పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-6-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజన వన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.

టీకా:

చిత్రంబులు = మనోజ్ఞమైనవి {చిత్రము - చిత్తమును రమింప జేయునవి, మనోజ్ఞములు}; త్రైలోక్య = ముల్లోకములను {త్రిలోకములు - మూడులోకములు, 1భూలోకము 2ఊర్థ్వలోకములు 3అధోలోకములు}; పవిత్రంబులు = పవిత్రము జేయునవి; భవ = సాంసారపు; లతా = తీగ లనెడి బంధనములను; లవిత్రంబులు = కొడవళ్ళ వలె ఖండించునవి; సత్ = మంచి; మిత్రంబులు = మిత్రుల వంటివి; ముని = మునుల; జన = సమూహము యనెడి; వన = అడవికి; చైత్రంబులు = చైత్రమాసమువలె అలరించునవి; విష్ణు = విష్ణుమూర్తి యనెడి; దేవు = దేవుని యొక్క; చారిత్రంబులు = కథలు.

భావము:

విష్ణుకథలు బహు చిత్రమైనవి. చక్కటి చిత్రాలలా మనసులను రంజింపజేసేవి. ముల్లోకాలకు పవిత్రతను ఇచ్చేవి. కొడవళ్ళు తీగెలను కత్తిరించినంత అవలీలగా సంసార బంధాలను ఛేదించేవి. అఖిల జీవరాశికి ఆప్తమిత్రాలైనవి. వనాలను వసంతాలు వికసింపజేసి నట్లు, మునులను అలరింపజేసేవి.