పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-429-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరపి సన్న్యసించి దేహమాత్రావశిష్టుండును నిరపేక్షుండును భిక్షుండును నిరాశ్రయుండును నాత్మారాముండును సర్వభూతసముండును శాంతుండును సమచిత్తుండును నారాయణపరాయణుండును నై కౌపీనం బను నాచ్ఛాదకమాత్రం బయిన వస్త్రంబు ధరియించి దండాదివ్యతిరిక్తంబులు విసర్జించి యాత్మపరంబులుగాని శాస్త్రంబులు వర్జించి గ్రహనక్షత్రాది విద్యల జీవింపక భేదవాదంబులయిన తర్కంబులు దర్కింపక యెందును బక్షీకరింపక శిష్యులకు గ్రంథంబులు వంచించి యుపన్యసింపక బహువిద్యల జీవింపక మత్తాదివ్యాపారంబుల నుల్లసిల్లక పెక్కుదినంబు లొక్కయెడ వసియింపక యూరూర నొక్కొక్క రాత్రి నిలుచుచుఁ గార్యకారణవ్యతిరిక్తం బయిన పరమాత్మ యందు విశ్వంబు దర్శించుచు సదసన్మయంబయిన విశ్వంబు నందు బరబ్రహ్మంబయిన యాత్మ నవలోకించుచు జాగరణ స్వప్న సంధి సమయంబుల నాత్మనిరీక్షణంబు చేయుచు నాత్మకు బంధమోక్షణంబులు యామాత్రంబులుగాని వస్తుప్రకారంబున లేవనియును దేహంబునకు జీవితంబు ధ్రువంబు గాదనియును మృత్యువు ధ్రువంబనియును నెఱుంగుచు భూతదేహంబుల సంభవనాశంబులకు మూలంబయిన కాలంబు బ్రతీక్షించుచు నివ్విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబుఁ జరియించి యటమీఁద విజ్ఞానవిశేషంబు సంభవించినఁ బరమహంసుండయి దండాదిచిహ్నంబులు ధరియించి యొండె ధరియింపక యొండె బహిరంగవ్యక్తచిహ్నుండు గాక యంతరంగవ్యక్తం బయిన యాత్మాను సంధానంబు గలిగి మనీషియై బాహ్యానుసంధాన భావంబున మనుష్యులకుఁ దనవలన నున్మత్త బాల మూకల తెఱంగుఁ జూపుచుండవలయు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వానప్రస్థాశ్రమంబున్ = వానప్రస్థాశ్రమమును; జరిపి = నడపి; సన్యసించి = సన్యసాశ్రమముస్వీకరించి; దేహ = శరీరము; మాత్ర = మాత్రమే; అవశిష్టుండును = మిగిలినవాడు; నిరపేక్షుండును = కోరికలులేనివాడు; భిక్షుండును = భిక్షమెత్తువాడు; నిరాశ్రయుండును = నివాసములేనివాడు; ఆత్మారాముండును = తనలోతానే క్రీడించువాడు; సర్వ = ఎల్ల; భూత = జీవులను; సముండును = ఒకే రీతిని చూచువాడు; శాంతుండును = నిత్యనమ్రుడును; సమచిత్తుండును = సుఖదుఃఖములందు సమభావముగలవాడు; నారాయణ = శ్రీహరియందు; పరాయణుండును = లగ్నమైనమనసుగలవాడు; కౌపీనంబు = గోచి; అను = అనెడి; ఆచ్ఛాదక = కప్పువస్త్రము; మాత్రంబు = మాత్రమే; అయిన = అయిన; వస్త్రంబు = వస్త్రమును; ధరియించి = కట్టుకొని; దండ = దండము; ఆది = మొదలైన; వ్యతిరిక్తంబులు = వేరైనవస్తువులను; విసర్జించి = వీడి; ఆత్మ = ఆత్మయందు; పరంబులు = లయించునవి; కాని = కానట్టి; శాస్త్రంబులు = శాస్త్రములను; వర్జించి = విడిచిపెట్టేసి; గ్రహనక్షత్ర = జ్యోతిషము; ఆది = మొదలగు; విద్యల = విద్యలచేత; జీవింపక = జీవికగాతీసుగొనక; భేదవాదంబులు = ద్వైతభావముగలవాదములు; అయిన = అయిన; తర్కంబులున్ = వాదించుటలను; తర్కింపక = తరచిచూడక; ఎందును = దేనియందును; పక్షీకరింపక = పక్షమువహింపక; శిష్యుల = శిష్యుల; కున్ = కు; గ్రంథంబులు = గ్రంథములను; వంచించి = మోసముచేసి; ఉపన్యసింపక = బోధించక; బహు = పలు; విద్యల = విద్యలతోటి; జీవింపక = పొట్టపోసుకొనక; మత్తు = (కల్లు)మత్తుకలిగించెడివాని; వ్యాపారంబులన్ = వాడుట యందు; ఉల్లసిల్లక = సంతోషింపకుండగ; పెక్కు = ఎక్కువ; దినంబులు = రోజులు; ఒక్క = ఒకే; ఎడన్ = ప్రదేశములో; వసియింపక = ఉండకుండగ; ఊరూరన్ = ప్రతి యూరునందు; ఒక్కొక్క = ఒకటిచొప్పున; రాత్రి = రాత్రులు; నిలుచుచున్ = వసించుచు; కార్య = కార్యభూతములైన ఘటపటాదులకంటెను; కారణ = కారణభూతములైన మృదాదులకంటెను; వ్యతిరిక్తంబు = వేరైనది, అతీతమైనది; అయిన = ఐన; పరమాత్మ = పరబ్రహ్మము; అందున్ = లో; విశ్వంబున్ = జగత్తును; దర్శించుచున్ = చూచుచు; సత్ = సత్తు, నిత్యమైనది; అసత్ = అసత్యమైనది,అనిత్యమైనది; విశ్వంబున్ = జగత్తు; అందున్ = అందు; పరబ్రహ్మంబు = పరమాత్మ; అయిన = ఐన; ఆత్మన్ = ఆత్మను; అవలోకించుచు = దర్శించుచు; జాగరణ = జాగృతి, మేలుకున్న; స్వప్న = స్వప్నము, కల; సంధి = సుషుప్తి, కలతనిద్ర; సమయంబుల్ = స్థితియందున్నకాలమందు; ఆత్మన్ = పరమాత్మను; నిరీక్షణంబు = చూచుట; చేయుచున్ = చేయుచు; ఆత్మ = ఆత్మ; కున్ = కు; బంధ = పట్టు; మోక్షంబులు = విడుపులు; మాయా = మాయచేతకల్పితంబులు; మాత్రంబులు = మాత్రమే; కాని = తప్పించి; వస్తుప్రకారంబున = భౌతికముగ; లేవు = లేవు; అనియును = అని; దేహంబున్ = దేహమున; కున్ = కు; జీవితంబు = జీవించియుండుట; ధ్రువంబు = నిత్యము; కాదు = కాదు; అనియును = అని; మృత్యువు = మరణము; ధ్రువంబు = సత్యము; అనియును = అని; ఎఱుంగుచున్ = అర్థముచేసికొనుచు; భూత = పంచభూతములకూడికైన; దేహంబుల = దేహముల యొక్క; సంభవ = పుట్టుక; నాశంబుల్ = మరణముల; కున్ = కు; మూలంబు = కారణభూతము; అయిన = ఐన; కాలంబున్ = కాలముకొరకు; ప్రతీక్షించుచున్ = ఎదురుచూచుచు; ఇవ్విధంబునన్ = ఈలాగున; జ్ఞాన = బ్రహ్మజ్ఞానము; ఉత్పత్తి = కలిగెడి; పర్యంతంబున్ = వరకు; చరియించి = మెలగి; అటమీద = ఆపైన; విజ్ఞాన = బ్రహ్మజ్ఞానము యనెడి; విశేషంబు = శ్రేష్ఠమైనది; సంభవించినన్ = కలుగగా; పరమహంసుండు = పరమహంస; అయి = అయ్యి; దండ = దండము {దండము - జపతపాదులందు చేతిని ఆనించుకొనెడి పైన చిన్న అడ్డకఱ్ఱ యుండెడి కఱ్ఱ}; ఆది = మొదలగు; చిహ్నంబులు = గుర్తులు; ధరించి = కలిగి; ఒండెన్ = కాని; ధరియింపక = కలియుండక; ఒండెన్ = కాని; బహిరంగ = బయటకు; వ్యక్త = వెల్లడగు; చిహ్నుండు = గుర్తులుగలవాడు; కాక = కాకుండగ; అంతరంగ = మనోనోత్రమునకు; వ్యక్తంబు = గోచరమగునది; అయిన = ఐన; ఆత్మానుసంధానంబున్ = జీవాత్మపరమాత్మల యైక్యత; కలిగి = కలిగిన; మనీషి = జ్ఞాని; ఐ = అయ్యి; బాహ్య = బాహ్యప్రపంచమునకు; అనుసంధాన = తెలియబడెడి; భావంబునన్ = విధములో; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; తన = తన; వలన = గురించి; ఉన్మత్త = పిచ్చివాని; బాల = చిన్నపిల్లవాని; మూక = మూగవాని; తెఱంబున్ = వలె; చూపుచుండవలయున్ = కనబడవలెను.

భావము:

సన్న్యాసాశ్రమం స్వీకరించిన సన్న్యాసి దేహమాత్రావశిష్టుడై ఉండాలి. సర్వభూతము లందూ నిరపేక్షుడుగా, క్షుకుడుగా, ఆత్మారాముడుగా, సర్వప్రాణి సమ భావం కలవాడిగా, శాంతుడుగా, సమచిత్తుడుగా ఉండి, సదా నారాయణ పరాయణుడై తేజరిల్లుతూ ఉండాలి. సన్న్యాసి శరీరం మీద గోచీ మాత్రమే ధరించాలి. దండ, కమండలాలు విసర్జించాలి. ఆత్మపరములు కానట్టి శాస్త్రాలను విసర్జించాలి. జ్యోతిషం మొదలైన లౌకిక విద్యలు పరిత్యజించాలి. కుతర్కాలకు పోకుండా, ఎట్టి పక్షపాతం పెట్టుకోకుండా, ఆత్మచింతనలోనే నిమగ్నమైన సమాధి నిష్ఠలో ఉండాలి. శిష్యులకు వంచనతో గ్రంథాలు బోధించరాదు. రకరకాల విద్యలు ప్రదర్శింప రాదు. మత్తతలో నిమగ్నుడు కారాదు. పెక్కుదినాలు ఒకేచోట నివసించ కూడదు. ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపవచ్చు. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ, సత్ అసత్ పదార్థాలతో నిర్మతమైన ఈ విశాల విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను సందర్శిస్తూ ఉండాలి. జాగరణ, స్వప్న, సంధి సమయాలలో ఆత్మనిరీక్షణ చేయాలి. ఆత్మకు బంధమోక్షణాలు మాయామాత్రాలు కాని, వాస్తవంగా లేవు అని భావించాలి. జన్మకు జీవితం స్థిరం కాదనీ, మృత్యువు నిశ్చయం అని తెలుసుకొని ప్రవర్తించాలి. సకల జీవకోటి పుట్టుకలకూ, నాశములకు కాలం మూలం అని గ్రహించి, అట్టి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా జ్ఞానోత్పత్తి వరకూ ప్రవర్తించి, అటు పిమ్మట విజ్ఞాన విశేషం ప్రాప్తిస్తే “పరమహంస” అయి దండాది చిహ్నాలు ధరించికానీ, ధరించకుండా కానీ అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగి, విజ్ఞానియై ప్రకాశించాలి. బాహ్యానుసంధానాలు వలన ఇతరులకు పిచ్చివాని లాగ, అమాయక బాలుని లాగ, మూగవాడి లాగా కనిపించాలి.