుదేరి బ్రహ్మ ఉండే సత్యలోకానికి వెళ్ళారు. లోకాలన్నిటికి ప్రభువైన బ్రహ్మదేవుడికి నమస్కరించి, ఇలా తమ బాధలు చెప్పుకోసాగారు.

7-75-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"దితికొడుకు తపము వేఁడిమి
తి తప్తుల మైతి మింక లజడి నమరా
తి నుండ వెఱతు; మెయ్యది
తి మాకును? దేవదేవ! కారుణ్యనిధీ!

టీకా:

దితి = దితి యొక్క; కొడుకు = పుత్రుని; తపము = తపస్సు యొక్క; వేడిమిన్ = వేడివలన; అతి = మిక్కిలి; తప్తులము = కాగిపోయినవారము; ఐతిమి = అయితిమి; ఇంక = ఇంక; అలజడిన్ = క్లేశములతో; అమరావతిన్ = అమరావతియందు; ఉండ = ఉండుటకు; వెఱతుము = భయపడుతున్నాము; ఎయ్యది = ఏది; గతి = దారి, దిక్కు; మా = మా; కును = కును; దేవదేవ = బ్రహ్మదేవుడా {దేవదేవుడు - దేవతలకే దేవుడు}; కారుణ్యనిధీ = బ్రహ్మదేవుడా {కారుణ్యనిధి - కారుణ్యము (దయ)కు నిధి వంటివాడు, బ్రహ్మదేవుడు}.

భావము:

ఓ దయామయా! దేవతలకే దైవమా! బ్రహ్మదేవా! దైత్యుడు హిరణ్యకశిపుుడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపోవేడిమికి మేమంతా కాగి పోతున్నాము. ఇంక ఏమాత్రం ఈ ఆపదను తట్టుకోలేము. అమరావతిలో ఉండాలంటే భయం వేస్తున్నది. మాకు నువ్వే తప్ప మరో దిక్కులేదు.

7-76-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శంకా లేశము లేదు దేవ! త్రిజగ త్సంహారమున్ దేవతా
సంకోచంబును వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ లేక యే
వంకన్ లేవ నటంచు దుస్సహతపోవ్యావృత్తి చిత్తంబులో
సంల్పించె నిశాచరుండు ప్రతిసంస్కారంబు చింతింపవే.

టీకా:

శంకా = అనుమానము; లేశము = ఏమాత్రము; లేదు = లేనేలేదు; దేవ = భగవంతుడ; త్రిజగత్ = ముల్లోకములను; సంహారమున్ = నాశనముచేయుట; దేవతా = దేవతలను; సంకోచంబును = అణచుట; వేద = వేదముల; శాస్త్ర = శాస్త్రముల; పదవీ = ఉన్నతిని; సంక్షేపమున్ = వినాశంచేయుట; లేక = లేకపోతే; ఏ = ఎట్టి; వంకన్ = కారణముచేతను; లేవను = లేవనేలేవను; అంచున్ = అనుచు; దుస్సహ = సహింపరాని; తపస్ = తపస్సును; వ్యావృత్తిన్ = చుట్టబెట్టుటను; చిత్తంబు = మనసు; లోన్ = అందు; సంకల్పించెన్ = తలపెట్టెను; నిశాచరుండు = రాక్షసుడు {నిశాచరుడు - నిశ (రాత్రి) యందు చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; ప్రతి = మారుచేసెడి, శమింపచేసెడి; సంస్కారంబు = ఉపాయమును; చింతింపవే = యోచింపుము.

భావము:

భగవాన్! బ్రహ్మదేవా! ఈ హిరణ్యకశిపుడు రాక్షసుడు. ఇంతటి దుస్సహమైన తపస్సు చేస్తున్నాడు అంటే, వీడు దేవతలను అణిచేయాలనీ, వేదశాస్త్రాలు వినాశనం కావాలనీ, ముల్లోకాలనూ నాశనం చేయాలనీ అయ్యే ఉంటుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దీనికి ప్రతీకారం ఏం చేయాలో చూసి మమ్మల్ని రక్షించు.

7-77-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీ వేరీతిఁ దపోబలంబున జగన్నిర్మాణముం జేసి యీ
దేవాధీశులకంటె నెక్కుడు సిరిం దీపించి తిబ్బంగిఁ దా
నీ విశ్వంబుఁ దపస్సమాధిమహిమన్ హింసించి వేఱొక్క వి
శ్వావిర్భావకరత్వశక్తి మదిలో ర్థించినాఁ డీశ్వరా!

టీకా:

నీవు = నీవు; ఏ = ఎట్టి; రీతిన్ = విధానముగ; తపస్ = తపస్సు యొక్క; బలంబునన్ = శక్తివలన; జగత్ = లోకముల; నిర్మాణమున్ = సృష్టిన్; చేసి = చేసి; ఈ = ఈ; దేవాధీశుల = దేవతా ప్రభుల; కంటెను = కంటెను; ఎక్కుడు = అధికమైన; సిరిన్ = ఐశ్వర్యముతో; దీపించితి = ప్రకాశించితివి; ఈ = ఇట్టి; భంగిన్ = విధముగనే; తాన్ = తను; ఈ = ఈ; విశ్వంబున్ = భువనములను; తపస్సు = తపస్సు; సమాధి = సమాధుల; మహిమన్ = శక్తివలన; హింసించి = నాశనముచేసి; వేఱొక్క = మరియొక; విశ్వ = జగత్తును; ఆవిర్భావ = తయారు; కరత్వ = చేసెడి; శక్తిన్ = శక్తిని; మది = మనసు; లోన్ = అందు; అర్థించినాడు = ఆశించినాడు; ఈశ్వరా = భగవంతుడా, బ్రహ్మదేవుడా;

భావము:

ఓ మహాప్రభూ! బ్రహ్మదేవా! నీవు నీ మహనీయమైన తపోబలంతో, ప్రపంచ నిర్మాణం చేసావు. ఈ దేవోత్తములు అందరి కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకున్నావు. నీలాగే ఈ రాక్షసుడు హిరణ్యకశిపుడు కూడా తన తపోమహిమతో నీవు సృష్లించిన ఈ విశ్వాన్ని నాశనము చేసి, మరొక క్రొత్త విశ్వాన్ని నిర్మిస్తాడుట. అంతటి శక్తి సంపాదించటానికే ఇలా ఘోరంగా తపస్సు చేస్తున్నాడట.

7-78-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక, కాలాత్మకులగు జీవాత్మల కనిత్యత్వంబు గలుగుటం జేసి తపోయోగసమాధిబలంబునం దనకు నిత్యత్వంబు సంపాదింతు నని తలంచినా" డని మఱియు నిట్లనిరి.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; కాలా = కాలమునకు; ఆత్మకులు = అధీనులు; అగు = అయినట్టి; జీవ = జీవుల యొక్క; ఆత్మల్ = అస్థిత్వమున; కున్ = కు; అనిత్యత్వంబు = అశాశ్వతత్వము; కలుగుటన్ = ఉండుట; చేసి = వలన; తపస్ = తపస్సు; యోగ = యోగములు; సమాధి = సమాధులయొక్క; బలంబునన్ = శక్తివలన; తన = తన; కున్ = కు; నిత్యత్వంబున్ = శాశ్వతత్వమును; సంపాదింతున్ = సాధించెదను; అని = అని; తలంచినాడు = భావించినాడు; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అంతేకాదు, జీవులందరూ అశాశ్వతులు, కాలానికి అధీనులు. ఎప్పటికేనా జీవునికి మరణం తప్పదు కదా. కాని తన తపోబలంతో తనకు మరణం లేకుండా ఉండే శాశ్వతత్వాన్ని సంపాదించుకుంటాడట.” అని చెప్పి ఇంకా ఇలా అన్నారు.

7-79-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దీయం బగు నున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సం
స్తనీయం బగు భూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్
భునశ్రేణికి నిచ్చి దైత్యుని తపస్పూర్తిన్ నివారించి యో
భునాధీశ్వర! కావవే భువనముల్ పూర్ణప్రసాదంబునన్.

టీకా:

భవదీయంబు = నీది; అగు = అయినట్టి; ఉన్నతోన్నత = మిక్కిలి గొప్పదైన; మహా = గొప్ప; బ్రహ్మ = బ్రహ్మదేవునిదైన; ఏక = ప్రత్యేకమైన; పీఠంబున్ = పదవిని; సంస్తవనీయంబు = కొనియాడదగినది; అగు = అయిన; భూతియున్ = సంపద; విజయమున్ = విజయము; సౌఖ్యంబున్ = సుఖము; సంతోషమున్ = సంతోషమును; భువన = లోకముల; శ్రేణి = వరుసల; కిన్ = కొరకు; ఇచ్చి = ఇచ్చి, ప్రసాదించి; దైత్యుని = రాక్షసుని; తపస్ = తపస్సుయొక్క; స్ఫూర్తిన్ = ఉద్రేకమును; నివారించి = మాన్పి; ఓ = ఓ; భువనాధీశ్వర = బ్రహ్మదేవుడా {భువనాధీశ్వరుడు - భువనములకు అధీశ్వరుడు (ప్రభువు), బ్రహ్మ}; కావవే = కాపాడుము; భువనముల్ = లోకములను; పూర్ణ = నిండు; ప్రసాదంబునన్ = కరుణచూపుటచేత.

భావము:

ఓ సకల భువనాలకూ ప్రభువా! బ్రహ్మదేవా! నీ మహోన్నతమైన బ్రహ్మపదవిని, స్తుతింపబడే నీ వైభవాన్ని, నీ విజయసంపదను, సౌఖ సంతోషాలను; సకల భువనాల శ్రేయస్సు కోసం; ఆ రాక్షసుడికి వరప్రసాదంగా ఇచ్చెయ్యి. నిండు కరుణతో లోకాలను కాపాడు.