పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-455-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి బ్రాహ్మణజను లందుఁ గర్మనిష్ఠులుఁ దపోనిష్ఠులు వేదశాస్త్రనిష్ఠులు జ్ఞానయోగనిష్ఠులు నై కొందఱు వర్తింతు; రందు జ్ఞాననిష్ఠునికి ననంతఫలకామి యైన గృహస్థుండు పితృజనుల నుద్దేశించి కవ్యంబులును దేవతల నుద్దేశించి హవ్యంబులును బెట్టుట ముఖ్యంబు; దైవకార్యంబునకు నిరువుర నైన నొకరి నైన బిత్రుకార్యంబునకు మువ్వురి నైన నొకరినైన భోజనంబు చేయింప వలయు; ధనవంతున కైనను శ్రాద్ధవిస్తారంబు కర్తవ్యంబు గాదు; దేశకాలప్రాప్త కందమూలఫలాదికం బయిన హరి నైవేద్యంబున విధిచోదిత ప్రకారంబుగా శ్రద్ధతోడఁ బాత్రంబు నందుఁ బెట్టిన యన్నంబు గామదుహంబయి యక్షయ ఫలకారి యగు; ధర్మతత్త్వవేది యైనవాఁడు శ్రాద్ధంబులందు మాంస ప్రదానంబు జేయక భక్షింపక చరింపవలయు; కంద మూలాది దానంబున నయ్యెడి ఫలంబు పశుహింసనంబున సంభవింపదు; ప్రాణహింస చేయక వర్తించుట కంటె మిక్కిలి ధర్మంబు లేదు; యజ్ఞవిదు లైన ప్రోడలు నిష్కాములై బాహ్యకర్మంబులు విడిచి యాత్మ జ్ఞాన దీపంబులందుఁ గర్మమయంబు లయిన యజ్ఞంబుల నాచరింతురు.

టీకా:

అట్టి = అటువంటి; బ్రాహ్మణ = విప్రులైన; జనులు = వారి; అందున్ = లో; కర్మనిష్ఠులు = యాగాదికర్మలు చేయువారు; వేదశాస్త్రనిష్ఠులు = వేదములు శాస్త్రములులో నిపుణులు; జ్ఞానయోగనిష్ఠులు = తత్త్వ జ్ఞానయోగము గలవారు; ఐ = అయ్యి; కొందఱు = కొంతమంది; వర్తింతురు = మెలగుదురు; అందున్ = వారిలో; జ్ఞాననిష్ఠుని = జ్ఞాని; కిన్ = కి; అనంత = అనంతమైన; ఫల = ఫలములను; కామి = కోరెడివాడు; ఐన = అయిన; గృహస్థుండు = కాపురస్థుడు; పితృ = పితృదేవతలుయైన; జనులను = వారిని; ఉద్దేశించి = గురించి; కవ్యంబులునున్ = కవ్యములను {కవ్యములు - పితృదేవతలకు యీయదగిన యన్నములు}; దేవతల్ = దేవతలను; ఉద్దేశించి = గురించి; హవ్యంబులును = హవ్యములను {హవ్యములు - దేవతలకీయదగిన యిగిర్చిన యన్నము మొదలగునవి}; పెట్టుట = ఇచ్చుట; ముఖ్యంబు = అవశ్యకములు; దైవ = దేవసంబంధ; కార్యంబున్ = పూజలకు; ఇరువురన్ = ఇద్దరిని (2); ఐనన్ = అయిన; ఒకరిన్ = ఒకరిని; ఐనన్ = అయిన; పితృ = తండ్రితాతలకు చెందిన; కార్యంబున్ = కార్యక్రమముల; కున్ = కు; మువ్వురిన్ = ముగ్గురుని; ఐనన్ = అయిన; ఒకరిన్ = ఒకరిని; ఐనన్ = అయిన; భోజనంబు = భోక్తగా భోజనము; చేయింపవలయు = పెట్టవలెను; ధనవంతున్ = ఎంతసంపదగలవాని; కైననన్ = కి అయినను; శ్రాద్ధ = తద్దినము విషయములో; విస్తారంబు = ఎక్కువ భోక్తలను పెట్టుట; కర్తవ్యంబు = చేయదగినపని; కాదు = కాదు; దేశ = ఉన్నప్రదేశము; కాల = కాలములందు; ప్రాప్త = లభించెడి; కందమూల = దుంపలు; ఫల = పండ్లు; ఆదికంబున్ = మున్నగునవి; అయిన = ఐన; హరి = నారాయణుని; నైవేద్యంబునన్ = నివేదింపబడినవిగా; విధిచోదితప్రకారంబునన్ = శాస్త్రోక్తంబుగా; శ్రద్ధ = శ్రద్ధ; పాత్రంబున్ = పళ్ళెము; అందున్ = లో; పెట్టిన = పెట్టినట్టి; అన్నంబు = అన్నము; కామ = కోరికలు; దుహంబు = ఒసగునది; అయి = అయ్యి; అక్షయ = అనంతమైన; ఫల = ఫలములను; కారి = కలిగించెడిది; అగున్ = అగును; ధర్మ = ధర్మము; తత్త్వ = తత్త్వజ్ఞానము; వేది = తెలిసినవాడు; ఐనవాడు = అయినవాడు; శ్రాద్ధంబుల్ = తద్దినముల; అందున్ = లో; మాంస = మాంసమును; ప్రదానంబు = పెట్టుట; చేయక = చేయకుండ; భక్షింపక = తినకుండ; చరింపవలయున్ = నడవవలెను; కందమూల = కందదుంప; ఆది = మున్నగువాని; దానంబునన్ = దానముచేయుటవలన; అయ్యెడి = కలిగెడి; ఫలంబున్ = ఫలితము; పశు = పశువులను; హింసనంబునన్ = చంపుటవలన; సంభవింపదు = కలుగదు; ప్రాణహింస = జీవహింస; చేయక = చేయకుండ; వర్తించుట = మెలగుట; కంటెన్ = కంటె; మిక్కిలి = అధికమైన; ధర్మంబు = ధర్మము; లేదు = లేదు; యజ్ఞ = యాగముల యొక్క; విదులు = విధానములుతెలిసినవారు; ఐన = అయిన; ప్రోడలు = వివేకులు, నేర్పరులు; నిష్కాములు = కోరికలులేనివారు; ఐ = అయ్యి; బాహ్య = వ్యక్తమగు; కర్మంబులు = కర్మలు; విడిచి = వదలివేసి; ఆత్మజ్ఞాన = ఆత్మజ్ఞానము యనెడి; దీపంబుల్ = దీపకాంతుల; అందున్ = అందు; కర్మ = (మానసిక) కర్మలతో; మయంబులు = నిండినవి; అయిన = ఐన; యజ్ఞంబులన్ = దీక్షలను; ఆచరింతురు = చేయుదురు.

భావము:

అటువంటి బ్రాహ్మణులలో కర్మనిష్ఠులూ, తపోధనులు, వేద వేదాంగ వేత్తలు, జ్ఞాన యోగులూ కొందరు ప్రకాండులు అయి మహాత్ములుగా ప్రకాశిస్తారు. జ్ఞానిష్ఠాగరిష్ఠుడైన వానికి అనంత ఫలాలను కాంక్షించే గృహస్థుడు తన పితృజనులకు ఉద్దేశించిన కవ్యమునూ, దేవతలకు ఉద్దేశించిన హవ్యమునూ సమర్పించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. దేవకార్యాలకు ఇద్దరికీ, పితృకార్యాలకు ముగ్గరికీ లేదా ఒక్కరికీ భోజనం పెట్టాలి. కానీ ఎంత ధనవంతుడైన శ్రాద్ధవిధికి అధికంగా చేయకూడదు. ఆ ప్రాంతంలో, ఆ కాలంలో లభించిన కందమూల, ఫలాదికములు మరియు అన్నం విధి ప్రకారం శ్రద్ధగా బ్రాహ్మణులకు సమర్పించాలి. ఆ సంతర్పణ గృహస్థుని వాంఛలు నెరవేర్చే అక్షయ ఫలములను ప్రసాదిస్తుంది. ధర్మశాస్త్రం తెలిసిన గృహస్థుడు శ్రాద్ధ కాలంలో మాంసం వడ్డించ కూడదు. తాను భుజించనూ కూడదు. కందమూలాదులు దానం చేస్తే వచ్చే పుణ్యఫలం జంతుహింసవలన ఎప్పుడూ లభించదు. ప్రాణిహింస చేయకుండా ఉండటం కంటే గొప్పధర్మం మరొకటి లేదు. అహింసయే పరమధర్మం. యజ్ఞతత్వం తెలిసిన పెద్దలు నిష్కాములై బాహ్యకర్మలు విడిచిపెట్టి ఆత్మజ్ఞాన దీప్తితోనే కర్మమయా లైన యజ్ఞాలు నిర్వహిస్తారు.