పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము

  •  
  •  
  •  

7-441-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గోరికలు లేక యొక్క సమయంబున దిగంబరుఁడనై పిశాచంబు చందంబున నుండుచుఁ బెక్కు దినంబులుం గోలెఁ బెనుఁబాఁప వర్తనంబుఁ గైకొని నిమీలితలోచనత్వంబున నేకాంతభావంబు విష్ణుని యందు జేర్చి వికల్పంబు భేదగ్రాహకచిత్తవృత్తులఁ జిత్తంబు నర్థరూప విభ్రమంబు గల మనంబు నందు మనంబును నహంకారంబు నందు నహంకారంబును మాయ యందు మాయను నాత్మానుభూతి యందు లయంబు నొందించి సత్యంబు దర్శించుచు విరక్తి నొంది స్వానుభవంబున నాత్మస్థితుండనై యుండుదు; నీవు భగవత్పరుండవు గావున రహస్యం బైన పరమహంసధర్మంబు స్వానుభవగోచరం బైన తెఱంగున నీకు హృద్గోచరంబగు నట్లు చెప్పితి" ననిన విని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కోరికలు = కోరికలు; లేక = లేకుండగ; ఒక్క = ఒక; సమయంబునన్ = సమయములో; దిగంబరుండను = దిసమొలవాడను; ఐ = అయ్యి; పిశాచంబు = దయ్యము; చందంబునన్ = వలె; ఉండుచున్ = ఉంటూ; పెక్కు = చాలా; దినంబులంగోలెన్ = రోజులనుండి; పెనుపాప = పెద్దపాము, కొండచిలువ; వర్తనంబున్ = నడవడిని; కైకొని = స్వీకరించి; నిమీలిత = అరమోడ్పు; లోచనత్వంబునన్ = చూపులతో; ఏకాంత = ఏకాగ్రమైన; భావంబునన్ = భావముతో; విష్ణుని = విష్ణుమూర్తి; అందున్ = ఎడల; వికల్పంబున్ = భ్రాంతిని; భేద = భేదబుద్ధిని; గ్రాహక = కలిగించెడి; చిత్త = మనో; వృత్తులన్ = ధర్మములను; చిత్తంబునన్ = చిత్తమునందు; అర్థ = వస్తు; రూప = రూపముల; విభ్రమంబు = భ్రాంతులు; కల = కలిగినట్టి; మనంబున్ = మనసు; అందున్ = లో; మనంబునున్ = మనస్సును; అహంకారంబున్ = అహంకారము; అందునన్ = లో; అహంకారంబున్ = నేనడిభావము; మాయ = మాయ; అందున్ = లో; మాయను = మాయను, ప్రకృతిని; ఆత్మానుభూతి = ఆత్మ సాక్షాత్కారము; అందున్ = లో; లయంబున్ = లీనము; ఒందించి = పొందించి; సత్యంబున్ = సత్యమును; దర్శించుచు = చూచుచు; విరక్తిన్ = విరాగమును; ఒంది = పొంది; స్వానుభవంబునన్ = ఆత్మానుభమునందు; ఆత్మస్థితుండను = ఆత్మస్థితినియెరిగినవాడను; ఐ = అయ్యి; ఉండుదున్ = ఉండెదను; నీవు = నీవు; భగవత్పరుండవు = భాగవతుడవు; కావునన్ = కనుక; రహస్యంబు = రహస్యమైనది; ఐన = అయినట్టి; పరమహంస = పరమహంసత్వపు; ధర్మంబున్ = లక్షణములను; స్వానుభవ = నాఅనుభవమునకు; గోచరంబు = తెలిసినది; ఐన = అయిన; తెఱంగునన్ = విధముగ; నీవు = నీవు; కున్ = కు; హృత్ = హృదయమునకు; గోచరంబు = తెలిసినది; అగున్ = అయ్యెడి; అట్లు = విధముగ; చెప్పితిన్ = చెప్పితిని; అనినన్ = అనగా; విని = విని.

భావము:

ఈ విధంగా ఏ కోరికలూ లేకుండా పూర్వం కొన్నాళ్ళు పిశాచం లాగ దిగంబరంగా తిరిగాను. ఇప్పుడు చాలా రోజులనుండి పెద్దకొండచిలువలాగా కళ్ళు మూసుకుని, భావం భగవంతుడైన శ్రీమహావిష్ణువుపై లగ్నం చేసి ఇలా ఉన్నాను. భ్రాంతిని భేదభావం చూపే చిత్తవృత్తిలోనూ, చిత్తమును అర్థరూపములపై పరిభ్రమించే మనస్సులోనూ, మనస్సును అహంకారంలోనూ, అహంకారమును మాయలోనూ, మాయను ఆత్మానుభూతిలోనూ కేంద్రీకరించి విలీనం చేశాను. అది మొదలు సత్యదర్శనం చేస్తూ విరక్తి భావం పొందాను. స్వానుభవంతో ఆత్మస్థితి అలవరచుకున్నాను. నీవు ప్రహ్లాద! భక్తశిఖామణివి, పరమ భాగవతుడవు కాబట్టి ఈ రహస్యమైన పరమహంస ధర్మమును నాకు తెలిసినంతవరకు నీకు అర్థం అయ్యే లాగా చెప్పాను.” అని ఆ అజగరముని అన్నాడు.