పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ

  •  
  •  
  •  

7-21-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నారదుం డిట్లనియె "నొక్కనాఁడు బ్రహ్మమానసపుత్రు లైన సనకసనందనాదులు దైవయోగంబున భువనత్రయంబు నందును సంచరించుచు నై దా ఱేండ్ల ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరు లయి హరిమందిరంబునకు వచ్చి చొచ్చునెడ మొగసాల నున్న పురుషు లిరువురు వారలం జూచి.

టీకా:

అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఒక్కనాడు = ఒకరోజు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; మానస = మానస; పుత్రులు = కొడుకులు; ఐన = అయిన; సనకసనందనాదులు = సనక సనంద నాదులు {సనక సనంద నాదులు - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాత అను నలుగురు, కుమారవర్గము}; దైవ = దేవుని యొక్క; యోగంబునన్ = సంకల్పమువలన; భువనత్రయంబున్ = ముల్లోకములు; అందునున్ = లోను; సంచరించుచు = తిరుగుతూ; ఐదు = ఐదు (5); ఆఱు = ఆరు (6); ఏండ్ల = సంవత్సరముల; ప్రాయంపు = వయసుగల; బాలకుల = పిల్లవారి; భావంబునన్ = రూపమున; దిగంబరులు = నగ్నముగా నున్నవారు {దిగంబరులు - దిక్ (దిక్కులే) అంబరులు (బట్టలుగా గలవారు)}; అయి = అయ్యి; హరి = విష్ణుమూర్తి; మందిరమున్ = నిలయమున; కున్ = కు; వచ్చి = చేరి; చొచ్చున్ = ప్రవేశించెడి; ఎడన్ = సమయములో; మొగసాలన్ = వాకిటముందర; ఉన్న = ఉన్నట్టి; పురుషులు = వ్యక్తులు; ఇరువురు = ఇద్దరు (2); వారలన్ = వారిని; చూచి = చూసి.

భావము:

అలా ధర్మరాజు అడుగగా నారదమహర్షి ఇలా అన్నాడు “బ్రహ్మదేవుడి సంకల్ప మాత్రం చేత జనించిన “సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుడు” అనే నలుగురు విప్రులు ఒకమారు ముల్లోకాలలో అయిదు, ఆరు సంవత్సరాల వయసు బాలురులు అయి దిగంబరులుగా సంచరిస్తున్నారు. దైవనిర్ణయం వల్ల వారు వైకుంఠం చేరి విష్ణుమూర్తిని దర్శించాలని వచ్చారు. వారు విష్ణుమందిరంలో ప్రవేశించబోగా, వాకిట్లో ద్వారం వద్ద ఉన్న పురుషులు ఇద్దరు వారిని చూసి.