పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-460-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; షడింద్రియంబులలోన నొకటియందుఁ దత్పరులై యిచ్ఛాపూరణ విధానంబులఁ జరితార్థుల మైతి మనువారలు ధారణాభ్యాస సమాధియోగంబుల సాధింప లేరు; కృషిప్రముఖంబులు సంసారసాధనంబులు గాని మోక్ష సాధనంబులు గావు; కుటుంబ సంగంబునఁ జిత్తవిక్షేపం బగు; చిత్తవిజయ ప్రయత్నంబున సన్న్యసించి సంగంబు వర్జించి మితంబయిన భిక్షాన్నంబు భక్షించుచు శుద్ధవివిక్త సమప్రదేశంబున నొక్కరుండు నాసీనుండై సుస్థిరత్వంబున బ్రణవోచ్ఛారణంబు చేయుచు రేచకపూరకకుంభకంబులఁ బ్రాణాపానంబుల నిరోధించి కామహతం బయిన చిత్తంబున బరిభ్రమణంబు మాని కామవిసర్జనంబు చేసి మరలు నంతకు నిజా నాసాగ్ర నిరీక్షణంబు చేయుచు నివ్విధంబున యోగాభ్యాసంబు చేయువాని చిత్తంబు కాష్ఠరహితంబయిన వహ్ని తెఱంగున శాంతిం జెందు కామాదుల చేత వేధింపఁబడక ప్రశాంత సమస్తవృత్తంబయిన చిత్తంబు బ్రహ్మసుఖ సమ్మర్శనంబున లీనంబై మఱియు నెగయ నేరదు.

టీకా:

వినుము = వినుము; షడింద్రియంబుల్ = ఇంద్రియము లారింటి {షడింద్రియములు - 1కన్ను 2ముక్కు 3చెవి 4నాలుక 5 చర్మము 6మనస్సు}; లోనన్ = అందు; ఒకటి = ముఖ్యమైనది, మనస్సు; అందున్ = ఎడల; తత్పరులు = దానియందే లగ్నమైనవారు; ఐ = అయ్యి; యిచ్ఛా = కోరికలను; పూరణ = తీర్చుకొను; విధానంబులన్ = పద్ధతులచేత; చరితార్థులము = కృతకృత్యులము; ఐతిమి = అయిపోతిమి; అను = అనెడి; వారలు = వారు; ధారణ = ధరించుట; అభ్యాస = అధ్యయనము; సమాధి = సమాధి; యోగంబులన్ = యోగములను; సాధింపన్ = పొంద; లేరు = శక్యముగాదు; కృషి = వ్యవసాయము; ప్రముఖంబులున్ = మున్నగునని; సంసార = సంసారము సాగించుట కైన; సాధనంబులున్ = పరికరములు; కాని = అంతేకాని; మోక్ష = ముక్తిసాధనకైన; సాధనంబులున్ = పరికరములు; కావు = కావు; కుటుంబ = కుటుంబముతోని; సంగంబునన్ = తగులమువలన; చిత్త = మనసునందు; విక్షేపంబు = కలత; అగున్ = కలుగును; చిత్త = మనసును; జయ = జయించు; ప్రయత్నంబునన్ = పూనికతో; సన్యసించి = సన్యాసము స్వీకరించి {సన్యాసము - సర్వసంగపరిత్యాగము కలగిన ఆశ్రమము}; సంగంబున్ = సర్వతగులములను; వర్జించి = విడిచిపెట్టి; మితంబు = పరిమితికి లోబడినది; అయిన = ఐన; భిక్షాన్నంబు = యాచనచేసిన ఆహారము; భక్షించుచున్ = తినుచు; శుద్ధ = నిర్మలమైన; వివిక్త = ఏకాంతమైన; సమ = చదునైన; ప్రదేశంబునన్ = చోటునందు; ఒక్కరుండు = ఒక్కడు; ఆసీనుండు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; సుస్థిరత్వంబునన్ = మిక్కిలి నిలకడగా; ప్రణవ = ఓంకారము; ఉచ్చారణంబు = పలుకుట; చేయుచున్ = చేయుచు; రేచక = ఊపిరి వదలుట; పూరక = ఊపిరి పీల్చుట; కుంభకంబులన్ = ఊపిరి బంధించుటలవలన; ప్రాణ = ప్రాణవాయువును; పానంబులన్ = తీసుకొనుటను; నిరోధించి = నియమించి, యామముచేసి; కామ = మనోరథముల; హతంబున్ = అణచబడినవి; అయిన = కాగా; చిత్తంబునన్ = మనసునందు; పరిభ్రమణంబు = ఏకాగ్రతనష్టమగుటను; మాని = వదలి; కామ = కోరికలను; విసర్జనంబు = విడిచిపెట్టుట; చేసి = చేసి; మరలు = వెనుదిరుగు; అంతకున్ = అంతవరకు; నిజ = తన; నాస = ముక్కు; అగ్ర = కొనయందు; నిరీక్షణంబు = దృష్టిని కేంద్రీకరించుట; చేయుచున్ = చేయుచు; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; యోగ = యోగమును; అభ్యాసంబున్ = అభ్యసించుట; చేయు = చేసెడి; వాని = వాని; చిత్తంబు = మనసు; కాష్ఠ = కఱ్ఱలు; రహితంబు = లేనిది; అయిన = ఐన; వహ్ని = అగ్ని; తెఱంగునన్ = వలె; శాంతిన్ = శమించుటను; చెందున్ = పొందును; కామాదుల్ = అరిషడ్వర్గము {కామాదులు - 1కామము 2క్రోధము 3లోభము 4మోహము 5మదము 6మాత్యర్యములు, అరిషడ్వర్గము}; చేత = వలన; వేధింపబడక = చీకాకుపెట్టబడక; ప్రశాంత = నెమ్మదిగల; సమస్త = సమనసచెందిన, కూడుకొన్న; వృత్తంబు = వర్తనకలది; అయిన = ఐన; చిత్తంబు = మనసు; బ్రహ్మసుఖ = బ్రహ్మానంద; సమ్మర్శనంబునన్ = అనుభవమునందు; లీనంబు = మునిగినది, కలిసినది; ఐ = అయ్యి; మఱియున్ = ఇంక; ఎగయన్ = చెలరేగుట; నేరదు = చేయలేదు.

భావము:

ఓ ధర్మజా! శ్రద్ధగా విను. కొందరు 1కన్ను 2ముక్కు 3చెవి 4నాలుక 5 చర్మము 6మనస్సు అనే షడింద్రియాలలో ఏ ఒక్కదాని యందో తత్పరులై, ఏవో కొన్ని కోరికలు తీర్చుకునే పద్ధతులతో తమ జన్మ ధన్యం అయిందని భావిస్తారు. అటువంటి వాళ్ళు ధారణ, అభ్యాస, సమాధి యోగాలు సాధింప లేరు. కృషి మొదలైన వృత్తులు సంసార సాధనాలు కానీ, మోక్ష సాధనాలు కావు. కుటుంబ జంజాటం వలన చిత్త చాంచల్యం వస్తుంది. చిత్తాన్ని జయించాలి అంటే సన్న్యసించాలి. అన్య సాంగత్యాలన్నీ విడిచిపెట్టాలి. మితంగా భిక్షాన్నం భుజించాలి. పరిశుభ్రమైన, సమతలమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుని సుస్థిరంగా ప్రణవం ఉచ్ఛరించాలి. రేచక, పూరక, కుంభకాలతో ప్రాణాపానాలను నిరోధించాలి. కామోపహతమై చిత్తం పరిభ్రమించటం మాని పూర్తిగా కామ విసర్జనం చేస్తుంది. పిమ్మట ప్రవృత్తి మార్గం నుంచి మరలే దాకా నాసాగ్రంపై దృష్టిని నిలిపి ఉంచాలి. ఇలా యోగాభ్యాసం చేసేవాని చిత్తం కట్టెలు లేని అగ్ని వలె శాంతిస్తుంది. కామాదులతో బాధింబడని మనస్సు ప్రశాంతమై బ్రహ్మసుఖానుభవంలో లీనమై పోతుంది. ఇక చిత్తం మరల పేట్రేగిపోదు.