పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-427-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అటమీఁద, గృహస్థాశ్రమంబు విడిచి వనంబునకుం జని దున్నక పండెడి నీవారాదికంబు లగ్నిపక్వంబు జేసి యొండె, నామంబులు చేసి యొండె, నర్కపక్వంబులైన ఫలాదు లొండె, భక్షింపుచు; వన్యాహారంబుల నిత్యకృత్యంబులయిన చరుపురోడాంశంబు లొనర్చుచుఁ; బ్రతిదినంబును బూర్వ సంచితంబులు పరిత్యజించి నూతన ద్రవ్యంబులు సంగ్రహించుచు; నగ్నికొఱకుఁ బర్ణశాల యైనఁ బర్వతకందరం బయిన నాశ్రయించుచు; హిమ, వాయు, వహ్ని, వర్షాతపంబులకు సహించుచు; నఖ, శ్మశ్రు, కేశ, తనూరుహంబులు ప్రసాధితంబులు జేయక జటిలుండై వసియించుచు; దండాజిన, కమండలు, వల్కల పరిచ్ఛదంబులు ధరియించి; పండ్రెండైన, నెనిమిదైన, నాలుగైన, రెండైన, నొక వత్సరంబయినఁ దపః ప్రయాసంబున బుద్ధి నాశంబు గాకుండ ముని యై చరించుచు; దైవవశంబున జరారోగంబులచేతఁ జిక్కి నిజ ధర్మానుష్ఠాన సమర్థుండు గాని సమయంబున నిరశన వ్రతుం డయి యగ్నుల నాత్మారోపణంబు జేసి; సన్యసించి యాకాశంబు నందు శరీరరంధ్రంబులును, గాలి యందు నిశ్శ్వాసంబును, దేజంబు లోపల నూష్మంబును, జలంబుల రసంబును, ధరణి యందు శల్య మాంస ప్రముఖంబులును, వహ్ని యందు వ్యక్తంబుతోడ వాక్కును, నింద్రుని యందు శిల్పంబుతోడఁ గరంబులును, విష్ణుని యందు గతితోడఁ బదంబులును, బ్రజాపతి యందు రతితోడ నుపస్థంబును, మృత్యువందు విసర్గంబుతోడఁ బాయువును, దిక్కులందు శబ్దంబు తోడ శ్రోత్రంబును, వాయు వందు స్పర్శంబుతోడ ద్వక్కును, సూర్యు నందు రూపంబుతోడఁ జక్షువులును, సలిలంబు లందుఁ బ్రచేతస్స హిత యయిన జిహ్వయు, క్షితి యందు గంధ సహితం బయిన ఘ్రాణంబును, జంద్రుని యందు మనోరథంబులతోడ మనంబును, గవియైన బ్రహ్మ యందు బోధంబుతోడ బుద్ధియు, రుద్రుని యందహంకారంబుతోడ మమత్వంబును, క్షేత్రజ్ఞుని యందు సత్త్వంబు తోడ జిత్తంబును. బరంబు నందు గుణంబులతోడ వైకారికంబును, డిందించి; యటమీఁదఁ, బృథివిని జలంబునందు; జలంబును దేజంబు నందుఁ; దేజంబును వాయువు నందు; వాయువును గగనంబు నందు; గగనంబును నహంకారతత్త్వంబు నందు; నహంకారంబును మహత్తత్త్వంబు నందు; మహత్తత్త్వంబును బ్రకృతి యందు; బ్రకృతిని నక్షరుండైన పరమాత్మ యందు లయంబు నొందించి చిన్మాత్రావశేషితుం డయిన క్షేత్రజ్ఞుని నక్షరత్వంబున నెఱింగి ద్వయరహితుండై దగ్ధకాష్ఠుండైన వహ్ని చందంబున బరమాత్మ యైన నిర్వికారబ్రహ్మంబునందు లీనుండ గావలయు.

టీకా:

అటమీద = ఆ తరువాత; గృహస్థాశ్రమంబున్ = సాంసారికమార్గమును; విడిచి = వదలివేసి; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; దున్నక = దున్నకుండగనే; పండెడి = పంటనిచ్చెడి; నీవార = తృణధాన్యములు; ఆదికంబుల్ = మున్నగువానిని; అగ్ని = నిప్పులమీద; పక్వంబు = పచనము, వండుట; చేసి = చేసి; ఒండెన్ = కాని; ఆమంబులు = పచ్చివిగా, అపక్వముగా; చేసి = చేసి; ఒండెన్ = కాని; అర్క = సూర్యుని యెండయందు; పక్వంబులు = ఎండబెట్టబడినవి, ఒరుగులు; ఐన = అయిన; ఫల = పండ్లు; ఆదులు = మున్నగునవి; ఒండెన్ = కాని; భక్షింపుచున్ = తినుచు; వన్య = అడవి యందు దొరకెడి; ఆహారంబులన్ = ఆహారములతో; నిత్య = ప్రతిదినము; కృత్యంబులు = చేయదగినవి; ఐన = అయిన; చరువు = హవ్యము, అత్తెసరన్నము; పురోడాంశంబులు = యజ్ఞార్థమైన పిండములు; ఒనర్చుచున్ = చేయుచు; ప్రతి = ప్రతియొక్క; దినంబున్ = దినమునందు; పూర్వ = ఇంతకుముందు; సంచితంబులు = కూడబెట్టినవానిని; పరిత్యజించి = విడిచిపెట్టేసి; నూతన = కొత్తవియైన; ద్రవ్యంబులున్ = పదార్థములు; సంగ్రహించుచున్ = సంపాదించుచు; అగ్ని = అగ్నిహోత్రము; కొఱకు = కోసము; పర్ణశాల = పాక, ఆకుటిల్లు; ఐనన్ = అయినను; పర్వత = కొండ; కందరంబున్ = గుహను; అయినన్ = అయినను; ఆశ్రయించుచున్ = చేరుచు; హిమ = మంచు; వాయు = గాలి; వహ్ని = నిప్పు; వర్ష = వాన; ఆతపంబుల్ = ఎండల; కున్ = కు; సహించుచు = ఓర్చుకొనుచు; నఖ = గోర్లు; శ్మశ్రు = మీసములు; కేశ = శిరోజములు; తనూరుహంబులునే = ఒడలివెంట్రుకలు; ప్రసాధితంబులున్ = చక్కజేయుట; చేయక = చేయకుండగ; జటిలుండు = జటలుదాల్చినవాడు; ఐ = అయ్యి; వసియించుచున్ = నివసించుచు; దండ = దండము; అజిన = చర్మము (ఆసనమునకు); కమండలున్ = కమండలము; వల్కల = నారచీర; పరిచ్ఛదంబులున్ = ఉత్తరీయములు; ధరియించి = తాల్చి; పండ్రెండున్ = పన్నెండు (12); ఐనన్ = అయిన; ఎనిమిది = ఎనిమిది (8); ఐనన్ = అయిన; నాలుగు = నాలుగు (4); ఐనన్ = అయిన; రెండు = రెండు (2); ఐనన్ = అయిన; ఒక = ఒక; వత్సరంబు = సంవత్సరము; అయినన్ = అయిన; తపః = తపస్సుయొక్క; ప్రయాసంబునన్ = క్లేశముతోటి; బుద్ధి = చిత్తము; నాశంబున్ = భ్రంశము; కాకుండన్ = కాకుండగ; ముని = ముని; ఐ = అయ్యి; చరించుచన్ = తిరుగుచు; దైవ = దైవ; వశంబునన్ = యోగమువలన; జర = ముసలితనము; రోగంబుల = రోగముల; చేతన్ = వలన; చిక్కి = నీరసించి; నిజ = తన; ధర్మ = ధర్మములను; అనుష్ఠాన = ఆచరించుటల యందు; సమర్థుండు = తగిన శక్తి గలవాడు; కాని = కానట్టి; సమయంబునన్ = సమయములలో; నిరశనవ్రతుండు = ఉపవాసమున నున్నవాడు; అయి = అయ్యి; అగ్నులన్ = అగ్నులను; ఆత్మా = తనయందు; ఆరోపణంబు = నిలుపుకొనుట; చేసి = చేసి; సన్యసించి = ఎల్లకర్మలనువర్జించి; ఆకాశంబునన్ = ఆకాశము; అందున్ = అందు; శరీర = దేహము యొక్క; రంధ్రంబులును = రంధ్రములను; గాలి = గాలి; అందున్ = అందు; నిశ్శ్వాసంబును = ఊపిరిని; తేజంబున్ = అగ్ని; లోపలన్ = అందు; ఊష్మంబును = దేహమందలి వేడిని; జలంబులన్ = నీటి యందు; రసంబును = దేహమందలి ద్రవములను; ధరణి = భూమి; అందున్ = అందు; శల్య = ఎముకలు; మాంస = మాంసము; ప్రముఖంబులును = మున్నగునవి; వహ్ని = అగ్ని; అందున్ = అందు; వ్యక్తంబు = పలుకదగినదాని; తోడన్ = తోటి; వాక్కునున్ = మాటను; ఇంద్రుని = ఇంద్రుని; అందున్ = అందు; శిల్పంబు = శిల్పము; తోడన్ = తోటి; కరంబులును = చేతులు; విష్ణుని = విష్ణుమూర్తి; అందున్ = అందు; గతి = నడక; తోడన్ = తోటి; పదంబులునున్ = కాళ్ళు; ప్రజాపతి = ప్రజాపతి; అందున్ = అందు; రతి = సురతము; తోడన్ = తోటి; ఉపస్థంబునున్ = రహస్యావయవము; మృత్యువు = మరణము; అందున్ = అందు; విసర్గంబు = మలవిసర్జన; తోడన్ = తోటి; పాయువును = గుదమును; దిక్కులు = దిక్కులు; అందున్ = అందు; శబ్దంబు = ధ్వని; తోడన్ = తోటి; శ్రోత్రంబును = చెవి; వాయువు = గాలి; అందున్ = అందు; స్పర్శంబు = స్పర్శ (తగులుట); తోడన్ = తోటి; త్వక్కును = చర్మము; సూర్యున్ = సూర్యుని; అందున్ = అందు; రూపంబు = రూపము; తోడన్ = తోటి; చక్షువులును = కన్నులు; సలిలంబు = నీటి; అందున్ = అందు; ప్రచేతస్ = వరుణాంశముతో; సహిత = కూడినది; అయిన = అయిన; జిహ్వయున్ = నాలుక; క్షితి = భూమి; అందున్ = అందు; గంధ = వాసనతో; సహితంబున్ = కూడినది; అయిన = అయిన; ఘ్రాణంబునున్ = ముక్కు; చంద్రుని = చంద్రుని; అందున్ = అందు; మనోరథంబుల = కోరికల; తోడన్ = తోటి; మనంబునున్ = మనస్సును; కవి = పాత్రలసృష్టించువాడు; ఐన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; అందున్ = అందు; బోధంబు = తెలివి; తోడన్ = తోటి; బుద్ధియున్ = బుద్ధి; రుద్రుని = శివుని; అందున్ = అందు; అహంకారంబు = నేనడిభావము; తోడన్ = తోటి; మమత్వంబును = నాదియనెడిభావమును; క్షేత్రజ్ఞుని = జీవుని; అందున్ = అందు; సత్త్వంబు = సామర్థ్యము; తోడన్ = తోటి; చిత్తంబును = చిత్తమును; పరంబున్ = పరబ్రహ్మ; అందున్ = అందు; గుణంబుల = గుణముల; తోడన్ = తోటి; వైకారికంబును = వికారము నొందిన చిత్తమును; డిందించి = చెందించి; అటమీద = ఆపైన; పృథివి = భూమి; అందున్ = అందు; పృథివిని = భూమిని; జలంబుల్ = నీటి; అందున్ = అందు; జలంబును = నీటిని; తేజంబున్ = అగ్ని; అందున్ = అందు; తేజంబునున్ = అగ్నిని; వాయువు = గాలి; అందున్ = అందు; వాయువును = గాలిని; గగనంబు = ఆకాశము; అందున్ = అందు; గగనంబునున్ = ఆకాశమును; అహంకార = అంహకారము; తత్త్వంబున్ = లక్షణము; అందున్ = అందు; అహంకారంబునున్ = అహంకారమును; మహత్తత్వంబున్ = బుద్ధి; అందున్ = అందు; మహత్తత్వంబునున్ = బుద్ధిని; ప్రకృతి = మూలప్రకృతి; అందున్ = అందు; ప్రకృతినిన్ = ప్రకృతిని; అక్షరుండు = నాశములేనివాడు; ఐన = అయిన; పరమాత్మ = పరమాత్మ; అందున్ = అందు; లయంబు = విలీనము; ఒందించి = చేసి; చిత్ = జ్ఞానము; మాత్ర = మాత్రమే; అవశేషితుండు = మిగిలినవాడు; అయిన = ఐన; క్షేత్రజ్ఞుని = జీవుని; అక్షరత్వంబునన్ = అవికారభావమునందు; ఎఱింగి = తెలిసికొని; ద్వయ = రెండవది, ఇతరము; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి; దగ్ధ = కాల్చబడిన; కాష్ఠుండు = కఱ్ఱలుగలవాడు; ఐన = అయిన; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; పరమాత్మ = పరమాత్మ; ఐన = అయిన; నిర్వికార = శాశ్వత, మార్పులేని; బ్రహ్మంబు = బ్రహ్మము; అందున్ = అందు; లీనుండున్ = లయమైనవాడు; కావలయున్ = అయిపోవలెను.

భావము:

గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వర్తించిన పిమ్మట వానప్రస్థాశ్రమం ఆరంభించాలి; అరణ్యాలలో నివసించాలి; అక్కడ దున్నకుండా దొరికే తృణ ధాన్యాలు ఉడకబెట్టినవి కానీ, పచ్చివి కానీ, ఎండలో ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ జీవించాలి; అడవిలో లభించే ఆహారాలతో హవిస్సు పురోడాంశాదులు చేస్తూ, ప్రతి నిత్యం యజ్ఞం నిర్వహించాలి; నిన్నటి రోజు మిగిలిన పదార్థాలను పారేసి, ఏ రోజు కా రోజు క్రొత్తవి సంపాదించుకోవాలి; అగ్నిని కాపాడుకోవటం కోసం పర్ణశాలను కాని, కొండగుహను కానీ ఆశ్రయించ వచ్చును; గాలీ, చలీ, ఎండా, వానా మున్నగు వాటిని సహించాలి; గడ్డం గీసుకోరాదు; క్షౌరం పనికిరాదు; తల దువ్వుకోరాదు; కేవలం జటిలుడై జీవించాలి; దండం, కమండలం, జింకచర్మాలు, నారబట్టలూ ధరించాలి; పన్నెండేళ్లు కానీ, ఎనిమదేళ్ళు కానీ, నాలుగేళ్లు కానీ, రెండేళ్లు కానీ, ఒక సంవత్సరం కానీ ఏకాగ్రచిత్తంతో తపస్సు చేయాలి; బుద్ధిని చలించనీయకుండా మౌనియై జీవించాలి.
దైవవశాత్తూ కానీ, వృద్ధాప్యం వల్ల కానీ, రోగం వల్ల కానీ తన ధర్మాలూ, అనుష్ఠానాలు చేయలేని పరిస్థితులలో నిరాహార వ్రతం పూనాలి. ఆత్మ యందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. శరీర రంధ్రాలను ఆకాశంలోనూ, నిశ్వాసం గాలిలోనూ, శరీరంలోని వేడిని తేజస్సులోనూ, రసం జలంలోనూ, శల్య మాం సాదులను మట్టిలోనూ విలీనం చేయాలి. వాక్కును వక్తృత్వంతో పాటూ అగ్ని యందూ, హస్త ద్వయాన్ని శిల్పంతో పాటూ ఇంద్రుని యందూ, పాద ద్వయాన్ని నడకతో పాటు మృత్యువు నందూ, శ్రోత్రద్వయాన్ని శబ్దంతోపాటు దిక్కుల యందూ, చర్మాన్ని స్పర్శతో పాటూ వాయువు నందూ, కళ్ళను రూపంతో పాటు సూర్యుని యందూ అనుసంధానం చేయాలి. జిహ్వను వరుణ సహితంగా నీటి యందూ, నాసికను గంధ సహితంగా భూమి యందూ, మనస్సును మనోరథంతో పాటు చంద్రుని యందూ, బుద్ధిని బోధంతో పాటు కవియైన బ్రహ్మ యందూ, మమత్వమును అహంకారంతో పాటు రుద్రుని యందూ, మనస్సును సత్యంతో పాటు క్షేత్రజ్ఞుని యందూ, వికారం పొందిన క్షేత్రజ్ఞుని గుణాలతో పాటు పరబ్రహ్మము నందూ విలీనం చేయాలి. ఈ విధంగా ఆయా విషయేంద్రియాలను ఆయా అధిదేవతలతో ఐక్యం కావించాలి.
అటు పిమ్మట పృథ్విని జలంలోనూ, జలమును తేజస్సులోనూ, తేజస్సును వాయువు లోనూ, వాయువును గగనంలోనూ, గగనమును అహంకార తత్త్వములోనూ, అహంకారాన్ని మహత్తత్త్వంలోనూ, మహత్తత్త్వమును ప్రకృతిలోనూ, ప్రకృతిని శాశ్వతుడైన పరమాత్మలోనూ లయం చేయాలి. అపుడు కేవలం చిన్మయుడుగా మిగిలిన క్షేత్రజ్ఞుడిని జ్ఞానంతో తెలుసుకుని, అద్వైతుడై కట్టెలను దహించిన అగ్నివలె పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మములో విలీనం కావాలి.