పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-18-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధా ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

టీకా:

కామ = మన్మథ వికారము నందలి; ఉత్కంఠతన్ = ఆసక్తితో; గోపికల్ = గోపికలు; భయమునన్ = భయముతో; కంసుండు = కంసుడు; వైర = విరోధపు; క్రియన్ = చేతల; సామగ్రిన్ = బలమున; శిశుపాల = శిశుపాలుడు; ముఖ్య = మున్నగు; నృపతుల్ = రాజులు; సంబంధులు = చుట్టరికము గల వారు; ఐ = అయ్యి; వృష్ణులున్ = యాదవులు {వృష్ణులు - వృష్ణివంశపు యాదవులు}; ప్రేమన్ = ప్రేమతో; మీరలు = మీరు; భక్తిన్ = భక్తితో; ఏమున్ = మేము; ఇదె = ఇదిగో; చక్రిన్ = విష్ణుమూర్తిని {చక్రి – చక్రము ధరించిన వాడు, హరి}; కంటిమి = దర్శించితిమి; ఎట్లు = ఏ విధముగ; ఐనన్ = అయినప్పటికిని; ఉద్దామ = ఉన్నత మైన; ధ్యాన = ధ్యానముచే; గరిష్ఠుడు = శ్రేష్ఠుడు; ఐన = అయిన; హరిన్ = నారాయణుని; చెందన్ = పొంద; వచ్చు = సాధ్యము; ధాత్రీశ్వరా = రాజా {ధాత్రీశ్వరుడు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.

భావము:

ధర్మరాజా! మన్మథ వికారముతో గోపికలు, ప్రాణభయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు, దాయాదులు అయ్యి యాదవులు, బంధుప్రీతితో మీరు, భక్తితో మేము నిరంతర స్మరణలు చేసి విష్ణుసాయుజ్యం పొందాము కదా. ఏ విధంగా అయినా సరే విడవకుండా ధ్యానించి నారాయణుని పొందవచ్చును.