పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-19-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం బెక్కండ్రు కామ ద్వేష భయ స్నేహ సేవాతిరేకంబులఁ జిత్తంబు హరిపరాయత్తంబుగాఁ జేసి తద్గతిం జెందిరి; హరి నుద్దేశించి క్రోధాదులైన యేనింటిలోపల నొక్కటి యైన వెన్నునికి లేని నిమిత్తంబున నతండు వ్యర్థుం డయ్యె; మీ తల్లి చెలియలి కొడుకు లయిన శిశుపాల దంతవక్త్రులు దొల్లి విష్ణుమందిర ద్వారపాలకులు; విప్రశాపంబునఁ బదభ్రష్టులై భూతలంబున జన్మించిరి." అనిన విని యుధిష్ఠిరుండు నారదున కిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; పెక్కండ్రు = అనేకమంది; కామ = కోరిక; ద్వేష = విరోధము; భయ = భయము; స్నేహ = ప్రేమ; సేవా = భక్తుల; అతిరేకంబులన్ = అతిశయముతో; చిత్తంబున్ = మనసును; హరి = విష్ణువు; పర = అందు; ఆయత్తంబు = లగ్నమైనది; కాన్ = అగునట్లు; చేసి = చేసికొని; తత్ = అతని; గతిన్ = పదమును; చెందిరి = పొందిరి; హరిన్ = హరిని; ఉద్దేశించి = గురించి; క్రోధ = కోపము {పంచక్రోధాదులు - 1కామ 2క్రోధ 3భయం 4నయం 5భక్తి}; ఆదులు = మొదలైనవి; ఐన = అయిన; ఏనింటి = ఐదింటి (5); లోపల = అందలి; ఒక్కటి = ఒకటి; ఐనన్ = అయినను; వెన్నుని = వేనున; కిన్ = కు; లేని = లేకపోయినట్టి; నిమిత్తంబునన్ = కారణముతో; అతండు = అతడు; వ్యర్థుండు = నిష్ప్రయోజకుడు; అయ్యె = ఆయెను; మీ = మీ; తల్లి = తల్లి యొక్క; చెలియలి = చెల్లెలి; కొడుకులు = పుత్రులు; అయిన = ఐన; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్రులు = దంతవక్త్రుడులు; తొల్లి = పూర్వము; విష్ణు = విష్ణుమూర్తి; మందిర = నివాసమునకు; ద్వారపాలకులు = వాకిలి కావలివారు; విప్ర = బ్రాహ్మణుల; శాపంబునన్ = శాపమువలన; పద = పదవినుండి; భ్రష్టలు = తొలగినవారు; ఐ = అయ్యి; భూతలంబునన్ = భూలోకమునందు; జన్మించిరి = పుట్టిరి; అనినన్ = అనగా; విని = ఆలకించి; యుధిష్ఠిరుండు = ధర్మరాజు; నారదున్ = నారదున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా ఇలా చాలామంది ఆ రమామనోహరుడగు విష్ణుమూర్తిని సేవించి, ప్రేమించి, కామించి, ద్వేషించి, భయపడి సదాస్మరిస్తూ మోక్షాన్ని పొందారు. విపరీతంగా భయపడి, భంగపడి కొందరు, విడువరాని విరోధం, క్రోధం పెంచుకుని కొందరు, ఎడతెగని స్నేహం పెంచుకొని కొందరు, ఏకాంత భక్తితో సేవించి కొందరు, మనస్ఫూర్తిగా కామించి కొందరు మనస్సును మాధవునికే అంకింతం చేసి సద్గతిని పొందారు. కానీ శ్రీహరి పట్ల తీవ్రమైన కామం, క్రోధం, భయం, స్నేహం, భక్తి అనే ఈ అయిదింటిలోనూ ఏఒక్కటీ లేకపోవటం చేత, నీవు చెప్పిన వేనుడు భ్రష్టుడై మరణించాడు. కాని మీ పినతల్లి కొడుకులైన శిశుపాలుడు, దంతవక్త్రుల విషయం అలా కాదు. పూర్వం వారిరువురు వైకుంఠంలో విష్ణుమందిర ద్వారపాలకులు. అటువంటి మహాభక్తులూ, ఒకానొక సమయంలో సనకసనందాదులు అనే విప్రుల శాపం పొంది పదవులు కోల్పోయి, భూలోకంలో పుట్టారు” అని దేవర్షి అయిన నారదుడు చెప్పగా విని, ధర్మరాజు నారదుడితో ఇలా అడిగాడు.