పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-465-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మనుష్య శరీరరూపం బయిన రథంబు దన వశంబు చేసికొని మహాభాగవత చరణకమల సేవా నిశితం బయిన విజ్ఞానఖడ్గంబు ధరియించి శ్రీమన్నారాయణ కరుణావలోకన బలంబున రాగాదిశత్రు నిర్మూలనంబు గావించి ప్రణవబాణాసనంబున శుద్ధజీవశరంబును సంధించి బ్రహ్మ మనియెడి గుఱి యందుఁ బడవేసి యహంకారరథికుండు రథికత్వంబు మాని నిజానందంబున నుండవలయు; నట్టి విశేషంబు సంభవింపని సమయంబున బహిర్ముఖంబు లయిన యింద్రియఘోటకంబులు బుద్ధిసారథి సహితంబులై స్వాభిమాన రథికుని ప్రమత్తత్త్వంబుం దెలిసి ప్రవృత్తిమార్గంబు నొందించి విషయశత్రు మధ్యంబునం గూల్చిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మనుష్య = మానవ; శరీర = దేహము యొక్క; రూపంబు = రూపముకలది; అయిన = ఐన; రథంబున్ = బండిని; తన = తన యొక్క; వశంబున్ = ఆధీనములో; చేసికొని = పెట్టుకొని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తుల; చరణ = పాదములనెడి; కమల = పద్మముల; సేవా = సేవచేత; నిశితంబు = వాడితేరినది; ఐన = అయిన; విజ్ఞాన = విజ్ఞానము యనెడి; ఖడ్గంబున్ = కత్తిని; ధరియించి = ధరించి; శ్రీమత్ = శ్రీవంతమైన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కరుణా = దయతోకూడిన; అవలోకన = చూపులు యనెడి; బలంబునన్ = శక్తితో; రాగాది = రాగద్వేషాదులు {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారములు}; శత్రు = శత్రువుల; నిర్మూలనంబు = సర్వనాశనము; కావించి = చేసి; ప్రణవ = ఓకారము యనెడి; బాణాసనంబున = విల్లునందు; శుద్ధజీవ = శుద్ధజీవుడు యనెడి; శరంబును = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; బ్రహ్మము = బ్రహ్మము; అనియెడి = అనెడి; గుఱిన్ = లక్ష్యము; అందున్ = అందు; పడవేసి = పడునట్లువేసి; అహంకార = అహంకారయుక్తుడైన జీవుడు యనెడి; రథికుండు = బండియందుండెడివాడు; రథికత్వంబున్ = రథికుడు యౌట; మాని = మానివేసి; నిజ = సత్యమైన; ఆనందంబునన్ = ఆనందములో; ఉండవలయును = ఉండవలెను; అట్టి = అటువంటి; విశేషంబు = విశిష్టత, భాగ్యము; సంభవింపని = కలుగని; సమయంబునన్ = అప్పుడు; బహిర్ముఖంబులు = వెలికి యురుకుచున్నవి; అయిన = ఐన; ఇంద్రియ = ఇంద్రియములు యనెడి; ఘోటకంబులు = గుఱ్ఱములు; బుద్ధి = బుద్ధి యనెడి; సారథి = సారథితో; సహితంబులు = కూడినవి; ఐ = అయ్యి; స్వాభిమాన = తమ యహంకారముగల; రథికుని = జీవుడు యనెడి రథికుని; ప్రమత్తత్త్వంబున్ = ఏమరపాటును; తెలిసి = తెలిసికొని; ప్రవృత్తి = కర్మముల; మార్గంబున్ = త్రోవను; ఒందించి = పొందించి; విషయ = ఇంద్రియార్థములనెడి; శత్రు = శత్రువుల; మధ్యంబునన్ = నడుమ; కూల్చిన = పడవేయగా.

భావము:

ఇటువంటి దేహరూప రథమును మానవుడు తన వశంలో ఉంచుకోవాలి. పరమ భాగవతుల పాదసేవతో సానబెట్టిన, జ్ఞానం అనే నిశితమైన ఖడ్గం ధరించాలి. శ్రీహరి కృప అనే బలంతో రాగము మొదలగు శత్రువులను నిర్మూలించాలి. ప్రణవం అనే ధనుస్సునకు శుద్ధ జీవం అనే బాణాన్ని సంధించి, బ్రహ్మముపై గురి పెట్టి ప్రయోగించాలి. అహంకారి అయిన రథి తన రథికత్వం మానుకుని ఆత్మానందంతో ఉండాలి. మనిషి ఇలాంటి విశేషతత్త్వం అందుకోడంలో ఏమాత్రం ప్రమత్తుడైనా; బహిర్ముఖు లైన ఇంద్రియాలనే గుఱ్ఱాలు, అహంకారి స్వాభిమాని అయిన రథికుని అప్రమత్తత పసిగట్టి, బుద్ధి అనే సారథితో సహా రథమును ప్రవృత్తి మార్గంలోకి లాగి, విషయ శత్రు వ్యూహం మధ్యలో పడవేస్తాయి.