పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-469-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; దేహాదులకుఁ గారణత్వంబున నాదియందును నవధిత్వంబు ననంతమందును గలుగుచు బహిరంగంబున భోగ్యంబును, నంతరంగంబున భోక్తయు, బరంబునఁ నపరంబును, జ్ఞానంబున జ్ఞేయంబును, వచనంబున వాచ్యంబును, నప్రకాశంబున బ్రకాశంబును నైన వస్తువునకు వేఱొండు లేదు; ప్రతిబింబాదికంబు వస్తుత్వంబునం జేసి వికల్పితంబై తలంపంబడు భంగి నైంద్రియకంబైన సర్వంబును నర్థత్వంబున వికల్పితం బయి తోఁచుం గాని పరమార్థంబు గాదు; దేహాదికంబులు మిథ్యాత్మకంబులు; వానికి హేతువు లయిన క్షితిప్రముఖంబులకును మిథ్యాత్వం బగుట సిద్ధంబు; పరమాత్మకు నవిద్యచేత నెంతదడవు వికల్పంబుదోఁచు; నంతదడవును భ్రమంబునుం దోఁచు; అవిద్యానివృత్తి యైన సర్వంబును మిథ్య యని శాస్త్రవిధినిషేధంబులు కలలోపల మేలుగన్న తెఱంగగు; భావాద్వైత క్రియాద్వైత ద్రవ్యాద్వైతంబులు మూఁడు గల; వందుఁ బట తంతు న్యాయంబునఁ గార్యకారణంబు లందు వస్త్వైకత్వాలోచనంబు చేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు; మనోవాక్కాయ కృతంబు లైన సర్వ కర్మంబులను ఫల భేదంబు జేయక పరబ్రహ్మార్పణంబు జేయుట క్రియాద్వైతంబు; పుత్ర మిత్ర కళత్రాది సర్వ ప్రాణులకుం దనకును దేహంబునకుం బంచభూతాత్మకత్వంబున భోక్త యొక్కం డను పరమార్థత్వంబున నర్థకామంబుల యెడ నైక్యదృష్టిఁ జేయుట ద్రవ్యాద్వైతంబు; నేర్పున నాత్మతత్త్వానుభవంబున నద్వైతత్రయంబును విలోకించి వస్తుభేదబుద్ధియుఁ గర్మభేదబుద్ధియు స్వకీయపరకీయబుద్ధియు స్వప్నంబులుగాఁ దలంచి ముని యైనవాఁడు మానవలయు.

టీకా:

వినుము = వినుము; దేహాదుల = శరీరము మున్నగువాని; కున్ = కి; కారణత్వంబునన్ = ఉత్పత్తికారణ మగుటచేత; ఆదియందును = మొదటను; అవధిత్వంబునన్ = కాలపరిమాణము నిర్ణయించుటచేత; అంతమందును = చివరను; కలుగుచు = ఉండి; బహిరంగంబునన్ = బాహ్య ప్రపంచము నందు; భోగ్యంబును = అనుభవింపదగిన వస్తువును; అంతరంగంబునన్ = లోపల; భోక్తయున్ = అనుభవించెడి వాడును; పరంబునన్ = ఇతరమైనవాని యందు; అపరంబును = ఇతరము కానిదియు; జ్ఞానంబునన్ = తెలిసికొనదగినది యందు; జ్ఞేయంబును = తెలిసికొనునది; వచనంబునన్ = మాటయందు; వాచ్యంబునున్ = పలుకబడినది; అప్రకాశంబునన్ = వెలుగులేనిచోట; ప్రకాశంబునున్ = వెలుగు; ఐన = అయిన; వస్తువున్ = పదార్థము, పరమాత్మ; కున్ = కు; వేఱు = భిన్నమైనది; ఒండు = మరియొకటి; లేదు = లేదు; ప్రతిబింబ = ప్రతిబింబము; ఆదికంబున్ = మున్నగు; వస్తుత్వంబునన్ = వస్తువుతత్వము; చేసి = వలన; వికల్పితంబు = భేదముగా భావింపబడునది; ఐ = అయ్యి; తలంపంబడు = నమ్మబడుచుండెడి; భంగిన్ = విధముగా; ఐంద్రియకంబు = ఇంద్రియవికారము; ఐన = అయిన; సర్వంబునున్ = సమస్తమును; అర్థత్వంబునన్ = వస్తువులనెడి భావముతో; వికల్పితంబు = భేదముగా భావింపబడినది; అయి = అయ్యి; తోచున్ = తట్టును; కాని = తప్పించి; పరమార్థంబు = సత్యము; కాదు = కాదు; దేహా = దేహము; ఆదికంబులున్ = మున్నగునవి; మిథ్యాత్మకంబులు = అబద్ధము లైనవి; వానికిన్ = వాటికి; హేతువులు = కారణభూతములు; అయిన = ఐన; క్షితి = భూమి; ప్రముఖంబుల = మున్నగువాని; కును = కి; మిథ్యాత్వంబు = అసత్యరూపము లైనవి; అగుట = అయ్యి యుండుట; సిద్ధంబు = రూఢియైనది; పరమాత్మ = పరమాత్మ; కున్ = కు; అవిద్య = అజ్ఞానము; చేతన్ = వలన; ఎంత = ఎంత; తడవు = సమయము; వికల్పంబున్ = భేదము; తోచున్ = తోచునో; అంత = అంత; తడవును = సమయము; భ్రమంబునున్ = భ్రాంతికూడ; తోచున్ = తోచును; అవిద్యా = అజ్ఞానము; నివృత్తి = నాశము; ఐనన్ = కాగానే; సర్వంబున్ = సమస్తము; మిథ్య = అసత్యమైనది; అని = అని; శాస్త్ర = శాస్త్రమునందు; విధి = పాటింప నిర్ణయించినవి; నిషేధంబులు = మానవలెనని నిర్ణయించినవి; కల = స్వప్నము; లోపల = అందు; మేలున్ = మంచిని; కన్న = చూచిన; తెఱంగు = విధము; అగు = అగును; భావాద్వైత = భావాద్వైతము; క్రియాద్వైత = క్రియాద్వైతము; ద్రవ్యాద్వైతంబులు = ద్రవ్యాద్వైతములు; మూడున్ = మూడు (3); కలవు = ఉన్నవి; అందున్ = వానిలో; పట = వస్త్రము; తంతు = దారము; న్యాయంబునన్ = పద్ధతిలో; కార్య = కార్యమైన వస్త్రము; కారణంబులు = కారణమైన దారములు; అందున్ = ఎడల; వస్త్వైకత్వ = ఒకటేవస్తువు యనెడి; ఆలోచనంబు = తలంపు; చేసి = చేసి; వికల్పంబున్ = భేదము; లేదు = లేదు; అని = అని; భావించుట = తలచుట; భావాద్వైతంబు = భావాద్వైతము; మనః = మనస్సు; వాక్కు = మాట; కాయ = దేహములచే; కృతంబులు = చేయబడినవి; ఐన = అయిన; సర్వ = సమస్తమైన; కర్మంబులును = పనులు; ఫల = ఫలితముల; భేదంబున్ = తారతమ్యములు; చేయక = చూడక; పరబ్రహ్మ = పరబ్రహ్మమునకు; అర్పణంబుచేయుట = సమర్పించుట; క్రియాద్వైతంబు = క్రియాద్వైతము; పుత్ర = సంతానము; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; ఆది = మున్నగు; సర్వ = సమస్తమైన; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; తన = తన; కును = కు; దేహంబున్ = శరీరమున; కున్ = కు; పంచభూతాత్మకత్వంబున = పంచభూత స్వరూపు డగుట {పంచభూతములు - 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశములు}; భోక్త = అనుభవించువాడు; ఒక్కండు = ఒకడే; అను = అనెడి; పరమార్థత్వంబునన్ = సత్యమైనతత్వముచేత; అర్థ = ద్రవ్యము; కామంబుల = కోరికల; ఎడన్ = అందు; ఐక్య = ఒకటే యనెడి; దృష్టిన్ = భావన; చేయుట = చేయుట; ద్రవ్యాద్వైతంబు = ద్రవ్యాద్వైతము; నేర్పునన్ = చాతుర్యముతో; ఆత్మత్తత్త్వ = బ్రహ్మతత్త్వముయొక్క; అనుభవంబునన్ = సాక్షాత్కారమువలన; అద్వైతత్రయంబును = అద్వైతములుమూటిని {అద్వైతత్రయము - భావ ద్రవ్య క్రియాద్వైతములు}; విలోకించి = వివేకించి; వస్తు = పదార్థములు; భేదబుద్ధి = అనేక రకము లను భావన; కర్మ = పనులలో; భేదబుద్ధి = పుణ్యపాపకర్మ లనెడి భావము; స్వకీయ = తనది; పరకీయ = ఇతరునిది; బుద్ధియు = అనెడిభావనలను; స్వప్నంబులు = కలలు, మిథ్యలు; కాన్ = అయినట్లు; తలంచి = భావించి; ముని = ముని; ఐన = అయిన; వాడు = వాడు; మానవలయు = విడువవలెను.

భావము:

శ్రద్ధగా విను ధర్మజా! ఈ దేహాదులు సమస్తానికి కారణరూపమైన; సృష్టి, స్థితి, లయములలోనూ తానే ఉండిన; బహిరంగంగా భోగ్యమూ, అంతరంగికంగా భోగించే భోక్తా; తన కంటె ఇంతరమైనది, ఇతరం కానిదీ; జ్ఞానమూ, జ్ఞేయమూ; మాటలు, పలుకబడినది; చీకటి, వెలుగు తనే అయిన మూల వస్తువు ఒక్కటే. అది కానిది మరొకటి లేదు. వస్తు తత్వంలో ప్రతిబింబం బింబం కంటే వేరైనదిగా అనిపిస్తుందే తప్ప అది యదార్థం కాదు; అలాగే, ఇంద్రియ సంబంధమైన సర్వమూ వికల్పాన్ని పొంది అలా అనిపిస్తాయి తప్ప అవి ఏవీ యదార్థం కాదు; దేహం మొదలైన సర్వం భ్రాంతి మూలకాలే, అవి అవశ్యం నశించేవే; వానికి కారణ రూపా లైన పృథ్వి మొదలైనవి కూడా నశించేవే, కానీ శాశ్వతాలు కావు; అజ్ఞానం వలన పరమాత్మఎంత వరకూ వికల్పంగా అనిపిస్తాడో, అంతవరకూ భ్రమ ఉన్నట్లే; ఆ అజ్ఞానం తొలగి పోగానే అంతా మిథ్య అయి, శాస్త్ర విధి నిషేధాలు సమస్తంపోయికలలో నుంచి మేలుకున్నట్లు అవుతుంది.
అద్వైతం మూడు రకాలు; అవి భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం. “వస్త్రము, దారములు ఒకటే వస్తువు అయినట్లుగా; కార్యకారణాలలో కూడా వస్తువు ఒకటే; విశ్వానికి మూలం ఒకటే అని ఏకైకరూపమైన ఆలోచన చేసి వికల్పం లేదని భావించటం” భావాద్వైతం. “మనస్సు, వాక్కు, కాయములచే నెరవేర్చబడే సర్వకర్మలూ ఫలభేదం లేకుండా; కర్తృత్వం తనమీద పెట్టుకోకుండా; తాను నిమిత్తమాత్రంగా భావించి; కర్మఫలాలను బ్రహ్మార్పణం చేయటం” క్రియాద్వైతం. “పుత్ర మిత్ర కళత్రాది సర్వప్రాణులకూ, తనకూ, దేహానికీ పంచభూతాత్మకంగా భోక్త ఒకడే అను పరమార్థ తత్వంతో అర్థకామాల పట్ల ఐక్యదృష్టి నిలపటం” ద్రవ్యాద్వైతం. ముని నేర్పుగా ఆత్మతత్వానుభావంతో ముందు చెప్పిన అద్వైతత్రయమును ఆకళింపు చేసుకుని వస్తు భేద బుద్ధి; స్వకీయ పరకీయ బుద్ధి; స్వప్నాలుగా భావించి జీవనం సాగించాలి.