పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారదుని పూర్వజన్మంబు

  •  
  •  
  •  

7-472-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; పోయిన మహాకల్పంబునందు గంధర్వులలోన నుపబర్హణుం డను పేర గంధర్వుండ నైన నేను సౌందర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకు బ్రియుండనై క్రీడించుచు నొక్కనాఁడు; విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవసత్రమనియెడి యాగంబులోన నారాయణకథలు గానంబు చేయుకొఱకు నప్సరోజనులను గంధర్వులనుం జీరిన.

టీకా:

వినుము = వినుము; పోయిన = కడచిన, గడిచిపోయిన; మహాకల్పంబు = మహాకల్పము; అందున్ = లో; గంధర్వుల = గంధర్వుల, అశ్వముఖుల; లోనన్ = అందు; ఉపబర్హణుండు = ఉపబర్హణుడు; అను = అనెడి; పేరన్ = పేరుతో; గంధర్వుండను = గంధర్వుడను; ఐన = అయిన; నేను = నేను; సౌందర్య = అందమైన స్వరూపము; మాధుర్యము = మధురమైన మాట; గాంభీర్యము = గంభీరమైన వర్తనము; ఆది = మున్నగు; గుణంబులన్ = గుణములతో; సుందరుల్ = స్త్రీల; కున్ = కు; ప్రియుండను = ఇష్టమైనవాడను; ఐ = అయ్యి; క్రీడించుచున్ = విహరించుచు; ఒక్క = ఒక; నాడు = దినమున; విశ్వ = లోకములను; స్రష్టలు = నిర్మించువారు; ఐన = అయిన; బ్రహ్మలు = బ్రహ్మలు, సృష్టికర్తలు; దేవసత్రము = దేవసత్రము {దేవసత్రము - దేవ (దివ్యమైన) సత్రము (యాగము)}; అనియెడి = అనెడి; యాగంబున్ = యజ్ఞము; లోనన్ = అందు; నారాయణ = విష్ణుని; కథలు = గాథలు; గానంబున్ = పాడుట; చేయు = చేసెడి; కొఱకున్ = కోసము; అప్సరస్ = అప్సరసలైన; జనులను = వారిని; గంధర్వులనున్ = గంధర్వులను; చీరిన = పిలువగా;

భావము:

నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను విను. ఇంతకు ముందు జరిగిపోయిన మహాకల్పంలో నేను గంధర్వవంశంలో ఉపబర్హణుడు అనే పేరుతో పుట్టాను. ఆ జన్మలో చాలా అందంగా ఉండేవాడిని. మధురంగా మాట్లాడేవాడిని, గంభీరంగా ప్రవర్తించేవాడిని. అందుచేత సుందరీమణులకు ప్రియుడను అయి ఉండేవాడను. వారితో క్రీడిస్తూ ఉండేవాడిని. ఒకమారు, విశ్వసృష్టికర్తలు అయిన ప్రజాపతులు దేవసత్రం అనే యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో విష్ణు గాథలు గానం చేయటానికి అప్సరసలనూ గంధర్వులను పిలిచారు.