పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-467-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; వైదికకర్మంబు ప్రవృత్తంబును నివృత్తంబును నన రెండు దెఱంగు లయ్యె; నందు బ్రవృత్తంబునఁ బునరావర్తనంబును నివృత్తంబున మోక్షంబును సిద్ధించు; ప్రవృత్త కర్మంబులోన నిష్ఠాపూర్తంబులన రెండుమార్గంబులు గల; వందు హింసాద్రవ్యమయ కామ్యరూపంబు లయిన దర్శ పూర్ణమాస పశు సోమయాగ వైశ్వదేవ బలిహరణ ప్రముఖంబు లయిన యాగాదికంబు లిష్టంబులు; దేవతాలయ వన కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు; ప్రవృత్త కర్మంబున దేహంబు విడిచి దేహాంతరారంభంబు నొందు దేహి హృదయాగ్రంబు వెలుంగు వానితోడ నింద్రియంబులం గూడి భూతసూక్ష్మయుక్తుం డై ధూమదక్షిణాయన కృష్ణపక్ష రాత్రిదర్శంబుల వలన సోమలోకంబుఁ జేరి భోగావసానంబున విలీనదేహుండై వృష్టి ద్వారంబునఁ గ్రమంబున నోషధి లతాన్న శుక్ల రూపంబులం బ్రాపించి భూమి యందు జన్మించు; నిది పునర్భవరూపం బయిన పితృమార్గంబు; నివృత్తకర్మ నిష్ఠుం డయినవాఁడు జ్ఞానదీప్తంబు లయిన యింద్రియంబు లందుఁ గ్రియాయజ్ఞంబులు యజించి యింద్రియంబుల దర్శనాది సంకల్ప మూలంబయిన మనంబునందు; వికారయుక్తంబయిన మనంబును వాక్కు నందు; విద్యా విలక్షణ యయిన వాక్కును వర్ణ సముదా యము నందు; వర్ణ సముదాయంబును అకారాది సర్వత్రయాత్మకం బయిన యోంకారంబు నందు; నోంకారంబును బిందు వందు; బిందువును నాదంబు నందు; నాదంబును బ్రాణంబు నందు; బ్రాణంబును బ్రహ్మ మందు నిలుపవలయును; దేవమార్గంబయిన యుత్తరాయణ శుక్లపక్ష దివాప్రాహ్ణపూర్ణిమా రాకలవలన సూర్యద్వారంబున బ్రహ్మలోకంబు నందుఁ జేరి; భోగావసానంబున స్థూలోపాధియైన విశ్వుండై స్థూలంబును సూక్ష్మంబు నందు లయించి; సూక్ష్మోపాధి యైన తైజసుండై సూక్ష్మంబును గారణంబు నందు లయించి; కారణోపాధి యైన ప్రాజ్ఞుండై కారణంబును సాక్షిస్వరూపంబు నందు లయించి; తుర్యుండై సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండై యివ్విధంబున ముక్తుం డగును.

టీకా:

వినుము = వినుము; వైదిక = వేదోక్తమైన; కర్మంబు = కర్మములను చేయుట; ప్రవృత్తంబును = ప్రవృత్తులు, కర్మావలంబనలు; నివృత్తంబునున్ = నివృత్తులు, మోక్షావలంబనలు; అనన్ = అనెడి; రెండు = రెండు (2); తెఱంగులు = విధములు; అయ్యెన్ = అయినవి; అందున్ = వానిలో; ప్రవృత్తంబునన్ = ప్రవృత్తులవలన; పునరావర్తనంబును = పునర్జన్మలు, మరలపుట్టుట; నివృత్తంబునన్ = నివృత్తులవలన; మోక్షంబును = ముక్తి, సంసారవిచ్ఛిత్తి; సిద్ధించు = లభించును; ప్రవృత్త = ఆరబ్ధ; కర్మంబు = కర్మల; లోనన్ = అందు; ఇష్టా = ఇష్టులు, యజ్ఞములు; పూర్తంబులు = పూర్తములు, పుణ్యకార్యములు; అనన్ = అనెడి; రెండు = రెండు (2); మార్గంబులు = త్రోవలు, సత్కార్యములు; కలవు = ఉన్నవి; అందున్ = వానిలో; హింసా = హింసారూపములు; ద్రవ్యమయ = ద్రవ్యములుగలరూపములు; కామ్యరూపంబులు = కోరదగినవైన రూపములు, అగ్నిహోత్రాది; అయిన = ఐన; దర్శ = అమావాస్యనాడు చేయదగ్గవి; పూర్ణమాస = పౌర్ణమినాడు చేయదగ్గవి; పశు = పశుబలితో చేయదగ్గవి; సోమ = సోమపానము చేయదగ్గవి; వైశ్వదేవ = పాకము(వంట) చేయదగ్గవి; బలిహరణము = బలిహరణము చేయదగ్గవి; ప్రముఖంబులు = మున్నగునవి; అయిన = ఐన; యాగ = యజ్ఞములు; ఆదికంబులు = మొదలగునవి; ఇష్టంబులు = ఇష్టులు, యజ్ఞములు; దేవతాలయ = దేవాలయములు కట్టించుట; వన = తోటలు వేయించుట; కూప = బావులు తవ్వించుట; తటాక = చెరువులు తవ్వించుట; ప్రముఖంబులు = మున్నగునవి; పూర్తంబులు = పూర్తములు, పుణ్యకార్యములు; ప్రవృత్తకర్మంబునన్ = ప్రవృత్తకర్మలను చేయుటచేత; దేహంబు = దేహము; విడిచి = వదలి; దేహ = దేహము; అంతర = ఇతరము, ఇంకొకటి; ఆరంభంబున్ = తాల్చుటను; ఒందున్ = పొందును; దేహి = జీవుడు; హృదయ = హృదయముయొక్క; అగ్రంబున్ = ఆకాశమునందు; వెలుంగ = ప్రకాశించు; వాని = వాటి; తోడన్ = తోటి; ఇంద్రియంబులన్ = ఇంద్రియములతో; కూడి = కలిసి; భూత = దేహము {భూత - భూతములతో కూడినది, దేహము}; సూక్ష్మ = సూక్ష్మమైనదానితో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ధూమ = పొగతోడి దారి; దక్షిణాయన = దక్షిణాయనము; కృష్ణపక్ష = కృష్ణపక్షము; రాత్రి = రాత్రిసమయము; దర్శంబులన్ = అమావాస్యలవలన; సోమలోకంబున్ = చంద్రలోకమును; చేరి = చేరి; భోగ = పుణ్యఫలములనుభవించిన; అవసానంబున = పిదప; విలీన = (జీవునిలో) కలిసిపోయిన; దేహుండు = దేహముగలవాడు; ఐ = అయ్యి; వృష్టి = వర్షపు; ద్వారంబునన్ = మార్గమున; క్రమంబునన్ = వరుసగా; ఓషధి = ఓషధులు {ఓషధులు - ఫలించినతోడనే నశించునవి (అరటి వరి మున్నగునవి)}; లత = తీగలు; అన్న = ఆహారము; శుక్ల = శుక్లశోణితముల; రూపంబులన్ = రూపములను; ప్రాపించి = పొంది; భూమిఅందు = నేలపైన; జన్మించున్ = పుట్టును; ఇది = ఇది; పునర్భవ = పునర్జన్మ, మరలపుట్టుట; రూపంబు = రూపముకలది; అయిన = ఐన; పితృ = పితృదేవతల; మార్గంబు = త్రోవ; నివృత్త = నివృత్త; కర్మ = కర్మములందు; నిష్ఠుండు = నియమించుకొనినవాడు; అయిన = ఐన; వాడు = వాడు; జ్ఞాన = జ్ఞానముచే; దీప్తంబులు = వెలిగెడివి; అయిన = ఐన; ఇంద్రియంబుల = ఇంద్రియముల; అందున్ = అందు; క్రియా = క్రియారూపములైన; యజ్ఞంబులు = యజ్ఞములు,యత్నములు; యజించి = యజ్ఞము(ప్రయత్నము)చేసి; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; దర్శనాది = పంచ తన్మాత్రల {పంచతన్మాత్రలు - 1దర్శన 2శ్రవణ 3గ్రహణ 4రసన 5స్పర్శనములు}; సంకల్ప = సంకల్పముల; మూలంబు = రూపముకలది; ఐన = అయిన; మనంబున్ = మనసు; అందున్ = లో; వికార = నానా విధ మార్పులతో; యుక్తంబు = కూడినది; అయిన = ఐన; మనంబునున్ = మనస్సును; వాక్కు = మాట; అందున్ = అందు; విద్యా = విద్యచేత; విలక్షణ = సంస్కరింపబడినది; అయిన = ఐన; వాక్కును = మాటను; వర్ణ = అక్షరముల; సముదాయంబున్ = సమూహము; అందున్ = అందు; వర్ణ = అక్షరముల; సముదాయంబున్ = సమూహమును; అకారాది = అకారముతో మొదలై; సర్వ = సమస్తమైన; త్రయాత్మకంబు = అకార ఉకార బిందువులుకలది; అయిన = ఐన; ఓంకారంబున్ = ఓంకారము; అందున్ = అందు; ఓంకారంబున్ = ఓంకారమును; బిందువు = పూర్ణానుస్వారము {బిందువు - ఓం లోని ఓ తరువాతి 0}; అందున్ = అందు; బిందువును = బిందువును; నాదంబున్ = స్వరము {నాదము - ఓంకారము ఉచ్చారణలో బిందువు తరువాత పలికెడి అనునాదరూపము నాదము}; అందున్ = అందు; నాదంబునున్ = స్వరమును; ప్రాణంబున్ = ప్రాణము {ప్రాణము - ఓంకారము ఉచ్ఛారణ తరువాతి మౌనరూపము}; అందున్ = అందు; ప్రాణంబునున్ = ప్రాణమును; బ్రహ్మము = బ్రహ్మము, ఆత్మ; అందున్ = అందు; నిలుపవలయును = నిలుపవలెను; దేవ = వెలుగు; మార్గంబు = త్రోవ; అయిన = ఐన; ఉత్తరాయణ = ఉత్తరాయణకాలము; శుక్లపక్ష = శుక్లపక్షము; దివస = పగలు; ప్రాహ్ణ = పూర్వభాగము; పూర్ణిమా = పున్నమి; రాకల = సంపూర్ణ చంద్రుడు గల పౌర్ణమి; వలన = వలన; సూర్య = సూర్యమండలము; ద్వారంబునన్ = ద్వారా; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకము; అందున్ = లో; చేరి = చేరి; భోగ = కర్మానుభవము; అవసానంబునన్ = పిదప; స్థూలోపాధి = స్థూలకారణుండు; ఐన = అయిన; విశ్వుండు = విరాడ్రూపముగలవాడు; ఐ = అయ్యి; స్థూలంబునున్ = స్థూలత్వమును; సూక్ష్మంబున్ = సూక్ష్మము; అందున్ = లో; లయించి = లీనముచేసి; సూక్ష్మోపాధి = సూక్ష్మకారణుండు; ఐన = అయిన; తైజసుండు = తేజోరూపము గలవాడు; ఐ = అయ్యి; సూక్ష్మంబున్ = సూక్ష్మరూపమును; కారణంబున్ = కారణము; అందున్ = అందు; లయించి = లీనముచేసి; కారణోపాధి = మూలకారణము; ఐన = అయిన; ప్రాజ్ఞుండు = ప్రజ్ఞగలవాడు; ఐ = అయ్యి; కారణంబును = కారణమును; సాక్షి = సర్వసాక్షియైన, కూటస్థుని; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = అందు; లయించి = ఇమిడ్చి; తుర్యుండు = పరిశుద్దమైన ఆత్మ (అవస్థాత్రయమును దాటి తురీయము అనగా నాలుగవ అవస్థను చేరిన వాడు); ఐ = అయ్యి; సూక్ష్మ = సూక్ష్మత్వంబు; లయంబున్ = పోవుట; అందున్ = చెందుటవలన; శుద్ధ = పరిశుద్ధమైన; ఆత్ముండు = ఆత్మయైనవాడు; ఐ = అయ్యి; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ముక్తుండు = మోక్షము పొందినవాడు; అగును = అగును.

భావము:

వినవయ్యా, ధర్మరాజా! వేదాలు చెప్పిన కర్మకాండ అంతా రెండు విభాగాలు. ఒకటి ప్రవృత్తి మార్గము. రెండు నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం వలన పునర్జన్మలు కలుగుతుంటాయి. నివృత్తి మార్గం మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
ప్రవృత్తిలో మళ్ళీ ఇష్టా పూర్తాలు అని రెండు రకాలు. హింసా ద్రవ్య మయములై కామ్యరూపాలైన దర్శపూర్ణమాస క్రతువు, పుత్రకామేష్టి, వైశ్వేదేవం, బలిహరణం మొదలగు ప్రముఖ యాగాలు ఇష్టాలు. దేవలయ ప్రతిష్ఠ, తటాక, కూపాది నిర్మాణం మొదలగు ప్రముఖ కార్యాలు పూర్తాలు. ప్రవృత్తి కర్మ వలన దేహి దేహాంతర ప్రాప్తిలో హృదయగ్రహంపై ప్రకాశిస్తాడు. ఇంద్రియాలతో కూడా సూక్ష్మదేహం ధరించి ధూమ, దక్షిణాయన, కృష్ణపక్ష రాత్రి అమావాస్యల ద్వారా సోమలోకం చేరుకుంటాడు. అక్కడనుండి పుణ్యఫలం పూర్తికాగానే, భోగావసానంలో దేహం విలీనం కాగా వర్షం ద్వారా క్రమంగా ఓషధులు, లతలు, అన్నం, శుక్లం రూపాలు పొంది భూమిపై మరల జన్మిస్తాడు. పునర్జన్మ రూపమైన పితృమార్గం, ఇదే ప్రవృత్తి మార్గం.
ఇక నివృత్తిమార్గంలో సాధకుడు జ్ఞానదీప్తములైన ఇంద్రియాల యందు క్రియాయజ్ఞాలు చేస్తాడు. అలా చేసి, ఇంద్రియాలను దర్శనాది సంకల్పమూలము లైన మనస్సులోనూ, వికారతత్వం గల మనస్సును వాక్కులోనూ, విద్యాదిలక్షణ మైన వాక్కును వర్ణమాలలోనూ, వర్ణమాలను అకార, ఉకార, మకార సంయుక్తమైన ఓంకారంలోనూ, ఓంకారమును బిందువులోనూ, బిందువును నాదంలోనూ, నాదమును ప్రాణంలోనూ, ప్రాణమును బ్రహ్మములోనూ నిలుపుకుంటూ ముందుకు సాగుతాడు. పుణ్యాత్ముడు దేవమార్గాలైన ఉత్తరాయణం, శుక్లపక్షం, పగలు, ప్రాతఃకాలం, రాకా పూర్ణిమలలో, సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకం చేరుకుంటాడు. పుణ్యకాలం పూర్తి కాగానే భోగావసాన దశలో స్థూల ఉపాధి అయిన విశ్వం అయిపోతాడు. స్థూలమును సూక్షంలో లయం చేస్తాడు. సూక్ష్మ ఉపాధితో తేజస్వి అవుతాడు. సూక్ష్మాన్ని కారణంతో లయం చేసి కారణ ఉపాధి అయిన ప్రాజ్ఞుడు అవుతాడు. కారణమును సాక్షిస్వరూపంలో లీనంచేసి బ్రహ్మరూపుడు అవుతాడు. ఇలా సూక్ష్మరూపంలో విలీనమై శుద్ధాత్ముడై యోగి ముక్తుడు అవుతాడు.