పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము

  •  
  •  
  •  

7-435-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; ప్రవాహకారిణి యై విషయంబులచేతం బూరింపరాని తృష్ణచేతం బడి కర్మంబులఁ బరిభ్రామ్యమాణుండ నైన నేను నానావిధ యోనుల యందుఁ బ్రవేశించుచు వెడలుచు నెట్టకేలకు మనుష్య దేహంబు ధరియించి యందు ధర్మంబున స్వర్గద్వారంబును నధర్మంబున శునకసూకరాది తిర్యగ్జంతు యోని ద్వారంబుల నొంది క్రమ్మఱ మనుష్యుండై పుట్టవలయు నని వివేకించి సుఖరక్షణదుఃఖ మోక్షంబులకొఱకు ధర్మంబు చేయు దంపతుల వ్యవహారంబు గని సర్వక్రియానివృత్తి గలిగిన జీవుండు స్వతంత్రుండై ప్రకాశించు నని నిర్ణయించి భోగంబులు మనోరథజాత మాత్రంబులు గాని శాశ్వతంబులు గావని పరీక్షించి నివృత్తుండనై యుద్యోగంబు లేక నిద్రించుచుఁ బ్రారబ్దభోగంబు లననుభవించుచు నుండుదు; నివ్విధంబునఁ దనకు సుఖరూపంబైన పురుషార్థంబు దన యందుఁ గలుగుట యెఱుంగక పురుషుండు శైవాలజాల నిరుద్ధంబు లైన శుద్ధజలంబుల విడిచి యెండమావులు జలంబు లని పాఱెడు మూఢుని వడువున సత్యంబుగాని ద్వైతంబుఁ జొచ్చి ఘోరసంసారచక్ర పరిభ్రాంతుం డై, దైవతంత్రంబు లైన దేహాదులచేత నాత్మకు సుఖంబును దుఃఖనాశంబునుం గోరుచు నిరీశుం డైనవాని ప్రారంభంబులు నిష్ఫలంబు లగు; నదియునుం గాక మర్త్యునకు ధనంబు ప్రాప్తంబయిన నది దుఃఖకరంబు గాని సుఖకరంబు గాదు; లోభవంతు లయిన ధనవంతులు నిద్రాహారంబులు లేక రాజ చోర యాచక శత్రు మిత్రాది సర్వస్థలంబు లందును శంకించుచు దానభోగంబులు మఱచి యుండుదురు; ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు; శోకమోహ భయక్రోధ రాగ శ్రమాదులు వాంఛామూలంబులు; వాంఛ లేకుండవలయును.

టీకా:

వినుము = వినుము; ప్రవాహ = ప్రవహించు, గమన; కారిణి = లక్షణముగలది; ఐ = అయ్యి; విషయంబుల్ = ఇంద్రియార్థముల; పూరింప = తృప్తిపరచ; రాని = శక్యముగాని; తృష్ణన్ = మిక్కిలి యాశ యందు; పడి = పడిపోయి; కర్మంబులన్ = కర్మములందు; పరిభ్రామ్యమాణుండను = తిరుగుచున్నవాడను; ఐన = అయిన; నేను = నేను; నానా = అనేక; విధ = రకముల; యోనులన్ = గర్భముల, క్షేత్రముల; అందున్ = లో; ప్రవేశించుచన్ = చేరుచు; వెడలుచు = బయటపడుచు; ఎట్టకేలకు = ఏదోవిధముగ; మనుష్య = మానవుని; దేహంబు = దేహమును; ధరియించి = పొంది; అందున్ = దానిలో; ధర్మంబునన్ = ధర్మవర్తనలచేత; స్వర్గ = స్వర్గలోకపు; ద్వారంబునున్ = వాకిలిని; శునక = కుక్క; సూకర = పంది; ఆది = మున్నగు; తిర్యక్ = స్థిరత్వములేని; జంతు = జంతువుల; యోనిద్వారంబులన్ = గర్భద్వారములను; ఒంది = పొంది; క్రమ్మఱ = మరల; మనుష్యుండు = మానవుడను; ఐ = అయ్యి; పుట్టవలయున్ = జన్మించవలెనని; వివేకించి = విచారించుకొని; సుఖ = సుఖమును; రక్షణ = కాపాడుకొనుట; దుఃఖ = దుఃఖమునుండి; మోక్షంబుల = విముక్తుల; కొఱకు = కోసము; ధర్మంబున్ = సద్వర్తనము; చేయు = చేసెడి; దంపతుల = భార్యాభర్తల; వ్యవహారంబున్ = వ్యర్థప్రయత్నములను; కని = చూసి; సర్వ = ఎల్ల; క్రియా = పనులను; నివృత్తి = మానుట; కలిగిన = కలిగినట్టి; జీవుండు = మానవుడు; స్వతంత్రుండు = దేనియందు లోబడనివాడు; ఐ = అయ్యి; ప్రకాశించున్ = విలసిల్లును; అని = అని; నిర్ణయించి = నిశ్చయించుకొని; భోగంబులు = సుఖదుఃఖానుభవములు; మనోరథ = తలపులలో; జాత = కలిగినవి; మాత్రంబులు = మాత్రమే; కాని = తప్పించి; శాశ్వతంబులు = స్థిరములు; కావు = కావు; అని = అని; పరీక్షించి = తరచిచూసి; నివృత్తుండను = కర్మబంధముల నుండి మరల్చబడిన వాడను; ఐ = అయ్యి; ఉద్యోగంబు = ప్రయత్నము, వృత్తి; లేక = లేకుండగనే; నిద్రించుచున్ = నిద్రపోవుచు; ప్రారబ్ధ = పూర్వ సంచిత కర్మానుసార; భోగంబులన్ = అనుభవములను; అనుభవించుచున్ = అనుభవించుచు; ఉండుదు = ఉండెదను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; తన = తన; కున్ = కు; సుఖ = సుఖము; రూపంబు = అనెడిది; ఐన = అయిన; పురుషార్థంబున్ = వస్తువులు; తన = తన; అందున్ = ఎడల; కలుగుట = కలుగుటను; ఎఱుంగక = తెలిసికొనక; పురుషుండు = మానవుడు; శైవాల = నాచు తెట్టుల; జాల = సమూహములచే; నిరుద్ధంబులు = కప్పబడినవి; ఐన = అయిన; శుద్ద = మంచి; జలంబులన్ = నీటిని; విడిచి = వదలివేసి; ఎండమావులు = మృగతృష్ణలను; జలంబులు = నీరు; అని = అని భ్రమించి; పాఱెడు = పరిగెత్తెడి; మూఢుని = అవివేకి; వడువునన్ = వలె; సత్యంబు = నిజము; కాని = కానట్టి; ద్వైతంబున్ = ద్వంద్వభావనలను; చొచ్చి = చేరి; ఘోర = భయంకరమైన; సంసార = సంసారము యనెడి; చక్ర = చక్రమునందు; పరిభ్రాంతుండు = భ్రాంతిలో తిరుగువాడు; ఐ = అయ్యి; దైవ = దేవునిచే; తంత్రంబులు = నియమింపబడుచున్నవి; ఐన = అయిన; దేహ = దేహము; ఆదులన్ = మొదలగువాని; చేతన్ = వలన; ఆత్మ = ఆత్మ; కున్ = కు; సుఖంబును = సుఖమును; దుఃఖనాశంబునున్ = దుఃఖముపోవుటను; కోరుచున్ = కోరుకొనుచు; నిరీశుండు = ఈశ్వరునితెలియనివాడు; ఐన = అయిన; వానిన్ = వాడి; ప్రారంభంబులున్ = ప్రయత్నములు; నిష్ఫలంబులు = నిరర్థకములు; అగు = అగును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; మర్త్యున్ = మానవుని; కున్ = కు; ధనంబు = సంపద; ప్రాప్తంబు = లభించినది; అయిన = ఐనట్టిది; అది = మున్నగునవి; దుఃఖ = దుఃఖమును; కరంబు = కలిగించునది; కాని = తప్పించి; సుఖ = సుఖమును; కరంబు = కలిగించునది; కాదు = కాదు; లోభవంతుండు = ఆశాబద్ధులు; అయిన = ఐన; ధనవంతులు = మిక్కిలి ధనముగలవారు; నిద్ర = నిద్రను; ఆహారంబులు = ఆహారములు; లేక = లేకుండగ; రాజ = రాజులవలన; చోర = దొంగలవలన; యాచక = అడుగుకొనేవారివలన; శత్రు = శత్రువులవలన; మిత్ర = స్నేహితులు; ఆది = మున్నగు; సర్వ = అన్ని; స్థలంబులన్ = చోటులందు; శంకించుచున్ = సందేహించుచు; దాన = ఒకరికి పెట్టుట; భోగంబులున్ = తా ననుభవించుటలు; మఱచి = మైమరచిపోయి; ఉండుదురు = ఉండెదరు; ప్రాణ = ప్రాణులు; అర్థ = సంపదలు; వంతుల్ = గలవారల; కున్ = కి; భయంబు = భయము; నిత్యంబు = శాశ్వతము; శోక = వ్యసనము; మోహ = మోహము; భయ = భీతి; క్రోధ = కోపము; రాగ = అనురాగము; శ్రమ = అలసట; ఆదులు = మున్నగునవి; వాంఛా = తృష్ణ, కోరికల; మూలంబులు = వలనపుట్టునవి; వాంఛ = (కావున) విషయతృష్ణ; లేక = లేకుండగ; ఉండవలయును = ఉండవలెను.

భావము:

ఓ ప్రహ్లాదా! వినవయ్యా! విషయసుఖాల చేత తృప్తిపొందుట సాధ్యం కాని పని. అలా తృప్తి చెందకుండా పరుగులు పెట్టిస్తూ ఉండేది తృష్ణ లేదా దురాశ. అట్టి తృష్ణ వెంటబడి నేను కర్మబంధాలలో చిక్కుకుని సంసార చక్రంలో పరిభ్రమించాను. అనేక రకాలైన జన్మలు ఎత్తాను. మరణించాను. ఈ పరిభ్రమణంలో చిట్టచివరకు ఎట్టకేలకు మానవ దేహం ధరించాను. ఆయా జన్మలలో ధర్మాలూ, పుణ్యాలూ, అధర్మాలూ, పాపాలూ చేసి అటు స్వర్గ ద్వారాలూ, ఇటు శునక సూకరాది జంతు గర్భాలలోనూ పుట్టి నానా బాధలూ పడి పడి, వివేకించి మానవ జన్మ ఎత్తాను. సుఖం సంపాదన కోసం, దుఃఖ విముక్తి కోసం ధర్మం చేసే దంపతులను చూసాను. సమస్త క్రియల నుంచీ విముక్తి పొందిన జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడని నిర్ణయించుకున్నాను. భోగాలు కోరికల వలన జనించేవే కానీ, శాశ్వతాలు కావని పరీక్షించి నిర్ధారించుకున్నాను. కర్మబంధాల నుండి నివృత్తి పొంది; ఏ ప్రయత్నమూ, ఏ కోరికలూ లేకుండా ఇలా నిద్రిస్తూ, ప్రారబ్ధ భోగాలు అనుభవిస్తూ పడి ఉన్నాను.
ఈ విధంగా మానవుడు తనకు కావలసిన సుఖరూపమైన పురుషార్థం తనలోనే జన్మిస్తుందని తెలుసుకోలేక పోతున్నాడు. పరిశుద్ధమైన జల ప్రవాహాన్ని విడిచిపెట్టి, ఎండమావుల వెంట పరుగెత్తే మూర్ఖుని వలె, జీవుడు అసత్యమైన ద్వైతంలో పడి పోతున్నాడు. ఘోర సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు. దైవ తంత్రాలైన దేహాదులచేత ఆత్మకు సుఖమునూ, దుఃఖనాశనమూ కోరుకునే నిరీశు డైనట్టివాని ప్రయత్నాలు నిష్ఫలాలు అవుతాయి. అంతేకాక, మానవుడికి ధనం లభిస్తే అది దుఃఖం కలిగిస్తుందే కాని, సుఖాన్ని కలిగించదు. లుబ్దులైన ధనవంతులు నిద్రాహారాలు మాని ప్రభువులనూ, చోరులనూ, యాచకులనూ, శత్రువులనూ, మిత్రులనూ అందరినీ అనుమానిస్తూ ఉంటారు; దానం చేయటం, అనుభవించటం మరచిపోతారు. నిత్యం దుఃఖంతో బాధ పడుతూ ఉంటారు. ప్రాణం మీద, ధనం మీదా మమకారం ఉన్నవాళ్ళను నిత్యం భయం వెంటాడుతూ ఉంటుంది. శోకం, మోహం, భయం, క్రోధం, రాగం, శ్రమ మున్నగు వాటికి కోరికలే కారణం. కాబట్టి, కోరికలు లేకుండా ఉండటం శ్రేయస్కరం.